Osmania University (OU)
-
‘TSPSCని తక్షణమే ప్రక్షాళన చేయాలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేసిన దరిమిలా.. TSPSC బోర్డుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్తామని బోర్డు ప్రకటించినప్పటికీ.. అభ్యర్థులు శాంతించడం లేదు. పరీక్షలో బయోమెట్రిక్ విధానం అమలు చేయకపోవడం అనే కారణంతోనే రెండోసారి పరీక్షను రద్దు చేస్తూ.. తిరిగి నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు. దీంతో అభ్యర్థులు టీఎస్పీఎస్సీ బోర్డుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గ్రూప్-1 రద్దు పై ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కసారిగా వేడెక్కింది. పరీక్ష రద్దుపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఉద్యోగాభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్న టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్త టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా పరీక్షలు నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. ఈ క్రమంలో.. ముందస్తుగా ఓయూ దారులను మూసేశారు అధికారులు. డీకే అరుణ ఫైర్ TSPSC గ్రూప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డీకే అరుణ డిమాండ్ చేస్తున్నారు. ‘‘ప్రభుత్వానికి నిరోద్యోగ యువత పట్ల చిత్తశుద్ధి లేదు. మద్యం నోటిఫికేషన్‌పై ఉన్న శ్రద్ధ.. ఉద్యోగ నోటిఫికేషన్‌పై లేదు. బయోమెట్రిక్ విధానం పెడితే ఖర్చు అవుతుందని కక్కుర్తి పడడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మద్యం నోటిఫికేషన్ తప్ప.. ఏ నోటిఫికేషన్ సక్రమంగా జరగలేదు. ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్.. పరీక్షలు నిర్వహించే విధానం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. TSPSCని వెంటనే ప్రక్షాళన చేయాలి. చైర్మన్ ఈ ఘటనకు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి అని డీకే అరుణ డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ స్పందించాలి: NSUI వెంకట్ గ్రూప్ 1 రద్దు పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఎన్ఎస్యూఐ నేత బాల్మూరి వెంకట్ తెలిపారు. ‘‘ టీఎస్పీఎస్సీ తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్ 1 లో, బయోమెట్రిక్ విధానం లేకపోవడం,అవకతవకలు జరిగాయని హైకోర్టు భావించి రద్దు చేసింది. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగాలి. విద్యార్థులు మనోధైర్యం కోల్పోరాదు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి మళ్ళీ గ్రూప్ 1 పరీక్షలు యధావిధిగా నిర్వహించాలి. అలా చేయకపోతే మంత్రులను అధికారులు ఎక్కడెక్కడ అడ్డుకొని తీరుతాం. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు తగిన న్యాయం చేస్తాం . గ్రూప్ 1 రద్దుతో ఆందోళన చేస్తున్న విద్యార్థులది న్యాయపోరాటం అని పేర్కొన్నారు వెంకట్. మొత్తం 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లీకేజీ ఆరోపణలతో నేపథ్యంలో కిందటి ఏడాది జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తొలిసారి రద్దయింది. ఈ ఏడాది జూన్ 11న రెండోసారి పరీక్ష జరగ్గా.. రాష్ట్ర వ్యాప్తంగా 2.32 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే బయోమెట్రిక్ వివరాలు తీసుకోకపోవడం.. హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీటు ఇవ్వడంపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పరీక్షను రద్దు చేస్తూ తాజాగా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. -
తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లాసెట్-2023 ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఈ రిజల్ట్స్‌ను గురువారం మధ్యాహ్నం రిలీజ్ చేశారు. తెలంగాణలోని వివిధ యూనివర్సిటీలు, ప్రైవేట్ న్యాయ కళాశాలల్లోని మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుతో పాటు పీజీ ఎల్ఎల్ఎం కోసం ఈ ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ మే 25వ తేదీన ఈ పరీక్ష నిర్వహించగా.. 43,692 మంది దరఖాస్తు చేసుకోగా 36,218 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ☛ TS LAWCET-2023 ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే.. -
4 నిమిషాల 27.82 సెకన్లలో పరుగు పూర్తి.. మన భాగ్యలక్ష్మికి స్వర్ణం
భువనేశ్వర్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్రీడాకారిణి డి.భాగ్యలక్ష్మి స్వర్ణ పతకాన్ని సాధించింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీకి చెందిన భాగ్యలక్ష్మి 1500 మీటర్ల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. ఆమె 4 నిమిషాల 27.82 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వర్ష (కురుక్షేత్ర యూనివర్సిటీ– 4ని:30.01 సెకన్లు) రజతం, సునీత (హిమాచల్‌ప్రదేశ్ యూనివర్సిటీ–4ని:30.15 సెకన్లు) కాంస్యం సాధించారు. ‘ద్రోణాచార్య’ అవార్డీ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ తీసుకుంటున్న భాగ్యలక్ష్మి విజేత హోదాలో ఈ ఏడాది జూన్–జూలైలో చైనాలో జరిగే ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. చదవండి: IND Vs SL T20 Series: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో సూర్యకుమార్ ఔట్ -
ప్రభుత్వ భూముల కబ్జాపై 33 జిల్లాల్లో వెంటనే సర్వే చేపట్టాలి: హైకోర్టు
హైదరాబాద్: ఓయూ భూములు కబ్జా అవుతున్నాయన్న ఓయూ విద్యార్థి పి.రమణారావు లేఖపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సుమారు 3 వేలకు గజాలకుపైగా భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమిస్తున్నారని పి.రమణారావు లేఖలో హైకోర్టుకు తెలిపాడు. అయితే కబ్జా కాకుండా చర్యలు తీసుకున్నట్లు ఏజీ తెలిపింది. తులసి హౌజింగ్ సొసైటీపై పోలీసులకు ఓయూ ఫిర్యాదు చేసిందని ఏజీ తెలిపింది. ఇక దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకండా హైదరాబాద్ సీపీ, అంబర్‌పేట పోలీసులను హైకోర్టు ప్రతివాదులుగా చేర్చింది. దీనిపై తదుపరి విచారణ అక్టోబర్ 20కి వాయిదా వేసింది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్..! వీధి కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్‌కు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీధికుక్కల నియంత్రణపై జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టారు. వీధికుక్కల నియంత్రణకు చర్యలపై కలెక్టర్లు నివేదికలు సమర్పించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నాలుగు వారాల్లో 33 జిల్లాల కలెక్టర్లను నివేదికలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదికలు సమర్పించని కలెక్టర్లపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హైకోర్టు హెచ్చరించింది. 3 వారాల్లో నియమించి నోటిఫికేషన్ ఇవ్వాలి: తెలంగాణ హైకోర్టు తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకంపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సీజే జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టారు. కాగా, మరో 4 వారాల సమయం కావాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. అయితే 3 వారాల్లో నియమించి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 25కి వాయిదా వేశారు. హెల్మెట్ ఫైన్ల విధింపుపై హైకోర్టు విచారణ వాహనం వెనుక కూర్చున్న వ్యక్తికి.. హెల్మెట్ ఫైన్ల విధింపుపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర మోటార్ వాహనాల చట్ట సవరణను రాష్ట్రం స్వీకరించకముందే ఫైన్లు విధిస్తున్నారన్న పిటిషనర్ పేర్కొన్నాడు. అయితే దీనికి సంబంధించిన వివరాలను తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 2కి వాయిదా వేసింది. 33 జిల్లాల్లో వెంటనే సర్వే చేపట్టాలన్న హైకోర్టు తెలంగాణలో ప్రభుత్వ భూములను గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ భూముల అక్రమాలకు సంబంధించి ఫిర్యాదులు తరచూ తమ దృష్టికి వస్తున్నట్లు హైకోర్టు తెలిపంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వెంటనే సర్వే చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 27కి వాయిదా వేసింది. -
ఎస్ఎస్సీ పోటీ పరీక్షల సన్నద్ధతకై
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి వారం రోజులపాటు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఉద్యోగ పోటీ పరీక్షలు జరగనున్నాయని, దీనికోసం తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో టి–శాట్ నెట్వర్క్ చానళ్లు పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నాయని సీఈవో ఆర్.శైలేశ్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జనవరి 25న లైవ్ ప్రసారాలతో ప్రారంభమై 27వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు సాధారణ ప్రసారాలు కొనసాగించాలని నిర్ణయించామని, పోటీ పరీక్షలకు ఈ పాఠ్యాంశాలు ఉపయోగపడతాయని శైలేశ్‌రెడ్డి వివరించారు. 25వ తేదీ ఉదయం 11 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే లైవ్‌లో సబ్జెక్టు, సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారని, అభ్యర్థులు తమ సందేహాల కోసం ఫోన్ ద్వారా 040–2354 0326, 2354 0726 టోల్ ఫ్రీ 1800425 4039 నెంబర్లకు కాల్ చేయాలని సీఈవో సూచించారు. జనవరి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 12 వరకు ప్రసారాలుంటాయని వెల్లడించారు.(చదవండి: గిరిజన గురుకుల పరిధిలో లా కాలేజీ) ఓయూ ఎంసీఏ ఫలితాలు విడుదల ఉస్మానియా యూనివర్సిటీ: విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన ఎంసీఏ కోర్సు పలు సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. ఎంసీఏ 1వ సెమిస్టర్ బ్యాక్లాగ్, 2, 4 సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షల ఫలితాలను వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఉస్మానియా వర్సిటీ వెబ్సైట్లో ఫలితాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. -
ఒక పోస్టు 240 దరఖాస్తులు!
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పదవి కోసం ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా తీవ్రమైన పోటీ నెలకొంది. ఏకంగా 240 మంది ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వర్సిటీకి చెందిన వారితో పాటు ఇతర వర్సిటీల అధ్యాపకులు, మాజీ వీసీలు, 100 మందికి పైగా రిటైర్డ్ అధ్యాపకులు, ప్రస్తుతం అధికార పదవుల్లో కొనసాగుతున్న రిజిస్ట్రార్ మొదలు ప్రిన్సిపల్స్, ఇతర అధికారులు, విభాగాల అధిపతులు రేసులో ఉండటం విశేషం. కాగా వీరి సుదీర్ఘ నిరీక్షణకు తెర వేస్తూ వీసీ ఎంపిక త్వరలో జరగవచ్చనే ప్రచారంతో పైరవీలు మరింత ఊపందుకున్నట్టు సమాచారం. ముళ్ల కిరీటమే అయినా.. నిజాం స్థాపించిన ఈ వర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకొని 104వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఏడోదైన ఓయూ కోటి మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించింది. దీని ఘనకీర్తి ప్రపంచం నలుమూలలా విస్తరించింది. అలాంటి ఓయూ నేడు నిధులు, నియామకాలకు సంబంధించిన సమస్యలతో పాటు అనేక ఇతర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. నిత్యం ఏదో ఒక సమస్య, ఆందోళన కార్యక్రమాలతో సాగే ఓయూలో వీసీ పదవి ముళ్ల కిరీటమని తెలిసినా, మరోవైపు ప్రతిష్టాత్మక పదవి కావడంతో 240 మంది ప్రొఫెసర్లు దాని కోసం పోటీ పడుతున్నారు. 20 రోజుల్లో కొత్త ఉప కులపతి? ప్రొఫెసర్ రామచంద్రం పదవీ విరమణతో సుమారు 18 నెలల కిందట ఈ పోస్టు ఖాళీ అయ్యింది. 2019 జూలైలో ఈ పదవికి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. గతేడాది సెర్చ్ కమిటీని నియమించినా ఇంతవరకు సమావేశం జరగలేదు. ఈ సమావేశం కోసం ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌ను నోడల్ అధికారిగా నియమించారు. అయితే వివిధ రకాల ఎన్నికల కారణంగా కోడ్ అమల్లో ఉండటం, కరోనా నేపథ్యంలో వీసీ నియామకంలో జాప్యం జరిగింది. అయితే ఇప్పటికే తీవ్ర జాప్యమవడం, కరోనా అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొంటుండడం, మార్చిలో మళ్లీ ఎన్నికలు (పట్టభద్రుల ఎమ్మెల్సీ) ఉన్న నేపథ్యంలో.. అంతకంటే ముందుగా 20 రోజుల్లోగానే ఓయూతో పాటు ఇతర వర్సిటీలకు వీసీలను నియమిస్తారని ఓయూ సీనియర్ అధ్యాపకులకు సమాచారం అందినట్టు తెలిసింది. సెర్చ్ కమిటీ సమావేశమై ముగ్గురి పేర్లు ఎంపిక చేస్తే, ముఖ్యమంత్రి అందులో ఒకరిని ఖరారు చేసి గవర్నర్‌కు పంపుతారు. ఆ తర్వాత వీసీ నియామకాన్ని గవర్నర్ ప్రకటిస్తారు. పైరవీలు మరింత ముమ్మరం వీసీ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న అధ్యాపకులు తొలినాళ్లలోనే జోరుగా పైరవీలు చేశారు. నియామకంలో జాప్యం తో కొంత సద్దుమణిగినా తాజా సమాచారం నేపథ్యంలో పైరవీలు మరింత ఊపందుకున్నట్లు తెలిసింది. లాక్డౌన్ అనంతరం వర్సిటీ అస్తవ్యస్తంగా మారిందని, కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా.. సమర్థులు, ఓయూకు పూర్వ వైభవం తెచ్చే ప్రొఫెసర్లను వీసీగా నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
రేపు, ఎల్లుండి జరిగే పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో రేపు, ఎల్లుండి జరగబోయే ఇంజనీరింగ్, బీసీఏ, బి ఫార్మసీ, బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ పరీక్షలను వాయిదా వేశారు. అనివార్య పరిస్థితుల వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలిపారు. తదుపరి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. అయితే సెప్టెంబరు 17(గురువారం) నుంచి జరిగే పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, ఇందులో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. (చదవండి: డిగ్రీ, పీజీ పరీక్షలపై ప్రభుత్వానికే స్పష్టత లేదు) -
ఉస్మానియా భూములను కాపాడండి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని భూములు ఆక్రమణలకు గురికాకుండా గట్టి చర్యలు తీసుకొని వాటిని కాపాడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి , టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, ప్రొ.రమేశ్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. భూముల పరిరక్షణలో భాగంగా ఓయూలోని ఆగ్నేయ మూలలో సరిహద్దు గోడ నిర్మాణం పూర్తిచేసేందుకు రూ.200 కోట్లు మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. శుక్రవారం రాజ్‌భవన్ లో గవర్నర్‌కు వారు వినతిపత్రాన్ని సమర్పించారు. 1917లోనే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఓయూ ఏర్పాటుకు 1,628 ఎకరాల భూమి కేటాయించడంతో పాటు, దాని సరిహద్దులను సూచిస్తూ సర్వే మ్యాప్‌ను పొందుపరిచారని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి చెందిన డాక్యుమెంట్లు, మ్యాప్‌లు యూనివర్సిటీ ఎస్టేట్ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. వర్సిటీ ఆగ్నేయ మూలలో డీడీ కాలనీ పక్కనే చిన్న చెరువు ఉందని, అది కొన్నేళ్లుగా ఎండిపోవడంతో చుట్టుపక్కల వాళ్లు చెత్తపారేయడానికి ఉపయోగిస్తుండగా కొన్ని సాంకేతిక కారణాలతో ఈ ప్రాంతంలో సరిహద్దు గోడ నిర్మాణం పూర్తికాలేదని పేర్కొన్నారు.ఓయూకు తులసి సొసైటీతో గతంలో భూవివాదం ఉండగా అది సమసిపోయిందని, ఇప్పుడు నకిలీ పత్రాలు సృష్టించి విశ్వవిద్యాలయ భూములను ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు.ఈ సొసైటీ కొత్త సభ్యులకు భూమి కేటాయింపు గురించి డిమాండ్ చేసే అవకాశం లేదని స్పష్టంచేశారు. గవర్నర్ సానుకూల స్పందన.. తాము చేసిన విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, ఓయూ భూముల వ్యవహారంలో సమాచారం తెప్పించుకుంటున్నామని చాడ, కోదండరాం మీడియాకు చెప్పారు. తెలంగాణలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈ వర్సిటీది ఎంతో కీలకమైన పాత్ర కాబట్టి, ఈ భూములు కోల్పోకుండా సీఎం బాధ్యత తీసుకోవాలని చెప్పారు. -
జీసీపీఈ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో ప్రభుత్వ వ్యాయామ విద్య కాలేజి (జీసీపీఈ) జట్టు సత్తా చాటింది. కేశవ్ మెమోరియల్ డిగ్రీ కాలేజి (నారాయణగూడ) వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్లో జీసీపీఈ జట్టు విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో జీసీపీఈ 11–10తో సిద్ధార్థ వ్యాయామ విద్య కాలేజి (ఇబ్రహీంపట్నం) జట్టుపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో భవన్స్ కాలేజి 16–8తో నిజాం కాలేజిపై నెగ్గింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో జీసీపీఈ 14–5తో భవన్స్ కాలేజిపై, సిద్ధార్థ కాలేజి 13–4తో నిజాం కాలేజిపై ఘనవిజయం సాధించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేఎంఈ సొసైటీ సంయుక్త కార్యదర్శి బి. శ్రీధర్ రెడ్డి, కేఎంఐసీఎస్ ప్రిన్సిపాల్ జె. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉస్మానియాలో కృత్రిమ మేధ!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా కొనసాగుతోంది. అనేక కొత్త ఆవిష్కరణలకు కారణమవుతున్న ఈ కృత్రిమ మేధస్సు (ఏఐ)కు సంబంధించిన పరిశోధనలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా మారుతోంది. ఓయూ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లో మరో 15 రోజుల్లో ఈ పరిశోధనలు అందుబాటులోకి రానున్నాయి. ట్రాఫిక్ పోలీసు, రవాణ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్యారంగాలకు ఏఐ మరింతగా చొచ్చుకుపోనుంది. సమాజానికి ఎంతో అవసరమైన ఈ పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్ (ఏఐఎంఎల్)ఉస్మానియా యూనివర్సిటీకి మంజూరైంది. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు కేంద్రం రూ.107 కోట్లు కేటాయించింది. ఇటీవల ఓయూకు మంజూరైన రూ.17 కోట్ల నుంచి రూ.కోటి వెచ్చించి ఓయూ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరో 15 రోజుల్లో ఈ ల్యాబ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి రావడం వల్ల భవిష్యత్తులో విశ్వవిద్యాలయం వేదికగా కృత్రిమ మేధస్సుపై అనేక పరిశోధనలు జరగనున్నాయి. మానవ మేధస్సును అర్థం చేసుకుంటుంది మానవ మేధస్సును అర్థం చేసుకొని దానికి అనుగుణంగా కంప్యూటర్ వ్యవస్థ పని చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇందులో స్పీచ్ రికగ్నిషన్, విజువల్ పర్సెప్షన్, లాజిక్ అండ్ డెసిషన్, మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వంటి చాలా అంశాలు ఉంటాయి. ఏఐ సాయంతో అల్జీమర్స్ లాంటి జబ్బుల్ని కూడా నయం చేయొచ్చని పరిశోధనల్లో తేలింది. రోబోటిక్స్‌లోఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకం. ప్రొఫెసర్ రామచంద్రం, మాజీ వీసీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏఐతో కొన్ని ఉపయోగాలు ►గతంలో పదవీ విరమణ చేసిన వారు నెలవారీ పెన్షన్ తీసుకోవాలంటే ఆయా విభాగాల అధికారులు ఇచ్చిన గుర్తింపు సర్టిఫికెట్ సమర్పించాల్సి వచ్చేది. ఇది పదవీ విరమణ చేసిన వారికి ఎంతో ఇబ్బందిగా ఉండేది. ఇటీవల తెలంగాణ ఐటీ శాఖ సంయుక్తంగా పెన్షనర్ల కోసం ఫేషియల్ రికగ్నైజేషన్ టూల్‌ను రూపొందించింది. ఫొటో తీసి సంబంధిత యాప్‌కు పంపితే చాలు రెండు మూడు నిమిషాల్లోనే పనైపోతుంది. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోనే సాధ్యమైంది. ►పంటకు పట్టిన తెగుళ్లు, పురుగులను నివారించేందుకు రైతు తన చేలో నిలబడి.. స్మార్ట్‌ఫోన్‌లో పంటకు పట్టిన చీడను ఫొటో తీసి ఓ నంబర్‌కు పంపితే చాలు నివారణ చర్యలు సూచిస్తుంది. ►ఒక వాహనం మరో వాహనానికి చేరువలోకి వెళ్లినప్పుడు ఈ ఏఐ ద్వారా వాహనదారులను అలర్ట్ చేస్తుంది. ►ఏ జబ్బుకు, ఏ వయసు రోగికి, శరీర బరువు ఆధారంగా ఎంత మోతాదు మందు ఇవ్వాలో ఆ మేరకు నిర్దేశించి మందులు సూచిస్తుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కచ్చితత్వాన్ని చూపిస్తుంది. ఏ సీజన్లో ఏ వ్యాధులు వస్తాయి.. ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ప్రభుత్వ యంత్రాంగాలకు ముందే చేరవేస్తుంది. ►1956లో అమెరికా పరిశోధకుడు జాన్ మెక్‌కార్తీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పదాన్ని సృష్టించారు. యంత్రాలు మనుషుల్లా పని చెయ్యడం, మాట్లాడగ లగడం, ఆలోచించగలగడమే దీని లక్ష్యం. ఇప్పుడిప్పుడే ఈ కల సాకారం అవుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఏఐపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. స్మార్ట్ మొబైళ్ల రాకతో, సామాన్యులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి దగ్గరయ్యారు. -
ఇస్రో శాస్త్రవేత్త కేవీసీరావు కన్నుమూత
అంబర్‌పేట: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో)లో శాస్త్రవేత్తగా 2 దశాబ్దాలు సేవలందించిన డాక్టర్ కాలూరు విజయచందర్‌రావు (కేవీసీ రావు, 85) కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 22న (ఆదివారం) డీడీ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య భారతి, ముగ్గురు కుమారులు ఉన్నారు. మొదట ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా కాలూరు తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కొంతకాలం పెట్రోలియం కార్పొరేషన్లో శాస్త్రవేత్తగా పనిచేశారు. అనంతరం ఇస్రోలో చేరి 2 దశాబ్దాల పాటు సేవలందించారు. ప్రముఖ శాస్త్రవేత్తలు విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం ఈయన సహచరులు. ఆయన అంత్యక్రియలు మంగళవారం రాత్రి పంజగుట్టలోని మహాప్రస్థానంలో నిర్వహించారు. -
భద్రం కాదు.. ఛిద్రం
సాక్షి, హైదరాబాద్: చారిత్రక పత్రం.. ఇక చేతికందడం కష్టం.. పత్రాలు చిరిగె.. అక్షరాలు చెదిరె.. నవాబుల పత్రాలు.. ఖరాబు చిత్రాలవుతున్నాయి. రాజ పత్రం రాజసం కోల్పోయింది. వందల ఏళ్లనాటి చారిత్రక సాక్ష్యాలు, కోట్లకొద్దీ డాక్యుమెంట్లు, ఫర్మానాలు, గెజిట్లు రాజ్యాభిలేఖ పరిశోధనాలయంలో కొలువుదీరాయి. కాకపోతే ఛిద్రంగా! ఏ పత్రం ఏ క్షణంలో నుసిగా రాలి పోతుందో తెలియని దుస్థితి. మొదటి నవాబు నుంచి నేటి పాలకుల వరకు తీసుకున్న కీలక నిర్ణయాలు, ఫర్మానాలు, జీవోలు ఈ భాండాగారంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. హుస్సేన్‌సాగర్, గండిపేట్, ఉస్మానియా వర్సిటీ, ఆస్పత్రులు వంటి అనేక చారిత్రక కట్టడాల నిర్మాణానికి నవాబులు విడుదల చేసిన ఫర్మానాలు, ముంతఖాబ్‌లు, అప్పటి సామాజిక, ఆర్థిక పరిణామాలను తెలిపే ఎన్నో కీలకమైన డాక్యుమెంట్లు, హైదరాబాద్ స్టేట్ చరిత్రకు సంబంధించిన పత్రాలు ఇక్కడ ఉన్నాయి. ముందుకు సాగని డిజిటలైజేషన్.. మొదటి నిజాం నవాబు ఖమృద్దీన్ అలీఖాన్ నుంచి ఆఖరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వరకు, 1406వ సంవత్సరం నుంచి ఇటీవలి వరకు సుమారు 4.3 కోట్ల డాక్యుమెంట్లు, 1724 నుంచి 1890 వరకు విడుదలైన ఫర్మానాలు, సనత్‌లు, జాగీర్ ఇనాంలకు సంబంధించిన పత్రాలన్నీ పర్షియన్, ఉర్దూ భాషల్లోనే ఉన్నాయి. ఏడో నిజాంకాలంలో బ్రిటిష్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలకు ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. రౌండ్‌టేబుల్ సమావేశాల్లో గాంధీజీ, జిన్నా, అంబేడ్కర్, నెహ్రూతోపాటు అప్పటి హైదరాబాద్ ప్రధానమంత్రి అక్బర్ హైదరీ పాల్గొన్నప్పటి విశేషాలు, మినిట్స్ బుక్స్‌ను ఇక్కడ భద్రపరిచారు. 2012లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం విడుదల చేసిన రూ.2.75 కోట్లతో సుమారు 60 లక్షల పేజీలను, సుమారు 1896 నుంచి 1948 వరకు ఉన్న డాక్యుమెంట్లన్నీ డిజిటలైజ్ చేశారు. కానీ 1896కు ముందు , 1948 తరువాత విడుదలైన గెజిట్ పత్రాలు, జీవోలు, ఇతర అనేక డాక్యుమెంట్లు, జీవోలు డిజిటలైజేషన్ చేయవలసి ఉందని రాజ్యాభిలేఖ పరిశోధనాలయం అధికారి ఒకరు తెలిపారు. ఒక్క రూపాయీ విడుదల కాలేదు.. ‘‘తెలంగాణ ఏర్పడిన తరువాత డిజిటలైజేషన్ కోసం ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. మరో నాలుగైదేళ్లలో చాలా పత్రా లు చేతికందకుండా పోయే ప్రమాదం ఉంది. ముఖ్యం గా 1724 నుంచి వెలువడిన అనేక పత్రాలు అప్పటికీ శిథిలాస్థకు చేరుకున్నాయి. వాటిని కాపాడడం చాలా కష్టంగా ఉంది’’అని పరిశోదనాలయ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. నిలిచిపోయిన ఫుమిగేషన్... వందల ఏళ్లుగా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా పుస్తకాలు, డాక్యుమెంట్లకు పురుగుపట్టవచ్చు. దీనిని నివారించేందుకు ఫుమిగేషన్ చేస్తారు. పుస్తకాలు, డాక్యుమెంట్లు ఉన్న చాంబర్‌లోని ఆక్సిజన్‌ను పూర్తిగా తొలగించి కార్బన్‌డయాక్సైడ్‌తో నింపేస్తారు. తద్వారా ఎలాంటి పురుగులు ఉన్నా చనిపోతాయి. కానీ, సిబ్బంది కొరత కారణంగా ఈ ప్రక్రియ కుంటుపడింది. ఇక్కడ కనీసం 76 మంది సిబ్బంది ఉండాలి. కానీ, ప్రస్తుతం 40 మంది మాత్రమే ఉన్నారు. అనువాదకుల కొరత కూడా ఉంది. -
ఓయూ లేడీస్ హాస్టల్లో ఆగంతకుడి హల్చల్
తార్నాక: ఓయూ, ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి తీవ్ర కళకలం సృష్టించాడు. వాష్ రూమ్కువెళ్లిన యువతి గదిలోకి ప్రవేశించిన అతను అరిస్తే చంపేస్తానంటూ కత్తితో బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థిని కేకలు విని విద్యార్థినులు బయటికి రావడంతో అతను గోడదూకి పారిపోయాడు. ఓయూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓయూ ఇంజినీరింగ్ లేడీస్ హాస్టలో ఉంటున్న ఓ విద్యార్థిని గురువారం తెల్లవారు జామున వాష్‌రూమ్‌కు వెళ్లింది. అదే సమయంలో హాస్టల్ వెనుకవైపు నుంచి గోడదూకి వచ్చిన ఓ ఆగంతకుడు ఆమె గదిలోకి ప్రవేశించి సెల్‌ఫోన్ తీసుకెళుతుండగా, గుర్తించిన ఆమె కేకలు వేసింది. దీంతో ఆ అగంతకుడు కత్తితో అరవొద్దంటూ ఆమెను బెదిరించడంతో ఆమె వాష్‌రూమ్‌లో దాక్కుని గడియవేసుకుంది. దీనిని గుర్తించిన అతను బాత్రూంతో పాటు సమీపంలోని మూడు గదులకు బయటనుంచి గడియపెట్టాడు. అనంతరం వాష్ రూంలోకి వెళ్లిన అతను బాధితురాలిని కత్తితో బెదిరిస్తూ బయటికి లాక్కొచ్చాడు. అతని భారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె కేకలు విద్యార్థినిలు బయటికి వచ్చి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను వారిని కత్తితో బెదిరిస్తూ గోడదూకి పారిపోయాడు. ఈ సమయంలో అతను చోరీ చేసిన సెల్‌ఫోన్ జారికింద పడిపోయింది. సెల్‌ఫోన్‌ను దొంగిలించేందుకే అతను హాస్టల్లోకి ప్రవేశించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గాయనపడిన విద్యార్థినికి దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. క్లూస్ టీమ్,డాగ్ స్క్వాడ్ తనిఖీలు.. ఓయూ పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్‌తో తనిఖీలు నిర్వహించారు. జాగిలాలు హాస్టల్ గోడ వెనుకవైపు వెళ్లి ఆగిపోయాయి. బాధితురాలి కథనం మేరకు అగంతకుడు నల్లగా, పొట్టిగా ఉన్నాడని, తెలుగు, హిందీభాషలు మాట్లాడుతున్నట్లు తెలిసింది. వివరాల ఆధారంగా అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హాస్టల్‌ను సందర్శించినఇన్చార్జ్ వీసీ దీనిపై సమాచారం అందడంతో ఓయూ ఇన్చార్జ్ వీసీ అరవింద్‌కుమార్ గురువారం ఓయూ లేడీస్హాస్టల్ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. హాస్టల్లో సెల్ఫోన్ల గల్లంతు.. కాగా ఓయూ క్యాంపస్‌లోని పలు హాస్టళ్లలో అమ్మాయిల సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. ముఖ్యంగా అగంతకుడు ప్రవేశించిన హాస్టల్లో ఇటీవల సెల్ఫోన్లు పోగొట్టుకున్న విద్యార్థినులు ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసినా వాటి ఆచూకీ లభించలేదు. -
ఓయూ లేడీస్ హాస్టల్లోకి ఆగంతకుడు
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లోకి ఓ ఆగంతకుడు చొరబడటం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. గురువారం తెల్లవారుజామున హాస్టల్లోకి చొరబడ్డ ఆగంతకుడు ఓయూ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో బాత్రూమ్కు వెళ్లిన ఓ విద్యార్థినిని అతడు కత్తితో బెదిరించాడు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో సదురు విద్యార్థిని భయంతో వణికి పోయింది. ఆ తర్వాత విద్యార్థిని కేకలు వేయడంతో ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే దుండగుడు విద్యార్థిని సెల్‌ఫోన్ తీసుకెళ్లాడు. ఆగంతకుడు వెనక వైపు నుంచి హాస్టల్లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఛత్తీస్‌గఢ్‌లో ఓయూ విద్యార్థి అరెస్ట్ !
భీమదేవరపల్లి: ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతున్న వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌కు చెందిన ఉగ్గె భరత్‌ను ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్‌లో పోలీసులు గురువారం అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో వారు పథకం ప్రకారం అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లా శాతావాహన యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు స్టడీ టూర్ పేరిట ఛత్తీస్‌ఘడ్‌కు వెళ్లి మావోయిస్టులను కలిసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ స్టడీ టూర్లో భరత్ సైతం ఉన్నట్లు పోలీసులు అనుమానించి అతడిపై నిఘా పెంచినట్లు తెలుస్తోంది. భరత్ ఇటీవలే జీవిత ఖైదు అనుభవించి జైలు నుంచి విడుదలైన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు ఉగ్గె చంద్రమౌళి ఉరఫ్ మదన్‌లాల్ సోదరుడు ఉగ్గె శేఖర్ కుమారుడు కావడం చర్చనీయాంశంగా మారింది. భరత్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోలీసులు తీసుకెళ్లారా.. లేక ఛత్తీస్‌ఘడ్‌లోనే అరెస్ట్ చేశారా అనేది తెలియరాలేదు. ఇదిలా ఉండగా.. తమ కుమారుడికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధం లేదని.. అనవసరంగా పోలీసులు తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని భరత్ తండ్రి శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
నేడు ఓయూ 80వ స్నాతకోత్సవం
ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణలోనే ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం 80 వ స్నాతకోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు వర్సిటీ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో స్నాతకోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్ ముఖ్యఅతిథులుగా హాజరవుతారు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న 80వ స్నాతకోత్సవంలో 270 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకోనున్నారు. అలాగే పీహెచ్డీ పూర్తిచేసిన సుమారు 680 మంది విద్యార్థులు డాక్టరేట్ పట్టాలను స్వీకరిస్తారు. ఓయూ స్నాతకోత్సవాన్ని ప్రముఖ టీవీ చానళ్లతో పాటు యూట్యూబ్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు. -
ఓయూలో సౌతిండియా హిస్టరీ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశ చరిత్ర మహాసభలకు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కానుంది. ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు ఈ సభలు నిర్వహించేందుకు వర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఓయూలోని చరిత్ర విభాగానికి వందేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో సౌతిండియా హిస్టరీ కాంగ్రెస్ (ఎస్‌ఐహెచ్‌సీ) నిర్వహణకు నిర్ణయించారు. ఈ మహాసభల్లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్రతో పాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక, పరిపాలన సంస్కరణలు, సంస్కృతి సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం తదితర అంశాలపై చర్చలు, పరిశోధనా పత్రాలను ప్రతినిధులు సమర్పించనున్నారు. ప్రతిష్టాత్మకంగా మూడ్రోజులు నిర్వహిస్తున్న ఈ సభలకు దేశ, విదేశాల నుంచి చరిత్ర విభాగం అధ్యాప కులు, పరిశోధకులు 2వేలమంది హాజరుకానున్నట్లు ఎస్‌ఐహెచ్‌సీ కార్యదర్శి ప్రొ.అర్జున్‌రావు తెలిపారు. తెలంగాణ చరిత్రపై స్పెషల్ ఫోకస్.. దక్షిణ భారతదేశంలో తెలంగాణ కొత్తరాష్ట్రం కావడంతో ఈసభల్లో తెలంగాణ ఉద్యమం, ప్రాచీన, ఆధునిక చరిత్ర, మలిదశ తెలంగాణ ఉద్యమం, విజయం, రాష్ట్రావతరణ, అనంతర పరిస్థితులు, అభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారు. స్మారక ఉపన్యాసాలు.. మహాసభల్లో స్మారక ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రొఫెసర్లు రామచంద్రన్, బీసీ రాయ్, కస్తూరి మిశ్రాలపై స్మారక ఉపన్యాసాలుంటాయి. మానసిక ఉల్లాసం కోసం ప్రతిరోజూ రాత్రి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఓయూ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో మహాసభల అనంతరం దూరవిద్య కేంద్రం సమావేశ మందిరాల్లో టెక్నికల్ సెషన్స్, 500 పరిశోధనా పత్రాల సమర్పణ ఉంటుందన్నారు. ఈ పత్రాలను ఈ నెల 25 వరకు ఆన్లైన్లో పంపాల్సి ఉంటుంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్ర రచనా పద్ధతితో పాటు సముద్రాల వాణిజ్య చరిత్రపై పరిశోధనలు రాసి sihcgeneralsecretary@ gmail.com ఈ–మెయిల్‌కు పంపాలి. మహాసభలకు హాజరయ్యేవారు ఫిబ్రవరి 7న ఆర్ట్స్ కాలేజీలో సాయంత్రం 4 వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. వివరాలకు 9849415593 లేదా www.southindianhistorycongress.org/sihc వెబ్సైట్లో సంప్రదించవచ్చన్నారు. -
నిరుద్యోగుల్ని ముంచిన కేసీఆర్‌ను ఓడిద్దాం
హైదరాబాద్: విద్యార్థులు, నిరుద్యోగులను నిండా ముంచిన సీఎం కేసీఆర్‌ను రానున్న ఎన్నికల్లో ఓడిద్దామని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు అన్నారు. శనివారం ఉస్మానియా వర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్‌గౌడ్ మాట్లాడుతూ, నాలుగున్నరేళ్ల పాలనలో నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. నవంబర్ 10న ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట లక్ష మంది విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులతో మహాగర్జన సభను జరుపుతామన్నారు. కేసీఆర్‌ను గద్దెదించేందుకు ఓయూ విద్యార్థులు గ్రామగ్రామాన ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజా వ్యతిరేక, నియంతృత్వ పాలన సాగించిన కేసీఆర్ సచివాలయంలో అడుగుపెట్టకుండా ఫామ్‌హౌజ్, ప్రగతి భవన్‌కు పరిమితమయ్యారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇంతకాలం అధికారంలో ఉన్నా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి కింద రూ.3,016 ప్రకటించడం హాస్యాస్పదమని విద్యార్థి నాయకులు రంజిత్ అన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఓయూలో సభ నిర్వహించాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు ఆర్ఎన్ శంకర్ సవాల్ విసిరారు. టీఆర్ఎస్‡ పాలనలో ఉద్యోగాలు రాక 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పటికైన∙రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యార్థి జేఏసీ నేత ఆర్ఎల్ మూర్తి డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాల్లో ఒక్క జిల్లాకు కూడా అమరుల పేరు పెట్టకుండా అవమానించారని విద్యార్థి జేఏసీ నాయకులు నాగేశ్వర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో కృష్ణమాదిగ, కాంపెల్లి శ్రీనివాస్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. -
లా‘సెట్’ కావడం లేదు
సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్యలో ప్రవేశాలు ఏటా ఆలస్యం అవుతూనే ఉన్నాయి. న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కాలేజీలకు అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తుండటంతో అర్హులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొనడంతో వేల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో మూడేళ్లు, ఐదేళ్ల న్యాయవిద్య కోర్సుల్లో, ఎల్ఎల్ఎంలో ప్రవేశాలకు ఈ ఏడాది మే 25న లాసెట్ నిర్వహించగా, జూన్ 15న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫలితాలను ప్రకటించింది. ఇక బీసీఐ నుంచి అనుమతులు రాగానే కాలేజీల్లో ప్రవేశాలను చేపట్టేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. కానీ ఇప్పటివరకు ప్రవేశాలకు అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరో కోర్సులో చేరలేని పరిస్థితి.. రాష్ట్రంలోని 21 న్యాయవిద్యా కాలేజీల్లో 4,712 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే లాసెట్‌లో మాత్రం 15,793 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో ఎవరికి సీటు వస్తుందో, ఎవరికి రాదో తెలియని పరిస్థితి నెలకొంది. సకాలంలో ప్రవేశాలను నిర్వహిస్తే తాము మరొక కోర్సులోనైనా చేరే వీలుండేదని, ఇపుడు లాసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌కోసం ఎదురుచూస్తూ ఎక్కడా చేరలేని పరిస్థితి నెలకొందని విద్యార్థులు వాపోతున్నారు. పైగా సీటు రాకపోతే విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. 23,109 మంది దరఖాస్తు చేసుకుంటే.. రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 23,109 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో మే 25న నిర్వహించిన రాత పరీక్షకు 18,547 మంది హాజరయ్యారు. అందులో మూడేళ్ల లా కోర్సులో చేరేందుకు 16,332 మంది దరఖాస్తు చేసుకోగా 12,960 హాజరయ్యారు. వారిలో 11,563 మంది అర్హత సాధించారు. ఐదేళ్ల లా కోర్సుకు 4,580 మంది దరఖాస్తు చేసుకుంటే, 3,727 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. 2,401 మంది అర్హత సాధించారు. ఇక పీజీ లాకోర్సు కోసం లాసెట్ రాసేందుకు 2,197 మంది దరఖాస్తు చేసుకోగా, 1,860 మంది హాజరయ్యారు. 1,829 మంది అర్హత సాధించారు. ఇలా మొత్తంగా లాసెట్‌లో అర్హత సాధించిన 15,793 మంది విద్యార్థులకు ప్రవేశాల కౌన్సెలింగ్‌కోసం నెలల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. -
ఓయూ లా కాలేజీలో పరీక్షల విభాగం బాగోతం
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కాలేజీలో ఓ విద్యార్థి ఎల్ఎల్ఎం రెండో సెమిస్టర్ పరీక్షలు రాశాడు. గతంలో ఫెయిలైన నాలుగో పేపర్ ఈసారి బాగా రాశాడు. కానీ ఫెయిలయ్యాడు. అనుమానం వచ్చి తన జవాబు పత్రాల ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కాపీ వచ్చాక చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే అసలు ఆ జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేయనేలేదు. ఫలితాల్లో మాత్రం 23 మార్కులు వచ్చి, ఫెయిలైనట్లు చూపారు. ఎల్ఎల్ఎం మూడో సెమిస్టర్ పూర్తిచేసిన మరో విద్యార్థి ఐదో పేపర్లో ఫెయిలయ్యాడు. సందేహంతో జవాబు పత్రం ఫొటోకాపీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తాను రాసింది ఎల్ఎల్ఎం కోర్సు మూడో సెమిస్టర్ పరీక్షలుకాగా.. అధికారులు పంపింది ఎల్ఎల్బీ కోర్సు మూడో సెమిస్టర్ పరీక్షలు రాసిన మరో విద్యార్థి జవాబు పత్రం. ఏకంగా కోర్సు, జవాబుపత్రం మారినా.. ఆ మార్కులు చూపించి ఫెయిల్ చేశారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో న్యాయ విద్య పరీక్షల మూల్యాంకనంలో తప్పిదాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. ఈ రెండు ఉదాహరణలే కాదు.. అధికారుల తప్పిదాల కారణంగా చాలా మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎల్ఎల్బీ ఐదో సంవత్సరం ఫలితాల్లో తాను ఫెయిలైనట్లు చూపడంతో.. మరో విద్యార్థి రీ వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో 15 మార్కులు తక్కువగా వేసినట్లు బయటపడింది. ఆ విద్యార్థికి తొలుత వేసింది 37 మార్కులేకాగా.. రీ వ్యాల్యుయేషన్‌లో లెక్కతేలిన మార్కులు 52 కావడం గమనార్హం. నిర్లక్ష్యానికి పరాకాష్టగా.. ఉస్మానియా వర్సిటీ పరీక్షల విభాగం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా తయారైందని విమర్శలు వస్తున్నాయి. అధికారులు, ప్రొఫెస ర్ల తప్పిదాలతో అనేక మంది విద్యార్థులు నష్టపోతున్నారు. పరీక్షలు బాగా రాసినా జవాబు పత్రాలను సరిగా మూల్యాంకనం చేయక.. కొ న్నిసార్లయితే మూల్యాంకనమే చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన చోట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాదే కాదు.. చాలా సంవత్సరాలుగా ఇదే తరహా పరిస్థితి ఉంటోందని విద్యార్థులు వాపోతున్నారు. తప్పుల మీద తప్పులు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కాలేజీల్లో మే నెలలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పరీక్షలు జరిగాయి. వీటికి దాదాపు 7 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు ఆగస్టులో విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల్లో కొందరు జవాబు పత్రాల ఫొటో కాపీల కోసం దరఖాస్తు చేయడంతో అధికారులు, ప్రొఫెసర్ల బాగోతం బయటపడింది. మే 22న ఎల్ఎల్ఎం రెండో సెమిస్టర్ నాలుగో పేపర్ పరీక్షకు సంబంధించి ఓ విద్యార్థి జవాబు పత్రాన్ని మూల్యాంకనమే చేయలేదు. మార్కుల షీట్లో మార్కులు కూడా వేయలేదు. కానీ ఫలితాల్లో మాత్రం ఆ సబ్జెక్టులో కొన్ని మార్కులను చూపించి ఫెయిల్ చేశారు. మే 19వ తేదీన జరిగిన ఎల్ఎల్ఎం మూడో సెమిస్టర్ ఐదో పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి జవాబు పత్రం గల్లంతైంది. అదే తేదీన జరిగిన ఎల్ఎల్బీ మూడో సెమిస్టర్ పరీక్షలకు హాజరైన వేరే విద్యార్థి మార్కుల షీట్లో పేర్కొన్న మార్కులను ఎల్ఎల్ఎం విద్యార్థికి వేసి ఫెయిల్ చేశారు. అంతేకాదు జవాబు పత్రం ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ ఎల్ఎల్ఎం విద్యార్థికి ఇచ్చింది కూడా ఎల్ఎల్బీ మూడో సెమిస్టర్ పరీక్ష రాసిన వేరే విద్యార్థి జవాబు పత్రం. మరో విచిత్రం ఏమిటంటే.. కనీసం ఈ మారిన జవాబు పత్రాన్ని కూడా మూల్యాంకనం చేయలేదు. కనీసం మార్కుల షీట్లో మార్కులు వేయలేదు, ఎగ్జామినర్, స్క్రూటినైజర్ సంతకాలు కూడా లేవు. కానీ ఇష్టం వచ్చినట్లుగా ఏవో మార్కులు వేసి ఫెయిల్ చేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకునేదెవరు? తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొనేందుకు వెళ్లిన విద్యార్థులకు సమాధానమిచ్చే వారే లేకుండా పోయారు. పరీక్షల విభాగంలో అడిగితే అధికారులెవరూ పెద్దగా స్పందించడం లేదు. దాంతో విద్యార్థులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. అసలు ఎల్ఎల్బీ పరీక్షల్లో రీవెరిఫికేషన్‌కు అవకాశమిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు... ఎల్ఎల్ఎంలో రీ వెరిఫికేషన్‌కు అవకాశమివ్వడం లేదు. రీ వెరిఫికేషన్‌కు అవకాశముంటే... మార్కులు నష్టపోయిన విద్యార్థుల జవాబు పత్రాలను మరోసారి పరిశీలించేవారు. దాంతో ముందుగా మూల్యాంకనం చేయకపోతే.. రీవెరిఫికేషన్లో మూల్యాంకనం చేసి మార్కులు ఇచ్చే అవకాశం ఉండేది. కానీ ఎల్ఎల్ఎంలో ఆ అవకాశం లేకపోవడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. -
డిగ్రీ విద్యార్థులపై ‘అదనపు’ మోత!
- రూ.10 వేల చొప్పున వసూలు చేసుకునేందుకు ఓయూ అనుమతి - హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 428 డిగ్రీ కాలేజీల్లో పెంపు - ఫీజు రీయింబర్స్మెంట్ పరిధిలోకి రాని ‘అదనపు’ ఫీజు - దాదాపు లక్షన్నర మంది విద్యార్థులపై భారం సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ‘అదనపు’ ఫీజు మోత మోగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని డిగ్రీ కాలేజీలు ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజుకు అదనంగా ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 వేలు వసూలు చేసుకునేందుకు యూనివర్సిటీ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ‘ఆర్డినెన్స్-37’ను జారీ చేసింది. దీంతో ఓయూ పరిధిలోని దాదాపు 428 డిగ్రీ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనంగా రూ.10 వేల చొప్పున వసూలు చేయనున్నాయి. ఈ ‘అదనపు ఫీజు’ రీయింబర్స్మెంట్ పథకం పరిధిలోకి రాదు. విద్యార్థులే సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ప్రవేశాలతో.. ఆన్లైన్ ప్రవేశాలను తాము అమలు చేయబోమని, యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజుకు తాము ఒప్పుకోబోమని ఉస్మానియా వర్సిటీ పరిధిలోని ప్రముఖ, అటానమస్ డిగ్రీ కాలేజీలు పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ వంటి ప్రాంతాల్లోని కాలేజీల్లో ఫీజుల విషయంలో యాజమాన్యాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఓయూ పరిధిలోని డిగ్రీ కాలేజీలతో ఉన్నత విద్యా శాఖ చర్చించింది. కాలేజీలు ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 వేలు అదనంగా (అదర్ ఫీ పేరుతో) వసూలు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఇప్పటికే నిర్ణయించిన ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజులకు అదనంగా ఈ మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చని సూచించింది. ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజులు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ పరిధిలోకి వస్తాయని... ‘అదర్ ఫీ’ పేరుతో వసూలు చేసే ఈ మొత్తం రీయింబర్స్మెంట్ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. దీనికి అంగీకరించే కాలేజీలు ‘అదర్ ఫీజు’ను వసూలు చేసుకోవచ్చని, ఒప్పుకోని కాలేజీలు వసూలు చేయడానికి వీల్లేదని ఉస్మానియా వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. భారీగా పెరుగుతున్న ఫీజులు ప్రస్తుతం రాష్ట్రంలో 1,200 వరకు ప్రైవేటు డిగ్రీ కాలేజీలుండగా.. వాటిల్లో దాదాపు 4 లక్షల మంది వరకు చదువుతున్నారు. అందులో ఉస్మానియా వర్సిటీ పరిధిలోనే 428 కాలేజీలున్నాయి. వీటిలో హైదరాబాద్ మినహా రంగారెడ్డి, మెదక్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దాదాపు 300 కాలేజీల్లో ల క్షన్నర మంది వరకు విద్యార్థులు చదవుతున్నారు. ఈ కాలేజీల్లో ప్రస్తుతం కోర్సును బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వార్షిక ఫీజు అమల్లో ఉంది. ప్రస్తుతం అమల్లోకి వచ్చే ‘అదర్ ఫీజు’ కారణంగా ఒక్కో విద్యార్థిపై రూ.10 వేలు అదనపు భారం పడనుంది.