బొగ్గు ఫైళ్ల గల్లంతుపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపుల ఫైళ్లలో కొన్ని అందుబాటులో లేవని కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై సుప్రీంకోర్టు మండిపడింది. 1993-2009 మధ్యకాలంలోని పత్రాలు, సమాచారం, ఫైళ్లు కనిపించడం లేదని ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. కనిపించకుండా పోయిన వాటిపై కనీసం పోలీసు ఫిర్యాదన్నా చేశారా లేదా అని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ ఆర్‌ఎం లోధా, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌ల నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఈ కేసును విచారించింది. ‘కనిపించని ఫైళ్లపై కేసు ఎందుకు నమోదుచేయలేదు? అవి మొత్తానికే పోయాయా? లేక మళ్లీ దొరికే అవకాశముందా?’ అని ప్రభుత్వాన్ని అడిగింది.
ఈ కేసులో సీబీఐ అడిగిన పత్రాలు, సమాచారం, ఫైళ్లను రెండువారాల్లోగా అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేసు దర్యాప్తుపై అక్టోబర్ 22 నాటికి స్థాయీ నివేదికను సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. బొగ్గు కుంభకోణంలో అధికారుల పాత్రపై విచారణ అంశం సీబీఐ, కేంద్రం మధ్య పరస్పరం ఘర్షణ వాతావరణం నెలకొంది. కోర్టు స్వయంగా పర్యవేక్షిస్తున్న ఈ కేసులో అధికారులను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదని సీబీఐ తన వాదనను కొనసాగిస్తుండగా, ప్రభుత్వం మాత్రం వ్యతిరేకిస్తోంది. మరోవైపు, కేసు దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ‘మీరింకా ఫస్ట్‌గేర్‌లోనే ఉన్నారు. వేగం పెంచండి’ అని జస్టిస్ లోధా సీబీఐని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తుది చార్జిషీట్లను సీబీఐ తమ న్యాయవాదులతో పంచుకునేందుకు కోర్టు అనుమతించింది.