ఫోన్‌ వచ్చింది.. మాట మారింది | Pressures of outside forces behind concern of teacher unions | Sakshi
Sakshi News home page

ఫోన్‌ వచ్చింది.. మాట మారింది

Published Thu, Feb 10 2022 2:56 AM | Last Updated on Thu, Feb 10 2022 9:06 AM

Pressures of outside forces behind concern of teacher unions - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ, బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ సంఘాల పేరుతో జరుగుతున్న ఆందోళనల వెనుక బయట శక్తుల ప్రమేయం ఉన్నట్లు పీఆర్సీ సాధన సమితి స్పష్టం చేసింది. వారి వెనుక రాజకీయ అజెండా దాగుందని, ఆ సంఘాలపై కొందరు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారని వెల్లడించింది. ఫిట్‌మెంట్‌ మినహా మిగిలిన పీఆర్సీ అంశాలన్నీ సానుకూలంగా ఉన్నాయని ఒప్పుకున్నాక ముగ్గురు ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఫోన్లు రావడంతో మాట మార్చారని బహిర్గతం చేసింది. పీఆర్సీ అంశంపై తమకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారం, కొందరి ప్రోద్బలంతో జరుగుతున్న ఆందోళనలపై ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో ఏపీటీఎఫ్, ఎస్టీయూ అధ్యక్షులు మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. సీఎంతో జరిగిన సమావేశంలో సమ్మె విరమణకు అంగీకరిస్తున్నామని తెలియచేసి బయటకు వచ్చాక ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట మారుస్తున్నారని తెలిపారు. 

ఫోన్లు రావడంతో వెళ్లిపోయారు: వెంకట్రామిరెడ్డి
ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో చర్చల సందర్భంగా ఫిట్‌మెంట్‌ మినహా మిగిలిన అన్ని అంశాలపై సానుకూల నిర్ణయాలు వచ్చాయని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. హెచ్‌ఆర్‌ఏను దాదాపు తెలంగాణతో సమానంగా సాధించామన్నారు. కొంతమంది ప్రతి అంశంలోనూ చర్చల్లో పాల్గొని ఇప్పుడు తమను మాట్లాడనివ్వలేదని ఆరోపించడం సరికాదన్నారు. ఫిట్‌మెంట్‌ వారికి ప్రధాన అంశమైనప్పుడు మిగతా అంశాలపై చర్చల్లో ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించారు.

మంత్రుల కమిటీతో చర్చలు ముగిసిన తర్వాత జరిగిన స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో ఫిట్‌మెంట్‌ మినహా అన్నీ బాగా జరిగాయని వారే అన్నారని గుర్తు చేశారు. సమ్మె విరమిద్దామంటే సరేనన్నారని చెప్పారు. ఒకరిద్దరు ప్రెస్‌మీట్‌లో కూర్చుని ఫోన్లు రావడంతో వెళ్లిపోయారని తెలిపారు. దీన్నిబట్టి ఎవరు, ఎవరి వల్ల ప్రభావితమవుతున్నారో ఉపాధ్యాయులు గుర్తించాలని కోరారు. కొందరికి సమ్మె జరగలేదనే అసంతృప్తి ఉందని, వారే రకరకాల ప్రచారాలు చేయిస్తున్నారని తెలిపారు. బాధ్యత గల ఉద్యోగులైతే మా శవయాత్రలు చేస్తారా? అని ప్రశ్నించారు. తమపై దుష్ప్రచారాలు, ట్రోలింగ్‌లు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. 

ఒప్పుకున్నాక ఫోన్లు చేసిందెవరు?: బొప్పరాజు
హెచ్‌ఆర్‌ఏ, అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ను తామే సాధించామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెప్పుకుంటున్నారని, అదే సమయంలో చర్చల్లో తమను మాట్లాడనీయడంలేదని చెబుతున్నారని, దీన్నిబట్టే వారు ఎంత గందరగోళంలో ఉన్నారో తెలుస్తోందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్టీరింగ్‌ కమిటీ మినిట్స్‌ చూస్తే ఎంత పారదర్శకంగా చర్చలు జరిపామో తెలుస్తుందని స్పష్టం చేస్తూ ఆ పుస్తకాన్ని చూపారు. హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ తామే సాధించామని చెప్పుకుంటున్నప్పుడు వారిని మాట్లాడకుండా ఆపిందెవరని ప్రశ్నించారు. అన్నీ ఒప్పుకున్నాక ఎవరి నుంచి ఒత్తిడి వచ్చింది? ఎవరి నుంచి వారికి ఫోన్లు వచ్చాయో చెప్పాలన్నారు.

తమతోపాటు ప్రెస్‌మీట్‌కు వస్తూ మధ్యలో ఫోన్‌ మాట్లాడుతూ హృదయరాజు వెళ్లిపోయారని వెల్లడించారు. చర్చలు పూర్తయ్యాక ఉపాధ్యాయ సంఘాల నాయకులపై ఒత్తిడి వచ్చిందని, ఈ విషయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు గుర్తించాలన్నారు. సంతకాలు చేసి బయటకు వెళ్లాక మాట మార్చారన్నారు. ప్రతి విషయాన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటామని స్వయంగా సీఎం చెప్పారన్నారు. సానుకూల వాతావరణం ఏర్పడిన తర్వాత రాజకీయ అజెండాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కొందరు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఉపాధ్యాయులను ఒత్తిడి చేయవద్దని వారి వెనుక ఉన్న పెద్దలను కోరుతున్నానన్నారు. ఉద్యోగులతో సంబంధం లేదని శక్తులు ఇందులో జొరబడుతున్నాయన్నారు. ఐక్య ఉద్యమాల్లో పని చేసినప్పుడు ఏది జరిగినా సమష్టి బాధ్యత తీసుకోవాలన్నారు. ఇతరులపై నిందలు మోపడం ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఎవరు నేర్పారని ప్రశ్నించారు.

ప్రతి ఉద్యోగికీ లాభమే: బండి
కొందరు ఉపాధ్యాయులు తమ ఫొటోలకు దండలు వేయడం, శ్రద్ధాంజలి ఘటించడం, దహన సంస్కారాలు చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయడం సరికాదని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సూచించారు. తమ కుటుంబ సభ్యుల్ని కూడా బూతులు తిట్టడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి ఉద్యోగికి జీతంలో రూ.6 నుంచి రూ.7 వేల నష్టాన్ని నివారించి రూ.6 నుంచి రూ.8 వేల లాభం వచ్చేలా చేశామన్నారు. తాము ఏమీ చేయలేదనడం సరికాదన్నారు. తాము ప్రభుత్వానికి అమ్ముడు పోలేదని చెప్పారు. తాము ఉద్యోగులకే విశ్వాసంగా ఉన్నామని తెలిపారు. చేతిలో సెల్‌ఫోన్‌ ఉందని ఇష్టం వచ్చిన్లు ట్రోల్‌ చేయడం మర్యాద కాదన్నారు. తమపై చెడుగా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయుల ముసుగులో ఇదంతా ఎవరు  చేస్తున్నారో తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులు పోరాటం చేసి ఎక్కువ ఫిట్‌మెంట్‌ సాధిస్తే వారి కాళ్లకు దండం పెడతామన్నారు.

అంత జనాభా లేకున్నా సాధించాం: సూర్యనారాయణ
ఉద్యోగులతో సంబంధం లేనివారు తమ నలుగురిని దోషులుగా చిత్రీకరిస్తూ సొంత అజెండాతో వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు  సూర్యనారాయణ చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలాంటి చర్యలకు పాల్పడరని భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ అంత జనాభా లేకపోయినా వెలగపూడికి 24 శాతం హెచ్‌ఆర్‌ఏ సాధించటాన్ని బట్టి పెరిగినట్లా.. తగ్గినట్లా? అనేది ఉద్యోగులు ఆలోచించాలన్నారు. పదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేయాలని విధానపరంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐదేళ్లకు వెనక్కి తీసుకురావడం గొప్ప విజయమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర అనుబంధ ఉద్యోగులకు తమతోపాటు పీఆర్సీ అమలు చేసేలా చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు.

సీఎంతో సమావేశంలో టీచర్ల సంఘాల నేతలు ఏమన్నారంటే
రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలను చాలా భేషుగ్గా అమలు చేస్తున్నారనేది వాస్తవం సర్‌. అమ్మఒడి, ఆసరా లాంటి సంక్షేమ పథకాలు లేనివారు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు. మీకు ఏదైనా అవకాశం ఉంటే ఈ ఐదు సంవత్సరాలే మా వర్గానికి చేసే అవకాశం ఉంటుంది. పీఆర్సీ అమలులో ఒక్కొక్కసారి ఒక్కో జీవోలో కొంతమందిని విస్తరిస్తున్నారు. పబ్లిక్‌ సెక్టార్‌కు, గురుకుల టీచర్లకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఇచ్చారు. గత సంవత్సరం ఇవ్వలేదు. ఇవ్వని కారణంగా 5 సంవత్సరాల నుంచి ఆలస్యమవుతోంది. వాళ్ల బడ్జెట్‌లో, వాళ్ల బోర్డుకి సంబంధించి ఇచ్చే జీవోలోనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పుడు ఇచ్చే జీవోలోనే అందరు ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసేలా చూడాలి. అశోతోష్‌ మిశ్రా కమిటీ నివేదిక బయటకు రాకపోతే చాలా అంశాల్లో మాస్టర్‌ స్కేల్స్‌ లాంటివి బయటకురావు. అవి బయటకు వస్తేనే కొన్ని అంశాల్లో ముందుకుపోయే పరిస్థితి ఉంటుంది. అదనపు పెన్షన్‌ అలాగే ఉండేలా చూడాలి. హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ కొత్తగా ఇవ్వకపోయినా, అలాగే ఉంచినా సరిపోతుంది. ఫిట్‌మెంట్‌పై మీరే ఆలోచన చేసి చేయాలని కోరుకుంటున్నాను. అనామలిస్‌ కమిటీ మీ ద్వారానే వేయాలని కోరుతున్నా.
– హృదయరాజు, ఏపీటీఎఫ్‌ నేత 

సీఎంతో నాటి సమావేశంలో టీచర్ల సంఘం నేత ఏమన్నారంటే.. (వీడియో సాక్ష్యంతో)
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూలేని సంస్కరణలు విద్యాశాఖలో తీసుకొచ్చిన సీఎంకు మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు స్వయంగా పరిశీలించి విద్యార్థులకు షూలు, యూనిఫామ్స్, బ్యాగ్‌తో సహా ఇస్తూ విద్యాభివృద్ధిని ఎంతో ముందుకు తీసుకువెళుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మావి 2 సమస్యలున్నాయి. సర్వీసు రూల్స్‌ లేకపోవడంతో ఒక ఉపాధ్యాయుడు చేరిన దగ్గర నుంచి 35, 40 సంవత్సరాలు ఒకే సర్వీసులో రిటైర్‌ అవుతున్నారు. మీరు తప్పనిసరిగా విద్యా శాఖ సర్వీసు రూల్సు రూపొందించి పదోన్నతులకు శ్రీకారం చుట్టాలి. ప్రతి సంవత్సరం సాధారణ బదిలీలు చేయాలి సర్‌. మాకు బల్క్‌గా సాధారణ బదిలీలు ఇస్తే బాగుంటుంది. పీఆర్సీ, ఫిట్‌మెంట్‌పై మా అందరికీ న్యాయం చేస్తారని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు సర్‌..
– ఎస్టీయూ నేత జోసెఫ్‌ సుధీర్‌బాబు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement