coal allocation
-
కొందామన్నా బొగ్గు ఇవ్వని కేంద్రం
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులకు, ముఖ్యంగా వ్యవసాయానికి ఎటువంటి కొరత రాకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడటం లేదు. పాత, కొత్త బకాయిలు చెల్లిస్తూ ఎప్పటికప్పుడు ఎంత ధర అయినా చెల్లించి బొగ్గును, బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. భవిష్యత్‌లోనూ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును కొనేందుకు సిద్ధంగా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అవసరం మేరకు బొగ్గు అందించకపోగా, కొరత రాకుండా నిల్వలు పెంచుకోవాలంటూ ఉచిత సలహా ఇస్తోంది. సరిపడా బొగ్గు ఇవ్వాల్సిన కేంద్రమే ఇవ్వడం తగ్గించేసి, ఇలా చెప్పడమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. నిల్వలు పెంచుకోండి.. బయటకు అమ్మకండి దేశ విద్యుత్ అవసరాల్లో సుమారు 60 శాతం వరకు థర్మల్ విద్యుత్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని కేంద్రం తాజాగా రాష్ట్రాలకు తెలిపింది. ఈ అవసరాలు తీర్చడానికి థర్మల్ పవర్ స్టేషన్లలో 9 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవడం ద్వారా నిల్వలు పెంచుకోవాలని దేశంలోని దాదాపు 135 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కేంద్రం సూచించింది. అదేవిధంగా ఉత్పత్తి సంస్థలు తాము చేసుకున్న ఒప్పందాల ప్రకారం కొనుగోలుదారుల అనుమతి లేకుండా బయటివారికి విద్యుత్‌ను విక్రయిస్తే పవర్ ఎక్స్చేంజ్లో మూడు నెలలపాటు పాల్గొనకుండా డిబార్ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, జరిమానా విధిస్తామని కేంద్రం తాజాగా హెచ్చరించింది. దీనికోసం విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 63 మార్గదర్శకాల్లో క్లాజ్ 6.4లో కొత్తగా ‘జి’ నిబంధన తెచ్చింది. అడిగినా ఇవ్వని కేంద్రం ఏటా అక్టోబర్ నుంచి జనవరి వరకు రాబోయే వేసవి కోసం బొగ్గు నిల్వలు పెంచుతాయి. ఈ వేసవిలో రాష్ట్రంలో 225 మిలియన్ యూనిట్లకు విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంచనా. కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచితే తప్ప వేసవి అవసరాల నుంచి బయటపడలేం. గతేడాది బొగ్గు కొరత ఏర్పడినప్పటి నుంచి కేంద్ర విద్యుత్ శాఖ అధికారులతోపాటు కోల్, రైల్వే అధికారులు కమిటీగా ఏర్పడి బొగ్గు కేటాయింపులు చేస్తున్నారు. ప్రస్తుతం కోల్ ఇండియా నుంచి రాష్ట్రానికి రోజువారీ అవసరాలకు మాత్రమే బొగ్గు కేటాయింపు జరుగుతోంది. సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్ నుంచి రావాల్సినంత బొగ్గు రావడం లేదు. వేసవి కోసం బొగ్గు నిల్వ చేయడానికి రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరింది. ఆ మేరకు కూడా ఇవ్వడం లేదు. కేవలం 10 నుంచి 12 ర్యాక్‌లు మాత్రమే వస్తున్నాయి. ఏపీ జెన్కో నుంచి 45 శాతం విద్యుత్ రాష్ట్రంలో ప్రస్తుతం 200 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. మనకు 5,010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. వీటినుంచి 85 మిలియన్ యూనిట్లు, హైడల్ 8.5 మిలియన్ యూనిట్లు, సోలార్ 2.4 మిలియన్ యూనిట్ల చొప్పున 97 మిలియన్ యూనిట్ల మేర రోజు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో అంతర్గత వినియోగం పోనూ 92 మిలియన్ యూనిట్లు గ్రిడ్‌కు వెళుతోంది. అంటే మొత్తం డిమాండ్‌లో 45 శాతం ఏపీ జెన్కో ద్వారా సమకూరుతోంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 60 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీపీసీ, కృష్ణపట్నం, ఆర్టీపీపీలో బొగ్గు నిల్వలు నాలుగు రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. ఎంతైనా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ జెన్కో సిద్ధంగా ఉన్నాయి. కానీ కేంద్రం నుంచి కేటాయింపులు రావడం లేదు. – బి.శ్రీధర్, ఎండీ, ఏపీ జెన్కో -
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
సాక్షి, అమరావతి: ఒడిశా రాష్ట్రంలో గల తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్‌కు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన తర్వాత బొగ్గు నిల్వల్లో కనీస వాటాను కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వలేదని ప్రధానికి వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బొగ్గు మీదే ఎక్కువగా ఆధారపడుతున్నామని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. లేఖలోని అంశాలు: రాష్ట్రంలోని ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్ధ్యం 5010 మెగావాట్లు. మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్‌ల నుంచి బొగ్గు సరఫరా కోసం ఒప్పందాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాలకు సరిపడా బొగ్గు, సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ నుంచే సరఫరా అయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత సింగరేణి కోల్ కాలరీస్‌ను తెలంగాణకు కేటాయించారు. కనీసం బొగ్గు నిల్వల్లో వాటాను కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల నుంచే వచ్చే బొగ్గు మీదే ఎక్కువగా ఆధారపడుతున్నాం. దీనివల్ల రాష్ట్ర విద్యుత్ రంగంలో భరోసా లేకుండా పోయింది. ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు ఈ పరిస్ధితి తీవ్ర అవరోధంగా మారింది. పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో అపారమైన బొగ్గు నిక్షేపాలున్నాయి. ఐబీ వ్యాలీ, మరియు తాల్చేరు క్షేత్రాల్లో భారీగా బొగ్గు నిల్వలున్నాయి. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్ఘడ్, తెలంగాణాలు బొగ్గు సంపద ఉన్న రాష్ట్రాలు. వాణిజ్య అవసరాల కోసం మధ్యప్రదేశ్‌లో ఒకటి, చత్తీస్‌ఘడ్‌లో ఒక గనిని ఏపీఎండీసీ కి కేటాయించారు. ప్రతీ గని నుంచి 5ఎంఎంటీఏలు తీసుకోవచ్చని చెప్పారు. కానీ ఈ గనుల నుంచి బొగ్గు వెలికితీయడానికి నిర్వహణా వ్యయం చాలా అధికంగా ఉంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ బొగ్గు గనుల చట్టం–2015 ప్రకారం ట్రాంచీ–6ను ఏపీజెన్కో వినియోగం కోసం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. పై అంశాన్ని పరిగణలోకి తీసుకుని బొగ్గు మంత్రిత్వశాఖకు ఏపీజెన్కో దరఖాస్తు చేసుకుంది. మార్చి 2020 నాటికి ఏపీ జెన్కో తన థర్మల్ కేంద్రాల ద్వారా మరో 1600 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పాదనకు సిద్ధమవుతోంది. ఈ అదనపు విద్యుత్ తయారీకోసం ఏటా 7.5 ఎంఎంటీఏల బొగ్గు నిల్వలు అవసరం ఉంది. అంతేకాక ప్రస్తుతం ఎదుర్కొంటున్న బొగ్గు కొరతను నివారించడానికి, బొగ్గు ఒప్పందాల ప్రకారం మరింత బొగ్గును సరఫరాచేయాల్సి ఉంది. మందానికిని ‘‘ఎ’’ కోల్ బ్లాక్, తాల్చేరు కోల్‌ఫీల్డ్, అంగుల్ బొగ్గు క్షేత్రాలను వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మందాకిని కోల్ బ్లాక్ ను ఏపీజెన్ కోకు కేటాయించాలని కోరుతున్నాం. కేంద్ర బొగ్గుశాఖ ప్రకటించిన విధంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో ఏడాదికి కనీసం 50 ఎంఎంటీఏ బొగ్గును ఏపీఎండీసీ, ఏపీ జెన్కోకు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నా’మని లేఖలో పేర్కొన్నారు. -
‘కోల్గేట్’పై సుప్రీంకు నివేదిక
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో ఇప్పటివరకూ తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలపై సీబీఐ సోమవారం సుప్రీంకోర్టుకు నివేదికను అందజేసింది. సీల్డ్ కవర్లో అందజేసిన ఈ నివేదికను జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం పరిశీలించనుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 195 బొగ్గు గనుల లీజుల కేటాయింపులో కుంభకోణం జరిగినట్లుగా ఆరోపణలొచ్చిన విషయం తెలిసిందే. 60 బొగ్గు గనుల కేటాయింపుల్లో ఎలాంటి అక్రమాలూ కనిపించలేదని సీబీఐ ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి: ఐఏఎస్‌ల సంఘం
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారుల విధుల నిర్వహణకు తగిన వాతావరణం కల్పించడంతో పాటు భద్రత కల్పించాలని, ఇందులో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ఐఏఎస్‌ల సంఘం తీర్మానం చేసింది. బొగ్గు కుంభకోణం విషయంలో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌పై సీబీఐ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఐఏఎస్ సంఘం సమావేశ మై పలు తీర్మానాలను ఆమోదించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ సంఘం కార్యదర్శి రేమాండ్ పీటర్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రాజకీయ నాయకులను వదిలేసి బొగ్గు కుంభకోణంలో సీబీఐ.. పీసీ పరేఖ్‌పై కేసు నమోదు చేయడాన్ని సంఘం తీవ్రంగా తప్పుపట్టింది. పరేఖ్ నిబద్ధతగల వ్యక్తి అని కొనియాడింది. ఆయనకు మద్దతుగా నిలవాలని తీర్మానం చేసింది. ప్రభుత్వంలోని రాజకీయ నేతలను పట్టించుకోకుండా సీనియర్ ఐఏఎస్ అధికారులపై క్రిమినల్ కేసులను నమోదు చేయడంతో పాలనకు ఆటంకం కలుగుతుందని, అంతేకాకుండా ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో విధానపరమైన నిర్ణయాలు స్తంభించిపోతాయని తీర్మానంలో పేర్కొన్నారు. ఐఏఎస్‌లను ఇష్టం వచ్చినట్లు విచారణ సంస్థలు నిందించకుండా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సంఘం కోరింది. పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌లపై కేసు నమోదు చేయాలంటే ముందుగా అనుమతి తీసుకునేలా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19కు సవరణలు తీసుకురావాలని తీర్మానించింది. ప్రతిపాదిత సివిల్ సర్వెంట్స్ ప్రమాణాలు, జవాబుదారీ బిల్లులో.. అధికారులు తీసుకునే నిర్ణయాలకు తగిన రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, బిజినెస్ రూల్స్ పట్ల అవగాహన, అనుభవంగల వారు సీబీఐ విచారణ టీంలో ఉండేలా చూడాలని సంఘం పేర్కొంది. -
సీబీఐకి మరికొన్ని ‘బొగ్గు’ ఫైళ్లు!
న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపులకు సంబంధించి తాజాగా మరికొన్ని ఫైళ్లు, పత్రాలు సోమవారం సీబీఐకి అందాయి. బొగ్గు శాఖ నుంచి తాజాగా వచ్చిన ఫైళ్లు, పత్రాల పరిశీలన మొదలైందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఇంకా తమకు ఎన్ని ఫైళ్లు రావాలో అనే విషయంపై అంచనాకు వస్తామని పేర్కొన్నాయి. కాగా, ఫైళ్లు, పత్రాలతోపాటు గల్లంతైన ఫైళ్లకు సంబంధించి బొగ్గు మంత్రిత్వ శాఖ సీబీఐకి సమగ్ర నివేదిక సమర్పించినట్టు ఆశాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే అందులో ఉన్న వివరాల గురించి వెల్లడించేందుకు నిరాకరించారు. అది అత్యంత రహస్యమైన అంశమని, దాని గురించి తాను మాట్లాడబోనని పేర్కొన్నారు. కాగా, బొగ్గు కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లను సీబీఐకి పంపించారా లేదా అనే అంశంపై ఆ శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైశ్వాల్ ఏ విషయమూ వెల్లడించలేదు. మరోవైపు గల్లంతైన బొగ్గు ఫైళ్ల వ్యవహారంపై ఎప్పుడు ఫిర్యాదు చేస్తారని అడగ్గా.. ‘సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, చట్టప్రకారం నిర్దేశించిన సమయంలోనే తగిన చర్యలు తీసుకుంటాం’ అని బొగ్గుశాఖ అధికారి బదులిచ్చారు.