సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని భూములు ఆక్రమణలకు గురికాకుండా గట్టి చర్యలు తీసుకొని వాటిని కాపాడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి , టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, ప్రొ.రమేశ్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. భూముల పరిరక్షణలో భాగంగా ఓయూలోని ఆగ్నేయ మూలలో సరిహద్దు గోడ నిర్మాణం పూర్తిచేసేందుకు రూ.200 కోట్లు మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. శుక్రవారం రాజ్‌భవన్ లో గవర్నర్‌కు వారు వినతిపత్రాన్ని సమర్పించారు.
1917లోనే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఓయూ ఏర్పాటుకు 1,628 ఎకరాల భూమి కేటాయించడంతో పాటు, దాని సరిహద్దులను సూచిస్తూ సర్వే మ్యాప్‌ను పొందుపరిచారని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి చెందిన డాక్యుమెంట్లు, మ్యాప్‌లు యూనివర్సిటీ ఎస్టేట్ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. వర్సిటీ ఆగ్నేయ మూలలో డీడీ కాలనీ పక్కనే చిన్న చెరువు ఉందని, అది కొన్నేళ్లుగా ఎండిపోవడంతో చుట్టుపక్కల వాళ్లు చెత్తపారేయడానికి ఉపయోగిస్తుండగా కొన్ని సాంకేతిక కారణాలతో ఈ ప్రాంతంలో సరిహద్దు గోడ నిర్మాణం పూర్తికాలేదని పేర్కొన్నారు.ఓయూకు తులసి సొసైటీతో గతంలో భూవివాదం ఉండగా అది సమసిపోయిందని, ఇప్పుడు నకిలీ పత్రాలు సృష్టించి విశ్వవిద్యాలయ భూములను ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు.ఈ సొసైటీ కొత్త సభ్యులకు భూమి కేటాయింపు గురించి డిమాండ్ చేసే అవకాశం లేదని స్పష్టంచేశారు.
గవర్నర్ సానుకూల స్పందన..
తాము చేసిన విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, ఓయూ భూముల వ్యవహారంలో సమాచారం తెప్పించుకుంటున్నామని చాడ, కోదండరాం మీడియాకు చెప్పారు. తెలంగాణలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈ వర్సిటీది ఎంతో కీలకమైన పాత్ర కాబట్టి, ఈ భూములు కోల్పోకుండా సీఎం బాధ్యత తీసుకోవాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment