అంతా ఏకపక్షం, ఆషామాషీ..
గోపాల సుబ్రమణియం వ్యవహారంలో మోడీ సర్కార్ తీరుపై సీజేఐ విమర్శ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం ఎంపికచేసిన నాలుగు పేర్ల ప్యానెల్‌నుంచి మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రమణియం పేరును పక్కన పెడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా మంగళవారం తీవ్రంగా విమర్శించారు. తనకు తెలియపరచడం లేదా, అనుమతి తీసుకోవడంలాంటివి ఏవీ లేకుండా ప్రభుత్వం ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిందని జస్టిస్ లోధా వ్యాఖ్యానించారు.
న్యాయ విభాగం స్వతంత్రత విషయంలో రాజీపడేది లేదని, అలా జరిగినట్టు తెలిసిన రోజున ఒక క్షణంకూడా తన పదవిలో ఉండజాలనని లోధా స్పష్టం చేశారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ చౌహాన్‌కు ఢిల్లీలో మంగళవారం ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశంలో లోధా మాట్లాడుతూ, తొలిసారిగా ఈ వివాదంపై నోరువిప్పారు. ఉన్నతస్థాయి రాజ్యాంగ పదవి అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకం విషయంలో ఇంత ఆషామాషీగా, నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారో తనకు అర్థంకావడంలేదన్నారు.
గత నెల 28వ తేదీన తాను విదేశీపర్యటనుంచి తిరిగి వచ్చేటప్పటికి, న్యాయశాఖకు సంబంధించిన ఫైలు తన కార్యాలయానికి పంపారని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి సంబంధించి ఎంపికైన నాలుగు పేర్లలో మూడు పేర్లు ఆమోదం పొందినట్టు పైలులో ఉందని, తద్వారా గోపాల సుబ్రమణియం పేరును పక్కన పెట్టారని జస్టిస్ లోధా అన్నారు. గోపాల సుబ్రమణియం వ్యవహారంలో ప్రధాన న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు,. లోధా వ్యాఖ్యలపట్ల ప్రభుత్వం కూడా స్పందించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే తమకు అత్యున్నత గౌరవం ఉందని పేర్కొంది. ఈ విషయంలో గత సంప్రదాయాన్ని, ఆనవాయితీని పాటించామని, న్యాయమూర్తి నియామకానికి సంబంధించి ఎంపికైన నామినీపై పునరాలోచన చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.