9 కాదు 18 ఏళ్లు...
► మొత్తం పదవీకాలంపై స్పష్టతనిచ్చిన సుప్రీం కోర్టు
►బీసీసీఐ ప్రతినిధులకు ఊరట
న్యూఢిల్లీ: బీసీసీఐ, రాష్ట్ర సంఘాల్లో పదవులు చేపట్టడానికి సంబంధించి కాలపరిమితిపై సుప్రీం కోర్టు మరింత స్పష్టతనిచ్చింది. ఈ నెల 2న ఇచ్చిన తీర్పులో బోర్డులో గానీ, రాష్ట్ర సంఘంలో గానీ మొత్తం తొమ్మిది సంవత్సరాలు ఆఫీస్ బేరర్‌గా వ్యవహరిస్తే మరే పదవినీ స్వీకరించేందుకు అనర్హులని సుప్రీం చెప్పింది. దీంతో బీసీసీఐ, రాష్ట్ర సంఘాల్లో దాదాపు సగంకంటే ఎక్కువ మంది పదవీచ్యుతులు అయ్యే అవకాశం కనిపించింది.
అయితే దీనిపై మరింత స్పష్టత కోరుతూ పెద్ద సంఖ్యలో లోధా కమిటీకి లేఖలు వచ్చాయి. దాంతో సుప్రీం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐలో 9 ఏళ్లు, రాష్ట్ర సంఘంలో మరో 9 ఏళ్లు కలిపి మొత్తం 18 ఏళ్ల పాటు ఆఫీస్ బేరర్‌గా కొనసాగవచ్చని ఆదేశాలిచ్చింది. ఈ ఉత్తర్వులతో బీసీసీఐలోని పలువురు పెద్దలకు ఊరట లభించింది. ఇప్పుడు మరికొందరు క్రికెట్ పరిపాలనలో ఎక్కువ కాలం కొనసాగేందుకు అవకాశం దక్కనుంది.
మరోవైపు బోర్డు వ్యవహారాలు పర్యవేక్షించేందుకు శుక్రవారం అడ్మినిస్ట్రేటర్లను ప్రకటించాల్సిన సుప్రీంకోర్టు తమ నిర్ణయాన్ని ఈ నెల 24కు వాయిదా వేసింది. ఇందులో ఉండేం దుకు అర్హత ఉన్న పేర్లతో అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియమ్, అనిల్ దివాల్ ఇచ్చిన జాబితా లో తొమ్మిది మంది ఉన్నట్లు తెలిసింది. అయితే జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్ విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ప్రత్యేక బెంచ్, ఈ సంఖ్య చాలా ఎక్కువని అభిప్రాయ పడుతూ ఇందులోనూ 70 ఏళ్లకు పైబడినవారు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.