AP: ఆందోళన విరమణ | PRC steering committee leaders talks with Andhra Pradesh govt successful | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వంతో పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ నేతల చర్చలు సఫలం

Published Sun, Feb 6 2022 3:24 AM | Last Updated on Sun, Feb 6 2022 8:52 AM

PRC steering committee leaders talks with Andhra Pradesh govt successful - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. చిత్రంలో మంత్రులు బుగ్గన, పేర్ని నాని, సీఎస్‌ సమీర్‌శర్మ, ఉద్యోగ సంఘాల నాయకులు సూర్యనారాయణ, బండి శ్రీనివాసరావు, వెంకటరామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు

ఒప్పంద వివరాలివీ..
► ప్రత్యేక జీవో ద్వారా త్వరలో పీఆర్సీ నివేదిక విడుదల.. గతంలో ప్రకటించిన విధంగా ఫిట్‌మెంట్‌ 23 శాతం కొనసాగింపు
► 50 వేల లోపు జనాభా ఉంటే రూ.11 వేల సీలింగ్‌తో 10 శాతం హెచ్‌ఆర్‌ఏ 
► 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉంటే రూ.13 వేల సీలింగ్‌తో 12 శాతం హెచ్‌ఆర్‌ఏ 
► 2 లక్షల నుంచి 50 లక్షల జనాభా ఉంటే రూ.17 వేల సీలింగ్‌తో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ
► 13 జిల్లా కేంద్రాలకు ఇదే స్లాబు వర్తింపు.. 

ఈ జనవరి నుంచి అమలు 
► 50 లక్షలకు పైబడి జనాభా ఉంటే రూ.25 వేల సీలింగ్‌తో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ
► సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల్లో 2024 జూన్‌ వరకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ
► రిటైర్డ్‌ ఉద్యోగుల అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ 70–74 ఏళ్ల వారికి 7 శాతం, 75–79 ఏళ్ల వారికి 12 శాతం
► 2022 జనవరి నుంచి గ్రాట్యుటీ అమలు.. మధ్యంతర భృతి రికవరీ ఉపసంహరణ  
► వేతన సవరణ పరిమితి ఐదేళ్లే.. అంత్యక్రియల ఖర్చు రూ.25 వేలు
► పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగింపు 
► ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ప్రత్యేక జీఓ విడుదల 
► సీపీఎస్‌ను పరిశీలించేందుకు కమిటీ ఏర్పా టు.. 2022 మార్చి 31 నాటికి రోడ్‌ మ్యాప్‌ 
► కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు.. ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగుల అంశంపై ఇందులోనే పరిశీలన
► మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఎక్స్‌టెన్షన్‌కు సంబంధించి త్వరలో ఉత్తర్వులు 
► ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌ స్కీమ్‌ క్రమబద్ధీకరణకు చర్యలు 
► 2022 జూన్‌ 30లోపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు. అప్పటి నుంచి స్కేల్స్‌ వర్తింపు.  

సాక్షి, అమరావతి: మంత్రివర్గ ఉప సంఘంతో రెండు రోజులపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించడంతో పీఆర్సీ సాధన సమితి సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ప్రభుత్వం తమ కోరికలను మన్నించడంతో సమ్మెలోకి వెళ్లడం లేదని నేతలు ప్రకటిస్తూ.. చొక్కాలకు పెట్టుకున్న నల్ల బ్యాడ్జీలను తొలగించారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సీఎంను కలిసి ధన్యవాదాలు తెలుపుతామని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల కోరికలపై సీఎం వైఎస్‌ జగన్‌ సూచనలకు అనుగుణంగా మంత్రివర్గ ఉప సంఘం రెండు రోజులపాటు విస్తృతంగా చర్చలు జరిపింది. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తుది విడత చర్చలు జరిపారు. చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు టెలిఫోన్‌లో సీఎంకు వివరిస్తూ ఆయన సూచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు పూర్తయ్యాక మంత్రుల కమిటీ ప్రతిపాదనలను సీఎంకు ఫోన్‌లో వివరించగా ఆయన ఆమోదించారు. ఆ తర్వాత మంత్రుల కమిటీ, పీఆర్సీ సాధన సమితి సంయుక్తంగా వెలగపూడి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.   

చర్చోప చర్చలు.. 
తొలుత ఉదయం మంత్రుల కమిటీలో ఉన్న సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, జీఏడీ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌లు పలు అంశాలపై ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి శుక్రవారం జరిగిన చర్చల వివరాలను తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం సచివాలయానికి చేరుకుని ఉద్యోగులు కోరిన మార్పులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం గురించి ఆర్థిక శాఖాధికారులతో చర్చించారు. అనంతరం 4 గంటలకు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై రాత్రి 10 గంటల వరకు చర్చలు జరిపారు. ఏకాభిప్రాయంతో సానుకూలంగా ఉద్యోగ సంఘాలను ఒప్పించడంతో వారు సమ్మె విరమించడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డిలతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  

ఉద్యోగుల ఆవేదన గుర్తించాం..
పీఆర్సీ తదనంతర పరిణామాలపై నిన్న (శుక్రవారం), ఈరోజు (శనివారం) సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ఉద్యోగులు ఆశించిన మేర పీఆర్సీ లేకపోవడం వల్ల వారిలో ఉన్న ఆవేదన, అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించి మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి అంశాన్ని లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నాం. సానుకూలంగా స్పందించిన ఉద్యోగ సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది. అందుకే అడక్కుండానే సీఎం ఐఆర్‌ ఇచ్చారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేశారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని సీఎం మొదటి నుంచి చెబుతున్నారు. ఒకేసారి ఐదు డీఏలు ఇచ్చారు. పీఆర్సీ కూడా వారికి బాగా ఇవ్వాలని భావించారు. కానీ కోవిడ్‌ పరిస్థితులు దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోలుకోలేని విధంగా దెబ్బతింది. అందుకే అనుకున్న మేరకు, ఉద్యోగులు ఆశించిన విధంగా పీఆర్సీ ఇవ్వలేకపోయారు. వారికి ఇంకా మేలు చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి. ఎంత వరకు చేయాలో అంతవరకు పీఆర్సీ ఇచ్చారు. ఆందోళనల సందర్భంగా కొందరు ఉద్యోగులు ఇబ్బందికరంగా మాట్లాడినా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించింది. త్వరగా సమస్య పరిష్కారం అవడానికి చర్చలే దోహదం చేశాయి.  
    – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు 

నిజంగా ఇది గుడ్‌ డీల్‌  
ఈ రోజు ఉద్యోగులకు గొప్ప శుభదినం. వ్యవస్థలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య కొన్ని సందర్భాల్లో భిన్నాభిప్రాయాలుంటాయి. వాటిని నేర్పుతో, ఓర్పుతో సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలి. కోవిడ్‌ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి బాగుండి ఉండే మంచి బెనిఫిట్స్‌ వచ్చి ఉండేవని ఆశించేవాళ్లం. కానీ ఉన్నంతలో మంచి పీఆర్సీ ఇచ్చారు. కొన్ని అంశాలలో అన్యాయం జరగడంతో రోడ్డెక్కాల్సి వచ్చింది. ఈరోజు చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోగలిగాం. పీఆర్సీ కోసం ఏర్పాటైన అశుతోష్‌ మిశ్రా కమిటీ రిపోర్టు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మేము లేవనెత్తిన డిమాండ్లలో ప్రధానమైన ఐఆర్‌ రికవరీ నిలిపి వేయడం, హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లు సరిచేయడం, పెన్షనర్స్‌కు అదనపుæ క్వాంటంను పునరుద్దరించడం, ఐదేళ్ల కోసారి పీఆర్సీ ఏర్పాటు చేసే అంశాన్ని కొనసాగిస్తామని హామీ ఇవ్వడం పట్ల సంతోషంగా ఉంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, ఆర్టీసీలో పీఆర్సీ అమలుకు ప్రత్యేక ఉత్తర్వులిస్తామన్నారు. సీపీఎస్‌ అంశంపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కేబినెట్‌ సబ్‌ కమిటీ పరిగణనలోకి తీసుకోవడంతో మార్చి 31వ తేదీలోగా రోడ్‌మ్యాప్‌ డిక్లేర్‌ చేస్తామని హామీ ఇచ్చారు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, 1993 నవంబర్‌ 25కు ముందున్న ఎన్‌ఎంఆర్‌ కంటిజెంట్‌ ఎంప్లాయిస్‌ను కూడా ఆ పరిధిలోకి తీసుకురావాలన్న హామీని కూడా అంగీకరించారు. విలేజ్, వార్డు సచివాలయ సిబ్బందికి జూన్‌ 30లోగా ప్రొబెషన్‌ డిక్లేర్‌ చేసి పే స్కేల్‌ అమలు చేస్తామని చెప్పారు. ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ స్టీమ్‌లైన్‌ చేసే వరకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కొనసాగిస్తామని చెప్పారు. పీఆర్సీ రిలేటెడ్‌ అంశాలు 9, ఇతర సమస్యలు 4 అంశాలు తాము లేవనెత్తగా, తాము డిమాండ్‌ చేయని మరో నాలుగు అంశాలు కలిపి..17 అంశాలపై సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం. నాలుగు జేఏసీల తరఫున పీఆర్సీ సాధన సమితి ఏకగ్రీవంగా ఈ డిమాండ్లను ఆమోదిస్తూ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటిస్తున్నాం. మంత్రులు, సీఎస్, ముఖ్యమంత్రి పట్ల అమర్యాదగా మాట్లాడి ఉంటే మన్నించగలరు. 
– సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత 

సీఎం చొరవతోనే సమస్య పరిష్కారం 
రెండు రోజులు సుదీర్ఘంగా చర్చించిన మీదట సమస్యలు పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నాం. ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఒత్తిళ్లు, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఉద్యోగులతో చర్చించి వారి సమస్యలు పరిష్కరించాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే మనమే తిప్పలు పడదామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పారు. సీఎం చొరవతోనే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గంటల కొద్దీ చర్చించాం. చివరిలో కావాలని చేసినట్టు ఒకరిద్దరు ఇబ్బందిగా మాట్లాడారు. అయినప్పటికీ ఉద్యోగ సంఘాలు చర్చలపై సానుకూలంగా స్పందించి సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించాయి. సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతోనే సమస్య పరిష్కారమైంది. రాష్ట్రం ఇంత ఆర్థిక పరమైన ఒడిదుడుకులు పడినా వాటిని అధిగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 
    – మంత్రి పేర్ని నాని 

ప్రభుత్వానికి కృతజ్ఞతలు 
రెండు రోజులుగా చీఫ్‌ సెక్రటరీ, మంత్రి మండలి ఉప సంఘంతో జరిపిన చర్చలు అందరికీ ఆమోద యోగ్యమైన రీతిలో సాగాయి. మంత్రుల కమిటీ నిన్న రాత్రి ఒంటిగంట వరకు చర్చలు జరిపి.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల్ల పట్ల ప్రేమాభిమానాలను స్పష్టం చేసింది. మాకు జరిగిన అన్యాయాన్ని పెద్ద మనసుతో గ్రహించి, మేము లేవనెత్తిన డిమాండ్లపై కూలంకషంగా చర్చించి వాటి పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి పీఆర్సీ సాధన సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము అడక్కుండానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆశా వర్కర్ల జీతాలు పెంచారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చారు. ఇలా ఎన్నో చేశారు. అందువల్లే మరింత మెరుగైన పీఆర్సీ ఇస్తారని ఆశించాం. అదే స్థాయిలో చాలా వరకు ఇచ్చారు కూడా.

అయితే కొన్ని అంశాల్లో మాకు జరిగిన అన్యాయం దృష్ట్యా ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఛలో విజయవాడలో కొంత మంది మాకేదో ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్న ఆవేదనతో ముఖ్యమంత్రి పట్ల చేసిన వ్యాఖ్యల విషయంలో అన్యధా భావించవద్దు. ప్రభుత్వం వేరు.. ఉద్యోగులు వేరు కాదు.. ఉద్యోగులూ మా కుటుంబ సభ్యులని ముఖ్యమంత్రి  చెబుతుంటారు. ఏది ఏమైనా మా డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ఐదు డీఏలు ఒకేసారి ఇవ్వడంతో పాటు మేము కోరుకున్నట్టుగా హెచ్‌ఆర్‌ఏ, పెన్షనర్లకు అదనపు క్వాంటం, సీసీఎస్‌ను పునరుద్దరించడం కోసం రూట్‌మ్యాప్‌ వంటి ప్రధాన డిమాండ్లు పరిష్కారం కావడంతో 6వ తేదీ అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నాం. ఆదివారం ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తాం. 
– బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్షులు, పీఆర్సీ సాధన సమితి సభ్యుడు  

సీఎం చొరవ అభినందనీయం 
ముఖ్యమంత్రికి ఉద్యోగుల పట్ల ఎంత అభిమానం ఉందో మరోసారి చూపించారు. 3వ తేదీన భారీ సంఖ్యలో ఉద్యోగులు రోడ్డుమీదకొచ్చి తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసి.. 24 గంటలు గడవక ముందే సీఎం స్పందించి మా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండ్రోజులుగా ఇదే అంశంపై ముఖ్యమంత్రి సూచనలతో మంత్రుల కమిటీ మాతో సుదీర్ఘంగా చర్చించింది. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాలను కనుక్కోవడంలో ముఖ్యమంత్రి చూపిన చొరవ అభినందనీయం. ముఖ్యమంత్రికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. మేము ఎక్కువగా రాజీకి వచ్చే అవకాశం లేకుండానే మేము పెట్టిన చాలా డిమాండ్లలో ఒకటి రెండు తప్ప అన్ని డిమాండ్ల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించారు.

ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఉన్న హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలనే డిమాండ్‌ మేరకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు. సీసీఎస్‌ కొనసాగేలా అంగీకరించినందుకు కృతజ్ఞతలు. 10 ఏళ్ల పీఆర్సీ ప్రతిపాదనను వెనక్కి తీసుకొని ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. వార్డు, గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ప్రొబేషన్‌ డిక్లేర్‌ అయ్యాక కొత్త పే స్కేల్‌ ప్రకారం జీతాలు ఇస్తామన్నారు. ఐదు డీఏలు ఒకేసారి అమలు చేయడం గొప్ప నిర్ణయం. దాంతో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు..అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వీలైనంత ఎక్కువ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని సమస్యలు పరిష్కరించారు. మా ఆవేదనలో హద్దుమీరి ఒకరిద్దరు మాట్లాడి ఉంటారు. వారి తరఫున ముఖ్యమంత్రికి క్షమాపణలు చెబుతున్నాం. 
– కె వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత  

మా సమస్యలు పరిష్కారం
ఊహించని రీతిలో మంత్రులు కమిటీ ముందుకొచ్చి మా డిమాండ్ల పరిష్కార దిశగా సానుకూలంగా స్పందించడం అభినందనీయం. ఒకేసారి ఐదు డీఏలు ఇవ్వడంతో జీతం పెరుగుతుందన్న ఆలోచనతో హెచ్‌ఆర్‌ఏ, సీసీఏలు, పెన్షనర్ల బెనిఫిట్‌లు పూర్తిగా తొలగించడం, కొన్ని తగ్గించడం వంటి చర్యలు వలన ఆందోళనకు దిగాల్సి వచ్చింది. ఈరోజు చర్చలనంతరం ప్రధానంగా మేము కోరుతున్న పీఆర్సీ నివేదికను ఉత్తర్వులతో పాటు ఇస్తామని చెçప్పడం మాకు చాలా సంతోషం కల్గించింది. హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లలో సవరణ, ఐఆర్‌ రికవరీ చేయడాన్ని నిలుపుదల చేయడం, గతంలో మాదిరిగా పీఆర్సీ 5 ఏళ్ల కోసారి ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఆనందంగా ఉంది. పబ్లిక్‌ సెక్టార్‌ ఎంప్లాయిస్, యూనివర్సిటీ, గురుకులాలకు పీఆర్సీ అమలుకు ఉత్తర్వుల జారీ విషయంలో చాలా రోజులు పట్టేది. వీరికి కూడా తక్షణమే పీఆర్సీ అమలయ్యేలా ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఆర్టీసీ ఉద్యోగులకు కూడా సపరేట్‌గా ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకరించారు. పీఆర్సీతో పాటు అనుబంధంగా ఉన్న సీపీఎస్‌ రద్దు అంశం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, వార్డు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక రోడ్‌ మ్యాప్‌ ద్వారా పరిష్కరించే దిశగా సిద్ధం చేస్తామని చెప్పడం చాలా సంతోషం కలిగించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ను పొడిగించడానికి ఒప్పుకున్నారు. ఈలోగా ఎంప్లాయిస్‌ హెల్త్‌ కార్డు పూర్తి స్థాయిలో స్ట్రీమ్‌లైన్‌లోకి తీసుకొచ్చేందుకు హామీ ఇవ్వడం సంతోషం. కోవిడ్‌ వల్ల చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాల కల్పన వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు.  ఉద్యమ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిని పలు సందర్భాల్లో విమర్శించినందుకు అన్యధా భావించవద్దని కోరుతున్నాం.  
 – బొప్పరాజు  వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్, పీఆర్సీ సాధన సమితి నేత   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement