సాక్షి, హైదరాబాద్ : నిజాంషుగర్స్ ప్రైవేటీకరణపై తీసుకున్న చర్యలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె . మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పది రోజుల్లోగా ప్రభుత్వానికి సబ్ కమిటీ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కె. పార్థసారధి, సునీతా లక్ష్మారెడ్డి, శ్రీధర్‌బాబులతో సబ్‌కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీకి పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్ర కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజాంషుగర్స్‌ను ప్రభుత్వమే తీసుకోవాలని తెలంగాణ మంత్రులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కొద్దిరోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలోనూ కోరారు. అయితే, దీనిపై నిర్ణయం తీసుకునేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా సబ్‌కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.