భద్రం కాదు.. ఛిద్రం | Documents of the Nizam's period was being Decaying | Sakshi
Sakshi News home page

భద్రం కాదు.. ఛిద్రం

Published Sat, Sep 7 2019 3:18 AM | Last Updated on Sat, Sep 7 2019 3:18 AM

Documents of the Nizam's period was being Decaying - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చారిత్రక పత్రం.. ఇక చేతికందడం కష్టం.. పత్రాలు చిరిగె.. అక్షరాలు చెదిరె.. నవాబుల పత్రాలు.. ఖరాబు చిత్రాలవుతున్నాయి. రాజ పత్రం రాజసం కోల్పోయింది. వందల ఏళ్లనాటి చారిత్రక సాక్ష్యాలు, కోట్లకొద్దీ డాక్యుమెంట్లు, ఫర్మానాలు, గెజిట్‌లు రాజ్యాభిలేఖ పరిశోధనాలయంలో కొలువుదీరాయి. కాకపోతే ఛిద్రంగా! ఏ పత్రం ఏ క్షణంలో నుసిగా రాలి పోతుందో తెలియని దుస్థితి. మొదటి నవాబు నుంచి నేటి పాలకుల వరకు తీసుకున్న కీలక నిర్ణయాలు, ఫర్మానాలు, జీవోలు ఈ భాండాగారంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. హుస్సేన్‌సాగర్, గండిపేట్, ఉస్మానియా వర్సిటీ, ఆస్పత్రులు వంటి అనేక చారిత్రక కట్టడాల నిర్మాణానికి నవాబులు విడుదల చేసిన ఫర్మానాలు, ముంతఖాబ్‌లు, అప్పటి సామాజిక, ఆర్థిక పరిణామాలను తెలిపే ఎన్నో కీలకమైన డాక్యుమెంట్లు, హైదరాబాద్‌ స్టేట్‌ చరిత్రకు సంబంధించిన పత్రాలు ఇక్కడ ఉన్నాయి. 

ముందుకు సాగని డిజిటలైజేషన్‌..
మొదటి నిజాం నవాబు ఖమృద్దీన్‌ అలీఖాన్‌ నుంచి ఆఖరి నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ వరకు, 1406వ సంవత్సరం నుంచి ఇటీవలి వరకు సుమారు 4.3 కోట్ల డాక్యుమెంట్లు, 1724 నుంచి 1890 వరకు విడుదలైన ఫర్మానాలు, సనత్‌లు, జాగీర్‌ ఇనాంలకు సంబంధించిన పత్రాలన్నీ పర్షియన్, ఉర్దూ భాషల్లోనే ఉన్నాయి. ఏడో నిజాంకాలంలో బ్రిటిష్‌ ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలకు ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. రౌండ్‌టేబుల్‌ సమావేశాల్లో గాంధీజీ, జిన్నా, అంబేడ్కర్, నెహ్రూతోపాటు అప్పటి హైదరాబాద్‌ ప్రధానమంత్రి అక్బర్‌ హైదరీ పాల్గొన్నప్పటి విశేషాలు, మినిట్స్‌ బుక్స్‌ను ఇక్కడ భద్రపరిచారు. 2012లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం విడుదల చేసిన రూ.2.75 కోట్లతో సుమారు 60 లక్షల పేజీలను, సుమారు 1896 నుంచి 1948 వరకు ఉన్న డాక్యుమెంట్లన్నీ డిజిటలైజ్‌ చేశారు. కానీ 1896కు ముందు , 1948 తరువాత విడుదలైన గెజిట్‌ పత్రాలు, జీవోలు, ఇతర అనేక డాక్యుమెంట్లు, జీవోలు డిజిటలైజేషన్‌ చేయవలసి ఉందని రాజ్యాభిలేఖ పరిశోధనాలయం అధికారి ఒకరు తెలిపారు.

ఒక్క రూపాయీ విడుదల కాలేదు..
‘‘తెలంగాణ ఏర్పడిన తరువాత డిజిటలైజేషన్‌ కోసం ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. మరో నాలుగైదేళ్లలో చాలా పత్రా లు చేతికందకుండా పోయే ప్రమాదం ఉంది. ముఖ్యం గా 1724 నుంచి వెలువడిన అనేక పత్రాలు అప్పటికీ శిథిలాస్థకు చేరుకున్నాయి. వాటిని కాపాడడం చాలా కష్టంగా ఉంది’’అని పరిశోదనాలయ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. 

నిలిచిపోయిన ఫుమిగేషన్‌...
వందల ఏళ్లుగా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా పుస్తకాలు, డాక్యుమెంట్లకు పురుగుపట్టవచ్చు. దీనిని నివారించేందుకు ఫుమిగేషన్‌ చేస్తారు. పుస్తకాలు, డాక్యుమెంట్లు ఉన్న చాంబర్‌లోని ఆక్సిజన్‌ను పూర్తిగా తొలగించి కార్బన్‌డయాక్సైడ్‌తో నింపేస్తారు. తద్వారా ఎలాంటి పురుగులు ఉన్నా చనిపోతాయి. కానీ, సిబ్బంది కొరత కారణంగా ఈ ప్రక్రియ కుంటుపడింది. ఇక్కడ కనీసం 76 మంది సిబ్బంది ఉండాలి. కానీ, ప్రస్తుతం 40 మంది మాత్రమే ఉన్నారు. అనువాదకుల కొరత కూడా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement