మా నిర్ణయం సరైనదే!
* గోపాల సుబ్రమణ్యం వివాదంపై ప్రభుత్వం స్పష్టీకరణ
* జడ్జీల నియామకంపై ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనన్న రవిశంకర్
* న్యాయవ్యవస్థపై అపార గౌరవం ఉందని వ్యాఖ్య
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణ్యం నియామకానికి సంబంధించిన వివాదంపై కేంద్రప్రభుత్వం బుధవారం స్పందించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన గోపాల సుబ్రమణ్యం పేరును వెనక్కుపంపిన తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ‘ఆ నిర్ణయం వెనుక బలమైన, సముచితమైన కారణం ఉంద’ని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఉన్నత న్యాయవ్యవస్థలో జడ్జీల నియామకంలో ప్రభుత్వాన్ని సంప్రదించాలని, అది ప్రభుత్వ హక్కని తేల్చి చెప్పారు. బుధవారం ఉదయం మరో సందర్భంలో రవిశంకర్ మాట్లాడుతూ.. ‘న్యాయవ్యవస్థపై, సుప్రీంకోర్టుపై, ప్రధాన న్యాయమూర్తిపై మోడీ ప్రభుత్వానికి అపార గౌరవం ఉంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతపైనా ప్రభుత్వానికి విశ్వాసం ఉంది’ అన్నారు.
సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణ్యంను సుప్రీంజడ్జీగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసును ప్రభుత్వం పక్కనపెట్టడాన్ని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోధా మంగళవారం తీవ్రంగా తప్పుబట్టడం తెలిసిందే. కొలీజియం పంపిన జాబితాపై పరిశీలన ప్రక్రియ కొనసాగుతుండగానే.. తనను ఆ జాబితా నుంచి తొలగించాల్సిందిగా గోపాల సుబ్రమణ్యం నుంచి అభ్యర్థన రావడంతో ఆయన పేరును పక్కనబెట్టామని అంతకుముందు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే, నలుగురి పేర్లతో కొలీజియం ఒక జాబితా పంపించిందని, వారిలో కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుణ్ మిశ్రా, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదర్శ్‌కుమార్ గోయల్, సీనియర్ న్యాయవాది రోహింటన్ నారిమన్‌ల పేర్లకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. గోపాల సుబ్రమణ్యం పేరును మాత్రం పునః పరిశీలన కోసం తిరిగి పంపించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కక్షపూరితం: గోపాల సుబ్రమణ్యం వివాదంపై స్పందిస్తూ.. మోడీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ‘గతంలో అమికస్ క్యూరీగా సోహ్రా బుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో గుజరాత్‌లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడమే గోపాల సుబ్రమణ్యం పాపం’ అని పార్టీ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. న్యాయవ్యవస్థతో ఘర్షణాత్మక వైఖరితో మోడీ ప్రభుత్వం డేంజర్‌జోన్‌లోకి వెళ్తోందని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ స్పందించింది. ఆ పార్టీ హయాంలోనే రాజ్యాంగ వ్యవస్థలు నాశనమయ్యాయని ఆరోపించింది.
జడ్జీలేం సూపర్‌మ్యాన్‌లు కాదు..
న్యాయమూర్తులు సూపర్‌మ్యాన్‌లేం కాదని, వారికీ విశ్రాంతి అవసరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జస్టిస్ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు. సంవత్సరంలో మొత్తం 365 రోజులూ కోర్టులు పనిచేయాలన్న సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోధా సూచనపై జస్టిస్ కట్జూ బుధవారం తన బ్లాగ్‌లో స్పందించారు.