నిజాం సుగర్స్‌పై మంత్రుల బృందం ఏర్పాటు జీవో
హైకోర్టు నిలుపుదల
సాక్షి, హైదరాబాద్: నిజాం సుగర్స్ ప్రైవేటీకరణపై తీసుకున్న చర్యలను సమీక్షించేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 13న జారీ చేసిన జీవోను హైకోర్టు గురువారం నిలుపుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకూ ఈ జీవో ఆధారంగా ఎటువంటి చర్యలూ చేపట్టడానికి వీల్లేదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, జస్టిస్ చల్లా కోదండరాంలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల బృందం ఏర్పాటు జీవోను సవాల్ చేస్తూ నిజామాబాద్‌కు చెందిన నిజాం సుగర్స్ పరిరక్షణ కమిటీ, తెలంగాణ చెరకు రైతుల సంఘం కన్వీనర్ ఎం.అప్పిరెడ్డి, కో-కన్వీనర్ అజయ్ ఆర్.వడియార్, కార్యదర్శి వి.నాగిరెడ్డి, చెరకు అభివృద్ధి మండలి చైర్మన్ కంది బుచ్చిరెడ్డి లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది.