సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారుల విధుల నిర్వహణకు తగిన వాతావరణం కల్పించడంతో పాటు భద్రత కల్పించాలని, ఇందులో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ఐఏఎస్‌ల సంఘం తీర్మానం చేసింది. బొగ్గు కుంభకోణం విషయంలో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌పై సీబీఐ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఐఏఎస్ సంఘం సమావేశ మై పలు తీర్మానాలను ఆమోదించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ సంఘం కార్యదర్శి రేమాండ్ పీటర్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రాజకీయ నాయకులను వదిలేసి బొగ్గు కుంభకోణంలో సీబీఐ.. పీసీ పరేఖ్‌పై కేసు నమోదు చేయడాన్ని సంఘం తీవ్రంగా తప్పుపట్టింది. పరేఖ్ నిబద్ధతగల వ్యక్తి అని కొనియాడింది.
ఆయనకు మద్దతుగా నిలవాలని తీర్మానం చేసింది. ప్రభుత్వంలోని రాజకీయ నేతలను పట్టించుకోకుండా సీనియర్ ఐఏఎస్ అధికారులపై క్రిమినల్ కేసులను నమోదు చేయడంతో పాలనకు ఆటంకం కలుగుతుందని, అంతేకాకుండా ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో విధానపరమైన నిర్ణయాలు స్తంభించిపోతాయని తీర్మానంలో పేర్కొన్నారు. ఐఏఎస్‌లను ఇష్టం వచ్చినట్లు విచారణ సంస్థలు నిందించకుండా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సంఘం కోరింది. పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌లపై కేసు నమోదు చేయాలంటే ముందుగా అనుమతి తీసుకునేలా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19కు సవరణలు తీసుకురావాలని తీర్మానించింది. ప్రతిపాదిత సివిల్ సర్వెంట్స్ ప్రమాణాలు, జవాబుదారీ బిల్లులో.. అధికారులు తీసుకునే నిర్ణయాలకు తగిన రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, బిజినెస్ రూల్స్ పట్ల అవగాహన, అనుభవంగల వారు సీబీఐ విచారణ టీంలో ఉండేలా చూడాలని సంఘం పేర్కొంది.
రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి: ఐఏఎస్‌ల సంఘం
Published Wed, Oct 23 2013 12:45 AM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM
Advertisement
Advertisement