సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఎన్నికల ఏడాది కావడంతో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శల వేడి మరింత పెరుగుతోంది. ఎన్నికలకు కౌంట్‌డౌన్ అవుతున్నకొద్దీ నువ్వా నేనా అనేవిధంగా సవాళ్లు, ప్రతిసవాళ్లతో వాతావరణం పూర్తిగా మారిపోతోంది. తాజాగా బోధన్ నియోజకవర్గ పర్యటనలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌పై విమర్శలు చేయడంతో జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రతివిమర్శలు చేశారు. సుదర్శన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సక్రమంగా పింఛన్లు ఇవ్వలేదని, చిన్న పదవి ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్ అంటూ కవిత వ్యాఖ్యలు చేయడంతో జిల్లా నాయకులు ఘాటుగా ప్రతిస్పందించారు. కష్టపడి అంచెలంచెలుగా పదవులు పొందిన వారిని చులకన చేయడమేమిటని అంటున్నారు.
ఇలాంటి భావన ఉన్నందునే కవితను ఎంపీగా ఓడించడంతో తండ్రిని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్సీ తెచ్చుకున్నారన్నారు. లిక్కర్ స్కాం విషయాన్ని ప్రస్తావిస్తూ కవితకు జ్ఞాపకశక్తి పోయిందని విమర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి, నిజాం షుగర్స్ మూసివేత, భూముల వ్యవహారాన్ని కాంగ్రెస్ నాయకులు గట్టిగా ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ వర్సిటీలో గందరగోళాన్ని సరిదిద్దలేని కవిత, కేసీఆర్ ప్రభుత్వం అంటూ విమర్శలు చేస్తున్నారు. రానురాను ఈ విమర్శల జడివాన మరింత పెరుగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. జిల్లాలో రేవంత్ యాత్ర విజయవంతం కావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం అనేక రెట్లు పెరిగింది.
మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి రైతులతో ముఖాముఖి సదస్సు నిర్వహించారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ఆతీ్మ య సమ్మేళనంలో ఇటీవల మంత్రి వేముల చేసిన వ్యాఖ్యలపై డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ఫైరయ్యారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి కంటే బీఆర్‌ఎస్ 8 సంవత్సరాల్లోనే ఎక్కువ చేసిందని మంత్రి వాఖ్యానించారు. దీంతో మానాల మంత్రికి సవాల్ విసిరారు. జిల్లాలో, నియోజకవర్గంలో కానీ అభివృద్ధి విషయంలో మంత్రి బహిరంగ చర్చకు రావాలని మానాల అన్నారు. తేదీ, సమయం మంత్రే నిర్ణయిస్తే ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. మంత్రి తన చెంచాగాళ్లతో స్టేట్‌మెంట్లు ఇప్పించకుండా నేరుగా చర్చ తేదీని ప్రకటించాలన్నారు.
అభివృద్ధి విషయంలో అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన దీర్ఘకాలిక పనులతో పాటు ఇందిరమ్మ ఇళ్లలాంటి తదితర పథకాలు కాంగ్రెస్ హయాంలో అమలు చేశామన్నారు. ఎత్తిపోతల పథకాలు, కెనాల్స్, విద్య, వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ రోడ్లు తదితర అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పిన డబుల్ ఇళ్లు ఒక్క శాతం కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన తారు రోడ్ల మీద మళ్లీ తారు పోసి కమీషన్లు దండుకుంటున్నారన్నారు. ఇక మంత్రి ప్రశాంత్‌రెడ్డి హయాంలో నిర్మించిన చెక్‌డ్యాంల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.
కట్టిన 30 రోజులకే చెక్‌డ్యాంలు కూలి పోవడం శోచనీయమని మానాల అన్నారు. వైఎస్సార్ హయాంలో కమ్మర్‌పల్లిలో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే దాన్ని అభివృద్ధి చేయడం కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చేత కావడం లేదన్నారు. ఈ సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. రేవంత్‌రెడ్డి యాత్ర, కర్ణాటక ఫలితాల తరువాత పెరిగిన కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్‌ను మరింతగా పెంచుకునేవిధంగా క్షేత్రస్థాయిలో ఇంకా ముందుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మానాల రెగ్యులర్‌గా బాల్కొండ నియోజకవర్గంలో గ్రామాల వారీగా కార్యక్రమాలు చేస్తున్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ కావడంతో పాటు తాజాగా సవాళ్లు విసురుకుంటుండడంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment