Gopal Subramaniam
-
9 కాదు 18 ఏళ్లు...
► మొత్తం పదవీకాలంపై స్పష్టతనిచ్చిన సుప్రీం కోర్టు ►బీసీసీఐ ప్రతినిధులకు ఊరట న్యూఢిల్లీ: బీసీసీఐ, రాష్ట్ర సంఘాల్లో పదవులు చేపట్టడానికి సంబంధించి కాలపరిమితిపై సుప్రీం కోర్టు మరింత స్పష్టతనిచ్చింది. ఈ నెల 2న ఇచ్చిన తీర్పులో బోర్డులో గానీ, రాష్ట్ర సంఘంలో గానీ మొత్తం తొమ్మిది సంవత్సరాలు ఆఫీస్ బేరర్‌గా వ్యవహరిస్తే మరే పదవినీ స్వీకరించేందుకు అనర్హులని సుప్రీం చెప్పింది. దీంతో బీసీసీఐ, రాష్ట్ర సంఘాల్లో దాదాపు సగంకంటే ఎక్కువ మంది పదవీచ్యుతులు అయ్యే అవకాశం కనిపించింది. అయితే దీనిపై మరింత స్పష్టత కోరుతూ పెద్ద సంఖ్యలో లోధా కమిటీకి లేఖలు వచ్చాయి. దాంతో సుప్రీం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐలో 9 ఏళ్లు, రాష్ట్ర సంఘంలో మరో 9 ఏళ్లు కలిపి మొత్తం 18 ఏళ్ల పాటు ఆఫీస్ బేరర్‌గా కొనసాగవచ్చని ఆదేశాలిచ్చింది. ఈ ఉత్తర్వులతో బీసీసీఐలోని పలువురు పెద్దలకు ఊరట లభించింది. ఇప్పుడు మరికొందరు క్రికెట్ పరిపాలనలో ఎక్కువ కాలం కొనసాగేందుకు అవకాశం దక్కనుంది. మరోవైపు బోర్డు వ్యవహారాలు పర్యవేక్షించేందుకు శుక్రవారం అడ్మినిస్ట్రేటర్లను ప్రకటించాల్సిన సుప్రీంకోర్టు తమ నిర్ణయాన్ని ఈ నెల 24కు వాయిదా వేసింది. ఇందులో ఉండేం దుకు అర్హత ఉన్న పేర్లతో అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియమ్, అనిల్ దివాల్ ఇచ్చిన జాబితా లో తొమ్మిది మంది ఉన్నట్లు తెలిసింది. అయితే జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్ విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ప్రత్యేక బెంచ్, ఈ సంఖ్య చాలా ఎక్కువని అభిప్రాయ పడుతూ ఇందులోనూ 70 ఏళ్లకు పైబడినవారు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. -
మా నిర్ణయం సరైనదే!
* గోపాల సుబ్రమణ్యం వివాదంపై ప్రభుత్వం స్పష్టీకరణ * జడ్జీల నియామకంపై ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనన్న రవిశంకర్ * న్యాయవ్యవస్థపై అపార గౌరవం ఉందని వ్యాఖ్య న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణ్యం నియామకానికి సంబంధించిన వివాదంపై కేంద్రప్రభుత్వం బుధవారం స్పందించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన గోపాల సుబ్రమణ్యం పేరును వెనక్కుపంపిన తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ‘ఆ నిర్ణయం వెనుక బలమైన, సముచితమైన కారణం ఉంద’ని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఉన్నత న్యాయవ్యవస్థలో జడ్జీల నియామకంలో ప్రభుత్వాన్ని సంప్రదించాలని, అది ప్రభుత్వ హక్కని తేల్చి చెప్పారు. బుధవారం ఉదయం మరో సందర్భంలో రవిశంకర్ మాట్లాడుతూ.. ‘న్యాయవ్యవస్థపై, సుప్రీంకోర్టుపై, ప్రధాన న్యాయమూర్తిపై మోడీ ప్రభుత్వానికి అపార గౌరవం ఉంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతపైనా ప్రభుత్వానికి విశ్వాసం ఉంది’ అన్నారు. సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణ్యంను సుప్రీంజడ్జీగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసును ప్రభుత్వం పక్కనపెట్టడాన్ని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా మంగళవారం తీవ్రంగా తప్పుబట్టడం తెలిసిందే. కొలీజియం పంపిన జాబితాపై పరిశీలన ప్రక్రియ కొనసాగుతుండగానే.. తనను ఆ జాబితా నుంచి తొలగించాల్సిందిగా గోపాల సుబ్రమణ్యం నుంచి అభ్యర్థన రావడంతో ఆయన పేరును పక్కనబెట్టామని అంతకుముందు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే, నలుగురి పేర్లతో కొలీజియం ఒక జాబితా పంపించిందని, వారిలో కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుణ్ మిశ్రా, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదర్శ్‌కుమార్ గోయల్, సీనియర్ న్యాయవాది రోహింటన్ నారిమన్‌ల పేర్లకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. గోపాల సుబ్రమణ్యం పేరును మాత్రం పునః పరిశీలన కోసం తిరిగి పంపించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కక్షపూరితం: గోపాల సుబ్రమణ్యం వివాదంపై స్పందిస్తూ.. మోడీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ‘గతంలో అమికస్ క్యూరీగా సోహ్రా బుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో గుజరాత్లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడమే గోపాల సుబ్రమణ్యం పాపం’ అని పార్టీ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. న్యాయవ్యవస్థతో ఘర్షణాత్మక వైఖరితో మోడీ ప్రభుత్వం డేంజర్‌జోన్‌లోకి వెళ్తోందని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ స్పందించింది. ఆ పార్టీ హయాంలోనే రాజ్యాంగ వ్యవస్థలు నాశనమయ్యాయని ఆరోపించింది. జడ్జీలేం సూపర్మ్యాన్లు కాదు.. న్యాయమూర్తులు సూపర్మ్యాన్లేం కాదని, వారికీ విశ్రాంతి అవసరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జస్టిస్ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు. సంవత్సరంలో మొత్తం 365 రోజులూ కోర్టులు పనిచేయాలన్న సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా సూచనపై జస్టిస్ కట్జూ బుధవారం తన బ్లాగ్‌లో స్పందించారు. -
అంతా ఏకపక్షం, ఆషామాషీ..
గోపాల సుబ్రమణియం వ్యవహారంలో మోడీ సర్కార్ తీరుపై సీజేఐ విమర్శ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం ఎంపికచేసిన నాలుగు పేర్ల ప్యానెల్‌నుంచి మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రమణియం పేరును పక్కన పెడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా మంగళవారం తీవ్రంగా విమర్శించారు. తనకు తెలియపరచడం లేదా, అనుమతి తీసుకోవడంలాంటివి ఏవీ లేకుండా ప్రభుత్వం ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిందని జస్టిస్ లోధా వ్యాఖ్యానించారు. న్యాయ విభాగం స్వతంత్రత విషయంలో రాజీపడేది లేదని, అలా జరిగినట్టు తెలిసిన రోజున ఒక క్షణంకూడా తన పదవిలో ఉండజాలనని లోధా స్పష్టం చేశారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ చౌహాన్‌కు ఢిల్లీలో మంగళవారం ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశంలో లోధా మాట్లాడుతూ, తొలిసారిగా ఈ వివాదంపై నోరువిప్పారు. ఉన్నతస్థాయి రాజ్యాంగ పదవి అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకం విషయంలో ఇంత ఆషామాషీగా, నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారో తనకు అర్థంకావడంలేదన్నారు. గత నెల 28వ తేదీన తాను విదేశీపర్యటనుంచి తిరిగి వచ్చేటప్పటికి, న్యాయశాఖకు సంబంధించిన ఫైలు తన కార్యాలయానికి పంపారని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి సంబంధించి ఎంపికైన నాలుగు పేర్లలో మూడు పేర్లు ఆమోదం పొందినట్టు పైలులో ఉందని, తద్వారా గోపాల సుబ్రమణియం పేరును పక్కన పెట్టారని జస్టిస్ లోధా అన్నారు. గోపాల సుబ్రమణియం వ్యవహారంలో ప్రధాన న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు,. లోధా వ్యాఖ్యలపట్ల ప్రభుత్వం కూడా స్పందించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే తమకు అత్యున్నత గౌరవం ఉందని పేర్కొంది. ఈ విషయంలో గత సంప్రదాయాన్ని, ఆనవాయితీని పాటించామని, న్యాయమూర్తి నియామకానికి సంబంధించి ఎంపికైన నామినీపై పునరాలోచన చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.