నిజాం షుగర్స్‌పై రాజకీయ కుట్ర | Political conspiracy on Nizam sugars | Sakshi
Sakshi News home page

నిజాం షుగర్స్‌పై రాజకీయ కుట్ర

Published Sat, Dec 21 2013 4:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

Political conspiracy on Nizam sugars

బోధన్, న్యూస్‌లైన్ :  నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుతో ఈ ప్రాంత రైతులు, ఫ్యాక్టరీలోని కార్మికుల్లో హర్షం వ్యక్తమైంది. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుం దని, తమ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని ఆనందించారు. అయితే రాష్ట్ర విభజన పూర్తికాకముందే నిజాం షుగర్స్‌ను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ సమావేశంలో ఫ్యాక్టరీ అంశం చర్చకు వచ్చేలా, ప్రైవేటీకరణ కు అనుకూల వాతావరణం కల్పించేలా ఆ కంపెనీ చూసినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటయ్యే కొత్త సర్కారు ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటుందన్న భయంతో ఆ కంపెనీ కుట్రలు పన్నుతోందని రైతులు, తెలంగాణవాదులు అనుమానాలు వ్యక్తం చేశారు.
 
 అధికార పక్ష నేతలపై ఆగ్రహం
 బోధన్ పట్టణంలోని సీడీసీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ఉన్న రైతుల తో సమావేశం ఏర్పాటు చేసి, ప్రైవేట్ సంస్థకు అనుకూలంగా తీర్మానం చేయించారు. దీంతో ఫ్యాక్టరీని పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకే ప్రభుత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం బోధన్ సీడీసీ కార్యాయలంలో డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ, సీడీసీ చైర్మన్ పోతారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగాశంకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ పాషామోహినొద్దీన్‌ల ఆధ్వర్యంలో చెరుకు రైతుల సమావేశం ఏర్పాటు చేశారు. నిజాం షుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా, ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టాలా అన్న అంశంపై అభిప్రాయాలు సేకరించారు. అధికార పక్షానికి అనుకూలంగా ఉన్న రైతులు కొందరిని పిలిచి ప్రైవేట్ సంస్థకు అనుకూలంగా తీర్మానం చేయించారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శక్కర్‌నగర్‌లోని ఎన్‌డీఎస్‌ఎల్ ఎదుట బీఎంఎస్ కార్యదర్శి ఈరవేణి సత్యనారాయణ అధ్వర్యం లో కార్మికులు ఆందోళన చేశారు. ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా తీర్మానం చేసిన అధికార పక్ష నేతల చిత్రపటాన్ని దహనం చేశారు. ఫ్యాక్టరీ జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
 
 రాజకీయ కుట్ర
 నిజాం షుగర్స్‌ను ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం రాజకీయ కుట్ర చేస్తోందని ఎన్‌డీఎస్‌ఎల్ షుగర్ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి రాజయ్య ఆరోపించారు. ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ప్రైవేట్ కంపెనీ ఏనాడూ పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. ఫ్యాక్టరీ స్వాధీనంపై శాసనసభా సంఘం సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
 
 ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
 నిజాం షుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కేపీ శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం శక్కర్‌నగర్ ఎన్‌ఎస్‌ఎఫ్ విశ్రాంతి భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పన్నేండేళ్ల కాలంలో ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం ఏనాడూ రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. 2006-07 సీజన్‌లో టన్నుకు రూ.50 చొప్పున ప్రోత్సాహక రాయితీ ఇస్తామ ని ప్రకటించి ఎగొట్టిందని ఆరోపించారు. 2007-08 సీజన్‌లో టన్నుకు రూ. 120 ధర తగ్గించిందన్నారు. క్రషింగ్ ఆగిపోతుందేమోన నే భయంతోనే కొందరు రైతులు ఫ్యాక్టరీ యాజ మాన్యానికి అనుకూలంగా తీర్మానం చేశారన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. సమావేశంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి గోపాల్‌రెడ్డి, ప్రతినిధులు కొప్పర్తి సుబ్బారావు, కోట గంగారెడ్డి, మారుతి పటేల్ పాల్గోన్నారు.
 
 నేడు ఫ్యాక్టరీ ముట్టడి
 నిజాం షుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఫ్యాక్టరీని ముట్టడించనున్నట్లు టీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని ఆ పార్టీ బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జి షకీల్ తెలిపారు.
 
 ప్రైవేటీకరణకు ఒప్పుకోం
 బోధన్ టౌన్ : ఎన్‌డీఎస్‌ఎల్‌ను పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని సీపీఎం డివిజన్ కార్యదర్శి గంగాధర్ అప్పా ఆరోపించారు. దీనికి తాము ఒప్పుకోబోమని పేర్కొన్నారు. చక్కెర కర్మాగారాన్ని వెంట నే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాం డ్ చేశారు. శుక్రవారం ఆయన బోధన్‌లోని సాగర్ ఫంక్షన్ హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ విషయమై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ వేశారని, ఇది ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేసే కుట్రలో భాగమేనని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకు ఫ్యాక్టరీని కట్టబెట్టేందుకే కుట్ర జరుగుతోందన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు రెండు రైతు కూలీ సంఘాలుగా విడిపోయి ప్రైవేటీకరణకోసం డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపిం చారు. ప్రైవేటీకరణకు అనుకూలంగా రైతులు తీర్మానం చేయడం వెనక మంత్రి సుదర్శన్‌రెడ్డి హస్తం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు శంకర్‌గౌడ్, గంగాధర్, శ్రీనివాస్, కిష్టాగౌడ్, లింగం పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement