Historical monuments
-
చరిత్రకు ఆనవాళ్లుగా పురాతన కట్టడాలు
ఏలూరు (టూటౌన్): వేంగి రాజుల పాలనలో హేలాపురిగా పిలువబడిన ఏలూరులో పలు చారిత్రాత్మక కట్టడాలు నేటికీ ఆ సామ్రాజ్య ప్రాభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అప్పట్లో ఈ నగరంలో రత్నాలు రాశులు పోసి అమ్మేవారని ప్రతీతి. చుట్టూ ఏరులతో ఏరుల ఊరుగా కూడా ఈ నగరాన్ని గతంలో పిలిచేవారు. ఈ ప్రాంతంలో రాజుల కాలం నుంచి బ్రిటీష్ హయాం వరకూ, జమిందారీల కాలం వరకూ ఎన్నో అపురూప కట్టడాలు హేలాపురిలో వెలిశాయి. నాటి చరిత్రకు ఆనవాళ్లుగా ఈ కట్టడాలు నేటికీ చెక్కుచెదకుండా నిలిచి వీక్షకులను అబ్బురపరుస్తున్నాయి. వీటిలో ఎంతో విశిష్టత ఉన్న కట్టడాలతో పాటు దేవాలయాలు ఉండటం విశేషం. వేంగీ రాజుల కాలంలో 1104 సంవత్సరంలో నిర్మించిన పడమర వీధిలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం, శనివారపుపేటలోని చెన్నకేశవస్వామి దేవాలయ గోపురం, దొంగల మండపం, కోటదిబ్బలో ఉన్న శాసనాలు నేటికీ చెక్కుచెదరలేదు. బ్రిటీష్ హయాంలో నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవనం, నాటి ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు నిర్మించిన సరీ్వసు రిజర్వాయరు, మున్సిపల్ పాత కార్యాలయం, జిల్లా విద్యాశాఖ పాత కార్యాలయాలు నాటి చరిత్రకు గుర్తులుగా మిగిలాయి. వీటితో పాటు నాటి హేలాపురిలో ఉండే జమిందారీ మహల్స్, ఇతర భవనాలు దర్శనమిస్తున్నాయి. ఈ కట్టడాలను చూసినప్పుడు నేటి తరం ప్రజలు హేలాపురికి ఇంతటి ఘనచరిత్ర ఉందా అంటూ చర్చించుకోవడం పరిపాటిగా మారింది. ఏది ఏమైనప్పటికీ అలనాటి చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్న ఈ కట్టడాలను సంరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. బ్రిటీష్ కాలం నాటి మున్సిపల్ కార్యాలయం - అప్పటి జమిందారీ మహల్ - బ్రిటీష్ కాలం నాటి పాత డీఈఓ కార్యాలయం - దొంగల మండపం -
తాజ్, ఎర్రకోటల వద్ద మళ్లీ టూరిస్టుల సందడి!
సాక్షి, న్యూఢిల్లీ : అన్‌లాక్ 2.0లో భాగంగా తాజ్‌మహల్, ఎర్రకోట సహా దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాలు జులై 6 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా కట్టడితో విధించిన సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం పూర్తి భద్రతతో చారిత్రక, సాంస్కృతిక కట్టడాలు మళ్లీ ప్రారంభం కానున్నాయని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వెల్లడించారు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు మార్చి చివరి వారం నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు భారీ సడలింపులు ప్రకటించినా ఇప్పటివరకూ తెరుచుకోని చారిత్రక కట్టడాల వద్ద జులై 6 నుంచి తిరిగి పర్యాటకుల సందడి మొదలవనుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)తో సంప్రదింపులు జరిపిన మీదట కేంద్ర ప్రభుత్వం చారిత్రక కట్టడాలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. చదవండి : తాజ్ అందాలు ఆస్వాదించా -
భద్రం కాదు.. ఛిద్రం
సాక్షి, హైదరాబాద్: చారిత్రక పత్రం.. ఇక చేతికందడం కష్టం.. పత్రాలు చిరిగె.. అక్షరాలు చెదిరె.. నవాబుల పత్రాలు.. ఖరాబు చిత్రాలవుతున్నాయి. రాజ పత్రం రాజసం కోల్పోయింది. వందల ఏళ్లనాటి చారిత్రక సాక్ష్యాలు, కోట్లకొద్దీ డాక్యుమెంట్లు, ఫర్మానాలు, గెజిట్లు రాజ్యాభిలేఖ పరిశోధనాలయంలో కొలువుదీరాయి. కాకపోతే ఛిద్రంగా! ఏ పత్రం ఏ క్షణంలో నుసిగా రాలి పోతుందో తెలియని దుస్థితి. మొదటి నవాబు నుంచి నేటి పాలకుల వరకు తీసుకున్న కీలక నిర్ణయాలు, ఫర్మానాలు, జీవోలు ఈ భాండాగారంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. హుస్సేన్‌సాగర్, గండిపేట్, ఉస్మానియా వర్సిటీ, ఆస్పత్రులు వంటి అనేక చారిత్రక కట్టడాల నిర్మాణానికి నవాబులు విడుదల చేసిన ఫర్మానాలు, ముంతఖాబ్‌లు, అప్పటి సామాజిక, ఆర్థిక పరిణామాలను తెలిపే ఎన్నో కీలకమైన డాక్యుమెంట్లు, హైదరాబాద్ స్టేట్ చరిత్రకు సంబంధించిన పత్రాలు ఇక్కడ ఉన్నాయి. ముందుకు సాగని డిజిటలైజేషన్.. మొదటి నిజాం నవాబు ఖమృద్దీన్ అలీఖాన్ నుంచి ఆఖరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వరకు, 1406వ సంవత్సరం నుంచి ఇటీవలి వరకు సుమారు 4.3 కోట్ల డాక్యుమెంట్లు, 1724 నుంచి 1890 వరకు విడుదలైన ఫర్మానాలు, సనత్‌లు, జాగీర్ ఇనాంలకు సంబంధించిన పత్రాలన్నీ పర్షియన్, ఉర్దూ భాషల్లోనే ఉన్నాయి. ఏడో నిజాంకాలంలో బ్రిటిష్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలకు ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. రౌండ్‌టేబుల్ సమావేశాల్లో గాంధీజీ, జిన్నా, అంబేడ్కర్, నెహ్రూతోపాటు అప్పటి హైదరాబాద్ ప్రధానమంత్రి అక్బర్ హైదరీ పాల్గొన్నప్పటి విశేషాలు, మినిట్స్ బుక్స్‌ను ఇక్కడ భద్రపరిచారు. 2012లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం విడుదల చేసిన రూ.2.75 కోట్లతో సుమారు 60 లక్షల పేజీలను, సుమారు 1896 నుంచి 1948 వరకు ఉన్న డాక్యుమెంట్లన్నీ డిజిటలైజ్ చేశారు. కానీ 1896కు ముందు , 1948 తరువాత విడుదలైన గెజిట్ పత్రాలు, జీవోలు, ఇతర అనేక డాక్యుమెంట్లు, జీవోలు డిజిటలైజేషన్ చేయవలసి ఉందని రాజ్యాభిలేఖ పరిశోధనాలయం అధికారి ఒకరు తెలిపారు. ఒక్క రూపాయీ విడుదల కాలేదు.. ‘‘తెలంగాణ ఏర్పడిన తరువాత డిజిటలైజేషన్ కోసం ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. మరో నాలుగైదేళ్లలో చాలా పత్రా లు చేతికందకుండా పోయే ప్రమాదం ఉంది. ముఖ్యం గా 1724 నుంచి వెలువడిన అనేక పత్రాలు అప్పటికీ శిథిలాస్థకు చేరుకున్నాయి. వాటిని కాపాడడం చాలా కష్టంగా ఉంది’’అని పరిశోదనాలయ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. నిలిచిపోయిన ఫుమిగేషన్... వందల ఏళ్లుగా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా పుస్తకాలు, డాక్యుమెంట్లకు పురుగుపట్టవచ్చు. దీనిని నివారించేందుకు ఫుమిగేషన్ చేస్తారు. పుస్తకాలు, డాక్యుమెంట్లు ఉన్న చాంబర్‌లోని ఆక్సిజన్‌ను పూర్తిగా తొలగించి కార్బన్‌డయాక్సైడ్‌తో నింపేస్తారు. తద్వారా ఎలాంటి పురుగులు ఉన్నా చనిపోతాయి. కానీ, సిబ్బంది కొరత కారణంగా ఈ ప్రక్రియ కుంటుపడింది. ఇక్కడ కనీసం 76 మంది సిబ్బంది ఉండాలి. కానీ, ప్రస్తుతం 40 మంది మాత్రమే ఉన్నారు. అనువాదకుల కొరత కూడా ఉంది. -
ఐటీసీకి చార్మినార్, జీఎమ్ఆర్కు గోల్కొండ!
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ ఎర్రకోటను దాల్మియా భారత్ కంపెనీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోకి ఇప్పుడు జీఎమ్ఆర్, ఐటీసీ హోటల్స్ కూడా చేరాయి. ఈ క్రమంలో ఐటీసీ కంపెనీ 400 ఏళ్ల నాటి చారిత్రక కట్టడం, హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న చార్మినార్‌ను దత్తత తీసుకోవడం కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)ను దాఖలు చేసింది. చార్మినార్ దత్తత కోసం ఐటీసీకి పోటీగా మరే ఇతర కంపెనీ పోటీ పడకపోవడంతో ఐటీసీ దరఖాస్తును విజన్ కమిటీ, ఒవర్‌నైట్ కమిటీ ఆమోదించాయి. అలానే జీఎమ్ఆర్ స్పోర్ట్స్ ఈ ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమంలో భాగంగా మొత్తం ఏడు చారిత్రక కట్టడాల దత్తత కోసం దరఖాస్తు చేసింది. వాటిలో ఢిల్లీలోని ఎర్రకోట, గోల్కొండ కోట కూడా ఉన్నాయి. దీని గురించి జీఎమ్ఆర్ స్పోర్ట్స్ కంపెనీ అధికారులు ‘ మేము గోల్కొండ కోట కోసం వేసిన బిడ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఒకవేళ మా బిడ్ కమిటీకి నచ్చి, మాకు గోల్కొండ కోటను కేటాయిస్తే అప్పుడు మేము ప్రభుత్వంతో ఒక ఎమ్వోయూను కుదుర్చుకుంటాము’ అని తెలిపారు. జీఎమ్ఆర్ స్పోర్ట్స్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ :... చారిత్రక కట్టడాల సంరక్షణతో పాటు పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం 2017, సెప్టెంబరులో ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమం ప్రారంభింది. ఈ దత్తత కార్యక్రమంలో భాగంగా దాదాపు 100 చారిత్రక కట్టడాల పేర్లను ప్రకటించింది. తాజ్‌మహల్, ఎర్రకోట, సూర్య దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్ వంటి చారిత్రక కట్టడాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశం పర్యటక రంగంలో కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేసి ఆయా చారిత్రక కట్టడాలను సంరక్షించడం. చారిత్రక కట్టడాల దత్తత కార్యక్రమంలో భాగంగ కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తుంది. అత్యధిక బిడ్ వేసిన కంపెనీలకు ఈ చారిత్రక కట్టడాలను కేటాయిస్తారు. ఇక రానున్న ఐదేళ్లపాటు ఆయా చారిత్రక కట్టడాల సంరక్షణ బాధ్యత ఆ కంపెనీలదే. ఈ కార్యక్రమం అమలులో భాగంగా ఎర్రకోటను దత్తత చేసుకోవాడానికి దాల్మియా భారత్ గ్రూపు, ఇండిగో ఎయిర్‌లైన్స్ కంపెనీలు పోటీ పడగా... చివరకు ఈ రేసులో దాల్మియా భారత్ కంపెనీ 25 కోట్ల రూపాయల టెండర్ వేసి ఎర్రకోటను దక్కించుకుంది. ఇకమీదట ఎర్రకోట సంరక్షణ బాధ్యతలతో పాటు ఎర్రకోటకు వచ్చే పర్యాటకుల బాధ్యత కూడా ఇక దాల్మియానే చూసుకోనుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) : ఏదైనా వ్యాపారంలో భాగస్వామి అయ్యేందుకు లేదా ఉద్యోగం చేసే ఉద్ధేశంతో ఒక కంపెనీ లేదా పెట్టుబడిదారు పోటీ పడటం. -
చారిత్రక కట్టడం మొలంగూర్ ఖిల్లా
పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలని విన్నపం మొలంగూర్ దూద్‌బావి నీటికి ప్రాముఖ్యత శంకరపట్నం: మండలంలోని మొలంగూర్ ఖిల్లా చారిత్రక కట్టడాలకు నిలయంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. అలిగిరి మహరాజ్ అనే అనే సంస్థానదీశుడు మొలంగూర్ గుట్టను ఖిల్లాగా చేసి ఇక్కడి నుండి ఓరుగల్లును పరిపాలించేవాడని స్థానికులు చెప్తారు. చత్రుదుర్భేద్యమైన కోటను నిర్మించి ఇక్కడి నుంచి గుట్టపైకి అశ్వాలపై వెళ్లేందుకు రాతిబాటను నిర్మించారు. మొలంగూర్ గ్రామంలో కోటను నిర్మించి , కోనేరు తవ్వించారు. ఈ కోటలోనే అశ్వాలు సేదతీరేవని ప్రచారం ఉంది. మొలంగూర్ గ్రామం కోటలు, ఖిల్లా ముఖద్వారంతో పాటు, గుట్టపై కోనేరు నిర్మితం కావడం విశేషం. ఖిల్లా ముఖం ద్వారం నుండి ముందుకు వెళగానే దూద్‌బావి దర్శనమిస్తుంది. ఈ దూద్‌బావి నీటిని నాటి రాజులు హైదరాబాద్‌కు గుర్రం బండిపై తీసుకెళ్లేవారని ప్రచారంలో ఉంది. మొలంగూర్ ఖిల్లా అందాలను చూడడానికి కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్ జిల్లానుంచి పర్యాటకులు వస్తున్నప్పటికీ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోలేదు. రెండేళ్ల క్రితం మొలంగూర్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా చేయాలని అధికారులు నివేదించారు. పలు మార్లు ప్రజలు, ప్రజాప్రతినిదులు వినతులు ఇస్తున్నారు. విద్యార్థుల సందడి.. మొలంగూర్ ఖిల్లా వైభవాన్ని తెలుసుకునేందుకు విద్యార్థులను ఈ ప్రాంతానికి తీసుకొస్తారు. మొలంగూర్ ఖిల్లాపైకి చేరుకొని నాటి కళావైభవాన్ని స్థానికులను అడిగి తెలుసుకుంటారు. కరీంనగర్,వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌పాఠశాల విద్యార్థులు ఇక్కడి విశేషాలను తెలుసుకోవడానికి వస్తారు. -
చారిత్రక కట్టడాలకు పూర్వవైభవం
► పురావస్తు పాలసీ తేనున్న రాష్ట్ర ప్రభుత్వం ► దేశవిదేశీ నిపుణులతో శాస్త్రీయ అధ్యయనం ► పయోగాత్మకంగా గణపురం దేవాలయం ఎంపిక ► రంగంలోకి వరంగల్ ‘నిట్’ నిపుణులు ► త్వరలో విధాన రూపకల్పన సాక్షి, హైదరాబాద్: కాకతీయుల కాలం నాటి నిర్మాణ కౌశలానికి నిదర్శనంగా నిలిచిన వరంగల్‌లోని వేయి స్తంభాల దేవాలయం మండపాన్ని పునరుద్ధరణ పేరుతో కొన్నేళ్ల క్రితం పురావస్తుశాఖ అధికారులు విప్పదీశారు. కానీ దాన్ని తిరిగి పాత పద్ధతిలో నిర్మించేందుకు నిపుణులకు చుక్కలు కనిపించాయి. ఏళ్లపాటు ఆ రాళ్లు మట్టికొట్టుకుపోయి మన పనితీరును ఎండగట్టాయి. ఇలాంటి దుస్థితి మళ్లీ రాకుండా ఉండాలంటే ‘చారిత్రక కట్టడాల విధానం’ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని తయారీకి రంగం సిద్ధం చేసింది. ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే స్థాయి చారిత్రక కట్టడాలు ఉండి కూడా ప్రపంచ పర్యాటక పటంలో తెలంగాణ గుర్తింపునకు నోచుకోని నేపథ్యంలో ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా చారిత్రక కట్టడాలకు ప్రాచుర్యం కల్పించనుంది. ముఖ్యంగా కాకతీయుల కళావైభవానికి, అలనాటి ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి నిదర్శనంగా నిలిచే కట్టడాలకు పూర్వవైభవం తేవాలని భావిస్తోంది. ఏం చేస్తారు... రాష్ట్రంలో ప్రస్తుతం పురాతన చారిత్రక కట్టడాలెన్నో శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని తాత్కాలిక మరమ్మతులతోనే సరిపుచ్చుతున్నారు. కానీ అవి బలహీనపడుతూ ఎప్పుడు కూలిపోతాయో తెలియని దుస్థితికి చేరుకుంటున్నాయి. వాటిని భవిష్యత్తు తరాలకు అందించాలంటే పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే... వాటిలోని ఒక్క రాయిని కదలించాలన్నా శాస్త్రీయ అధ్యయనం అవసరం. ఈ కట్టడాల పునరుద్ధరణకు అనుసరించాల్సిన పద్ధతులు, శాస్త్రీయ అధ్యయనం, నిధుల కేటాయింపు... లాంటి అంశాలతో ఓ విధానం రూపొందిస్తారు. ఇందుకోసం దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో నిపుణులను సలహాదారులుగా నియమిస్తారు. ఇప్పటికే అలాంటి కొందరు నిపుణులతో పురావస్తుశాఖ అధికారులు సంప్రదిస్తున్నారు. ఆయా కట్టడాల పటుత్వం ఎంతో ముందుగా తేలుస్తారు. దాని పునరుద్ధరణ చేపట్టాలంటే అనుసరించాల్సిన అంశాలేమిటో శాస్త్రీయ అధ్యయనంతో తేలుస్తారు. దానికి వాడిన రాయి గుణం ఏమిటి, ఎలాంటి పద్ధతులతో అది పదిలంగా ఉంటుంది, అది ఏ రకమైన రాయి, ఇసుక, నేల స్వభావం ఏమిటి, అప్పట్లో ఏ ఇంజనీరింగ్ విధానాన్ని అనుసరించారు. రాళ్ల అనుసంధానానికి వాడిన పదార్థం ఏమిటి, డంగుసున్నం మిశ్రమంలో వాడిన పదార్థాలేమిటి... అన్ని విషయాలను తేల్చి, దాని పునరుద్ధరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. దాని ఆధారంగానే శాస్త్రీయ పద్ధతుల్లో పనులు చేపట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. గణపురం దేవాలయం ఎంపిక వరంగల్ జిల్లాలోని గణపురం దేవాల యాన్ని ప్రయోగాత్మకంగా తొలి ప్రణాళికకు ఎంపిక చేశారు. దీనికి సంబంధించి 3 రోజుల క్రితం పురావస్తుశాఖ సంచాలకులు విశాలాక్షి వరంగల్‌లోని ‘నిట్’ నిపుణులతో కలసి ఆలయాన్ని సందర్శించారు. ఇప్పటికే తొలి దశ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ఆలయం పునాదుల్లోకి బోరు రంధ్రాల ద్వారా డంగు సు న్నం మిశ్రమాన్ని పంపించారు. అది నిర్ధారిత పద్ధతిలో గట్టిపడిందోలేదో నిపుణులు పరిశీలిం చాల్సి ఉంది. వారి పూర్తి అధ్యయనం తర్వాత ఓ ప్రణాళికను సిద్ధం చేస్తారు. దాని ఆధారంగా తదుపరి పనులు మొదలుపెడతారు. -
చరిత్ర శిథిలం..!
కాలగర్భంలోకి చారిత్రక కట్టడాలు గతమెంతో ఘనం.. ప్రస్తుతమంతా శూన్యం పట్టించుకోని అధికారులు.. పాలకులు నిర్మల్‌రూరల్ : నిమ్మల.. పేరులోనే నిర్మలత్వాన్ని నింపుకున్న ఈ ఊరిలోనా ఎన్నో విశేషాలున్నాయి. భద్రాద్రి రామయ్య దగ్గరి నుంచి గోదారమ్మ వెంట వెనక్కి వచ్చిన నిమ్మల నాయుడు ఇక్కడి ప్రకృతికి పరవశించిపోయూడు. ఇక్కడి స్థల విశేషాన్ని గుర్తించి స్థిరపడ్డాడు. అలా.. పన్నెండిళ్లతో మొదలైన ఊరికి తన పేరే పెట్టాడు. ఊరి చుట్టూ చెరువులు తవ్వించి, కోటలు కట్టించాడు. అనంతర పాలకులూ అదేరీతిలో అభివృద్ధి పర్చారు. కాకతీయులను తలపించేలా పాలన సాగించారు. ఆనాటి నిమ్మల రాజ్యమే తరాలు మారి.. నేడు నిర్మల్‌గా ఎదిగింది. నాడు రాజులు ఏలిన ఈ గడ్డపై నుంచి నేడు ఢిల్లీదాకా ఎదిగిన బిడ్డలూ ఉన్నారు. కాలగమనంలో దశాబ్దాలు గిర్రున తిరిగిపోయినట్లే.. గతవైభవపు స్మృతులూ ఒక్కొక్కటీ పోతున్నాయి. నాటి నిమ్మల రాజ్యపు ఆనవాళ్లు నేటి నిర్మల్‌లో కనుమరుగవుతున్నాయి. ఇన్నాళ్లు ఠీవీగా దర్పాన్ని చాటిన కోటలు.. వాటి గోడలు కూలిపోతున్నాయి. ఇప్పటికే చెరువులు సగం పోగా, ఇప్పుడు చారిత్రక గుర్తులు సైతం శకలాలుగా పడిపోతున్నారుు. ఏళ్లుగా వాటిని కనీసం పట్టించుకోని అధికారులు.. పాలకులే ఇందుకు కారణం. గఢ్.. గఢ్‌కో చరిత్ర.. నిర్మల్ అంటే కోటలు, గఢ్‌లకు ప్రసిద్ధి. అందులో ఒక్కో గఢ్‌కు ఒక్కో చరిత్ర ఉంది. పట్టణానికి తూర్పున ఎత్తైగుట్టపై నిలువెత్తుగా ఉన్న బత్తీస్గఢ్ ఆ రోజుల్లో శత్రువుల గుండెలను దడదడలాడించింది. హిందీలో బత్తీస్ అంటే 32. ఈ గఢ్‌లో ఒకదానికొకటి ఆనుకుని 32 గదులను నిర్మించారు. దీంతో దీనికి బత్తీస్గఢ్ అనే పేరొచ్చింది. శ్రీనివాసరావు కాలంలో ఫ్రెంచ్ ఇంజినీర్ల సలహాలతో మట్టికోటగా ఉన్న బత్తీస్‌గఢ్‌ను డంగుసున్నం, ఇటుక, రాయితో బలమైన కోటగా మార్చారు. ఎతైన బురుజును నిర్మించి దానిపై ఫిరంగులను అమర్చారు. ఈ గఢ్‌లోనే మందుగుండు, ఆయుధాలు తయారు చేసేవారికి వసతి కల్పించారు. శ్రీనివాస్‌రావు తన పాలనకాలంలోనే ఎక్కువ గఢ్‌లను నిర్మించాడు. పట్టణానికి దక్షిణం వైపు సైన్యాన్ని ఉంచేందుకు విశాలమైన శ్యాంగఢ్‌ను నిర్మించారు. అప్పటి తన అశ్వ సైన్యాధిపతి పేరుమీదుగా దీనికి శ్యాంగఢ్‌గా పేరుపెట్టినట్లు చెబుతారు. పట్టణంలోకి ఎవరు రావాలన్నా ఈ గఢ్‌ను దాటుకునే రావాల్సి ఉంటుంది. దీనికి ఓ వైపు కంచెరోని చెరువు ఉంది. చెరువుకు, గఢ్‌కు మధ్యలో నుంచే ప్రస్తుత 44వ నంబరు జాతీయరహదారి వెళ్తోంది. బంగల్పేట్ శివారులో ధం-ధంగఢ్, వెంకటాద్రిపేట్‌లో మరోగఢ్, బత్తీస్గఢ్ పక్కనే వేంకటేశ్వర(ఏకశిలా)గఢ్ నిర్మించారు. పట్టణంతోపాటు మండలంలోని సోన్ సమీపంలో సోన్‌గఢ్, చిట్యాలలో చిట్టీగఢ్‌లను శ్రీనివాసరావు నిర్మింపజేశారు. బంగల్‌పేట్‌లో గల బంగల్‌చెరువు కింది భాగంలో కందకం పొడవునా గఢ్‌లు ఉన్నాయి. ఇలా నిర్మల్, చుట్టుపక్కల కలిపి మొత్తం 64 గఢ్‌లను ఫ్రెంచ్ ఇంజినీర్ల సాయంతో శ్రీనివాస్‌రావు నిర్మింపజేసినట్లు చరిత్ర చెబుతోంది. ప్రతీగఢ్‌పైన ఫిరంగులు, మందుగుండు సామగ్రి ఉండేవి. ఫిరంగులు పేలిస్తే వచ్చే వేడిని సైనికులు తట్టుకోవడానికి వాటిపక్కనే, వారు కూర్చునేందుకు నీటితొట్టిలను నిర్మించారు. ఇక ఈగఢ్‌ల మరో ప్రత్యేకత ఏంటంటే.. ఒకదాని నుంచి మరోదానికి సొరంగమార్గం ఉండడం. నిమ్మల.. ఓ మినీ ఓరుగల్లు ఓరుగల్లును కాకతీయులు పకడ్బందీగా కట్టినట్లే.. నిర్మల్‌ను నిమ్మల పాలకులు నిర్మించారు. పట్టణం చుట్టూ సహజసిద్ధంగా ఉన్న గుట్టలు, అడవులను రక్షణ కవచాలుగా మలిచారు. వాటిని ఆధారంగా చేసుకుంటూ పట్టణం చుట్టూ గొలుసుకట్టు చెరువులను తవ్వించారు. ఈ చెరువులను పట్టుకుని ఊరి చుట్టూ చైనాగోడను తలపించేలా ఇటుకలతో ప్రహరీ నిర్మించారు. గోడకు ముందు లోతైన కందకాన్ని తవ్వించారు. వీటిలో నిండుగా నీళ్లు.. అందులో మొసళ్లు ఉండేవట. చుట్టూ ఉన్న గోడ మధ్యలో అక్కడక్కడ ఎత్తై బురుజులను నిర్మించారు. వాటిపై ఆయుధ సంపత్తి ఉంచేలా ఏర్పాటు చేశారు. ఇక ఊరిమధ్యలో గల గుట్టపై ఖిల్లా(కోట)ను కట్టించారు. నాలుగు వందల ఏళ్ల క్రితం నిర్మల్‌లో కోటలు, బురుజులు, రాజభవనాలు కళక ళలాడేవి. ఇప్పుడవన్నీ శిథిలమై పోయాయి. పట్టించుకునే నాథుడు లేక పలు కోటలను, బురుజులను నేలమట్టం చేసి వాటి ఇటుకలతోనే ఇళ్లను కట్టుకున్నారు. మంటలు వేసి తెలిపేవారు.. ఈగఢ్‌లను ఎత్తై గుట్టలపై నిలువెత్తుగా నిర్మించడానికీ కారణం ఉంది. వీటిపై నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు వీక్షించవచ్చు. అలాగే పట్టణం పైకి దక్షిణం వైపు నుంచి శత్రువులు దాడికి వస్తుంటే మొదట సోన్‌గఢ్‌పై గల సైనికులు గుర్తించేరు. వెంటనే వారు అగ్గిరాజేసి మంటలు పెట్టేవారు. 10కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్యాంగఢ్‌పై గల సైనికులు గమనించేవారు. వెంటనే వారు మంటలను రాజేసేవారు. వాటిని బత్తీస్‌గఢ్‌పై గల సైనికులు గమనించి, వారు కూడా మంటలు పెట్టేవారు. ఈగఢ్పై పెట్టిన మంటలు పట్టణం మధ్యలో గల ఖిల్లాగుట్టపై ఉన్న రాజభవనానికి కనిపిస్తాయి. అక్కడ ఉండే సైన్యాధికారులు, పాలకులు మంటలను గమనించి తమకు ఏదో ఆపద రాబోతుందని అప్రమత్తమయ్యేవారు. ఇలా ఎలాంటి కమ్యూనికేషన్ లేని కాలంలో మంటలు, పొగల ద్వారా తమ శత్రురాకను నిర్మల్ పాలకులు గుర్తించేవారు. పక్కాగా పట్టణ నిర్మాణం.. నిమ్మల ప్రాంతాన్ని పాలించిన నిమ్మలనాయుడు, కుంటి వెంకట్రాయుడు, శ్రీనివాసరావు తదితరులు ఇక్కడి ప్రజలకు చక్కటి పాలన అందించారు. ఇందుకు ఊరిచుట్టూ నిర్మించిన గొలుసుకట్టు చెరువులే ఉదాహరణ. ఇవి రక్షణకేగాక పచ్చని పంటలను పండించేందుకు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉపయోగపడేవి. ఇక నిమ్మల ఊరిని సైతం పక్కాగా నిర్మించారు. ఊరి చుట్టూ ప్రహరీతోపాటు పొలిమేరల్లో పట్టణంలోకి వచ్చే రోడ్డుకు ఇరువైపులా బురుజులు నిర్మించారు. ఈ బురుజులకు బలమైన పొడవాటి గొలుసులు ఉండేవి. రాత్రిపూట గొలుసులతో మార్గాన్ని మూసి వేసేవారు. కొన్నేళ్ల క్రితం వరకూ పట్టణంలో చైన్‌గేట్ వద్ద ఈ బురుజులు, గొలుసులు ఉండేవి. వీటి కారణంగా దీనికి చైన్‌గేట్ అనే పేరొచ్చింది. బంగల్పేట్ శివారులోనూ ఇలా రోడ్డుకిరువైపులా బురుజులు ఇప్పటికీ ఉన్నాయి. బురుజులు, గోడచుట్టూ ఉన్న కందకంలో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ప్రజల అవసరాలను తీర్చేది. కాలక్రమంలో ఈ కందకాన్ని స్వర్ణప్రాజెక్టు జౌళినాలాగా మార్చారు. ప్రస్తుతం ఇది ఓ పెద్ద మురికికాలువగా మారిపోయింది. ఇదంతా గతవైభవమేనా.. గోల్కొండ, వరంగల్ వంటి చారిత్రక కోటలకు ఏమాత్రం తీసిపోని విధంగా నిర్మల్ కోటలను నాటి పాలకులు నిర్మించారు. కానీ.. నేటి పాలకుల పట్టింపులేనితనంతో ఇవి వెలుగులోకి రాలేదు. దీంతో ఇప్పటికే చాలా కోటలు, బురుజులు ఆక్రమణలకు గురయ్యాయి. చాలావరకు దెబ్బతింటున్నాయి. పర్యాటకప్రాంతంగా శ్యాంగఢ్‌ను అభివృద్ధి చేస్తామని పర్యాటకశాఖ ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇక్కడ నిర్మించిన హరిత హోటల్ ప్రారంభానికి ముందే శిథిలావస్థలకు చేరింది. శ్యాంగఢ్కు ఓవైపు మాత్రమే డంగుతో పూతలు పూసి వదిలేశారు. లోపల కోటగోడలు కూలుతున్నాయి. అందులో ఏర్పాటు చేసిన కుర్చీలు కూడా విరిగిపోయాయి. ఇక బత్తీస్గఢ్ చుట్టూ గుట్టలపై క్వారీలు ఉన్నాయి. ఇక్కడ నిత్యం చేపట్టే పేళ్లుళ్ల ధాటికి గఢ్ గోడలు బీటలు వారుతున్నాయి. రోడ్డు వెడల్పులో చైన్‌గేట్‌ను ఓవైపు నామరూపాల్లేకుండా కూల్చేశారు. ఇప్పుడక్కడ కందకంతో సహా ఆక్రమణలకు గురవుతోంది. ఇప్పటికైనా దృష్టిపెట్టాలి.. ఒకప్పటి నిమ్మలరాజ్యం ఇప్పుడు నిర్మల్జిల్లాగా అవతరించబోతోంది. ఎప్పుడూ రాజకీయకేంద్రంగానే పేరున్నా.. అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉంది. పర్యాటక అభివృద్ధి పుష్కలమైన అవకాశాలున్నాయి. కానీ పట్టించుకునే నాథుడు లేడు. నిన్నగాక మొన్న వినాయకుల నిమజ్జనం కోసం బంగల్‌చెరువు వద్ద గల సీమోల్లంఘన ద్వారాలను కూల్చేశారు. దీంతో ఉన్నవాటిని కాపాడడం తెలియదు కానీ.. చరిత్రను కనుమరుగు చేయడం మన పాలకులకు బాగా తెలుసని నిర్మల్‌వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా అభివృద్ధి చేయకున్న ఫర్వాలేదు కానీ.. మన చరిత్రకు గుర్తుగా మిగిలిన కట్టడాలను మాత్రం కాపాడంటూ మొరపెట్టుకుంటున్నారు. -
తాజ్ అందం చూడాలంటే వెయ్యి కొట్టాల్సిందే
ఆగ్రా: భారత దేశంలోని ప్రముఖ పర్యటన ప్రాంతం ఆగ్రా మరింత కాస్ట్లీ పర్యాటక కేంద్రంగా మారనుంది. అక్కడి ప్రాంతాలను సందర్శించాలనుకునేవారు ఇక మరింత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ రుసుములు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు తాజ్ మహల్ చూడాలనుకునేవారు విదేశీయులైతే రూ.750 చెల్లిస్తుండగా ముందు రోజుల్లో రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. దేశీయులు అయితే, రూ.40 చెల్లించాలి. అంతకుముందు ఇది రూ.20 ఉండేది. గురువారం కొత్తగా పెంచిన పర్యాటక ధరలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ప్రకటించింది. దీంతోపాటు సికంద్రా, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ వంటి ప్రాంతాలను చూడాలనుకునే వారు కూడా గతంలో చెల్లించినవాటికంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. -
మహానగరితో చారిత్రక బంధం అందాల ఇస్తాంబుల్..
సిటీబ్యూరో: చారిత్రక మహానగరం ఎన్నో అద్భుత కట్టడాలకు పెట్టింది పేరు. ఎంతో ఘన చరిత్ర, సంస్కృతి, వారసత్వం, ఇస్లామిక్ వాస్తురీతులు దీని సొంతం. సాఫ్ట్వేర్, వ్యాపార, వాణిజ్యానికి పుట్టినిల్లు. ఓపక్క తన వారసత్వాన్ని కాపాడుకుంటూనే విశ్వనగరి వైపు అడుగులు వేస్తోంది. బల్దియా ఎన్నికల వేళ.. అందరి దృష్టి చారిత్రక కట్టడాల పరిరక్షణ మీదకు మళ్లింది. సిటీలో వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తూనే.. విశ్వనగరం వైపు అడుగులేయాలని సిటీజన్లు కోరుతున్నారు. ఈ క్రమంలో చరిత్ర, కట్టడాలు, వారసత్వం అంశాల్లో మన గ్రేటర్‌కు టర్కీ దేశంలో ఇస్తాంబుల్ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ రెండు నగరాల చారిత్రక బంధంపై ప్రత్యేక కథనం. చారిత్రక బంధం ఇదీ.. టర్కీలోని ఇస్తాంబుల్‌కు హైదరాబాద్‌కు మధ్య శతాబ్దాలుగా సాంస్కృతిక బంధాలు ఉండడం విశేషం. హైదరాబాద్ నగర నిర్మాతలు, గోల్కొండను ఏలిన కుతుబ్‌షాహీల పూర్వీకులు టర్కీకి చెందినవారే. నిజాం ప్రభువు మేనకోడళ్లు నీలోఫర్, దుర్రేషహర్లు కూడా టర్కీకి చెందినవారే. అంటే వందల ఏళ్లుగా ఇస్తాంబుల్‌కు, మన హైదరాబాద్‌తో వైవాహిక బంధాలు కూడా ఉన్నాయి. ఇస్తాంబుల్ తరహా అభివృద్ధి అంటే...? ఇస్తాంబుల్‌లో ప్రధానంగా రహదారుల విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టినపుడు అక్కడి చారిత్రక, వారసత్వ కట్టడాలకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇదే తరహాలో నగరంలో చేపడుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు, మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం సమయంలో చారిత్రక కట్టడాలను పరిరక్షించాలని సిటీజన్లు కోరుతున్నారు. ఇస్తాంబుల్‌లో అవలంబించిన విధానాలతో ఆయా చారిత్రక ప్రదేశాల సందర్శనకు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇక చారిత్రక మార్కెట్లలో ప్రత్యేకంగా లభించే దుస్తులు, ఆభరణాలను కొనుగోలు చేసే పర్యాటకుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. చారిత్రక కట్టడాలలో హోటళ్లు,రెస్టారెంట్లు ఏర్పాటుచేయడంతో వాణిజ్య కార్యకలాపాలు సైతం పెరిగాయి. అంటే ఓ నగరం కీర్తి విదేశీ పర్యాటకుల రాకతో విశ్వవ్యాప్తమవుతుండడంతో చారిత్రక ప్రాధాన్యత గల కట్టడాలను అక్కడి ప్రభుత్వం కాపాడుతోంది. ఇక్కడి ప్రముఖ కట్టడాలివే.. హగియా సోఫియా మసీదు, బాసిలికా సిస్టర్న్ కళాత్మక కట్టడం, తోప్కాపీ ప్యాలెస్, బ్లూమాస్క్, ఇస్తాంబుల్ ఆర్కియాలజీ మ్యూజియం, టర్కిష్ అండ్ ఇస్లామిక్ ఆర్ట్స్ మ్యూజియం, సులేమానీ మాస్క్, కోరా చర్చ్, గలాటా టవర్ విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇదీ మన హైదరాబాద్ షాన్.. ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి ఇస్తాంబుల్‌తో అచ్చు గుద్దినట్టు పోలికుండే నగరం హైదరాబాద్. మన గ్రేటర్ నగరం 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. జనాభా కోటికి చేరువవుతోంది. సమతుల వాతావరణంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. గోల్కొండ కోట, చార్మినార్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, మక్కామసీదు, కుతుబ్‌షాహీ సమాధులు, ఫలక్‌నుమా ప్యాలెస్, అసెంబ్లీ భవనం, మొజంజాహీ మార్కెట్, హుస్సేన్‌సాగర్ ఇలా 200కు పైగా చారిత్రక కట్టడాలకు మన నగరం నెలవు. అయితే ఇటీవల రహదారుల విస్తరణ,మెట్రో ప్రాజెక్టు,మాస్టర్‌ప్లాన్ పనుల కారణంగా పలు చారిత్రక కట్టడాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. పాతనగరంలో ఇప్పటికే ప్రతిపాదించిన మెట్రో అలైన్మెంట్ కారణంగా సుమారు 69 వరకు ఉన్న అషుర్ఖానాలు, మసీదులు, చిల్లాలకు నష్టం వాటిల్లుతుందన్న అనుమానాలున్నాయి. ఇక డ్రైనేజి నెట్వర్క్ విస్తరణ, రహదారుల విస్తరణ జరిగిన ప్రతిసారీ చారిత్రక కట్టడాలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఈనేపథ్యంలో నగర మాస్టర్‌ప్లాన్‌లో పాత నగరంలోని చారిత్రక కట్టడాల మనుగడకు నష్టం వాటిల్లకుండా ప్రణాళికలు సిద్ధంచేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాగానికి దిశానిర్దేశం చేస్తోంది. మన నగరంలోనూ ఇస్తాంబుల్ తరహాలో మూసీకి ఆవల, ఈవల రెండు ప్రాంతాల్లోనూ భిన్నమైన సంస్కృతి ఉంది. ఇక హైటెక్‌సిటీ, శివార్ల విషయానికి వస్తే ఆకాశమే హద్దుగా సేవా, వ్యాపార, వాణిజ్య, రియల్టీ రంగాలు విస్తరిస్తున్నాయి. చారిత్రక కట్టడాల నగరి.. ఇస్తాంబుల్ నగరంలో 17 రాజసౌధాలు, 64 మసీదులు, 49 చర్చిలను చారిత్రక వారసత్వ కట్టడాలుగా గుర్తించారు. వీటి పరిరక్షణకు మాస్టర్‌ప్లాన్‌లో అధిక ప్రాధాన్యమిచ్చారు. టర్కీలో అతిపురాతన చారిత్రక మ్యూజియం ఈ నగరంలోనే ఉంది. టర్కిష్, యురోపియన్, మధ్యప్రాచ్య వాస్తురీతులు ఇక్కడి కట్టడాలలో కనిస్తాయి. ఎన్నో అద్భుత కళాఖండాలకు ఈ నగరం ముఖ్య కేంద్రం. ఆర్ట్ మ్యూజియాలు, ఇస్తాంబుల్ మోడ్రన్, పేరా మ్యూజియం, సకిబ్ సబానిక్ మ్యూజియం, సంత్రాల్ స్టాంబుల్ కేంద్రాల్లో తీరైన శిల్ప సంపద కొలువుదీరింది. ఈ నగరం పాతకొత్తల సంగమంగా కనిపిస్తుంది. ఈ నగరం మధ్య నుంచి ప్రవహించే బోస్పరస్ నది ఒడ్డున రెండు భిన్న సంస్కృతులు అభివృద్ధి చెందాయి. -
చరిత్ర సమాధి
ఆనవాళ్లు కోల్పోయిన నాటి అపూర్వ ఆలయం శిథిలస్థితిలో చెన్నమల్లికార్జున దేవస్థానం కాలగర్భంలో కలిసిపోయిన కోటగోడ చారిత్రక కట్టడాల రక్షణకు చర్యలు శూన్యం దాచేపల్లి : జీవనది నాగులేటి ఒడ్డున 12వ శతాబ్దంలో నిర్మితమైన చెన్నమల్లికార్జుని ఆలయం ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లింది. సువిశాలమైన కోట గోడ .. ఆలయ గోడలపై సుందరంగా చెక్కిన దేవతా విగ్రహాలు.. నాటి శిల్ప చాతుర్యానికి సాక్షీభూతంగా నిలిచాయి. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిరాదరణతో చారిత్రక కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. పల్నాటి తొలి మహిళా మంత్రి నాయకురాలు నాగమ్మ ఆధ్యాత్మికతను దశదిశల వ్యాపింప చేసేందుకు దాచేపల్లి మండలం జిట్ట గామాలపాడులో చెన్నమల్లికార్జున స్వామి ఆలయాన్ని అపూర్వంగా నిర్మించినట్లు పల్నాటి చరిత్ర చెబుతోంది. పల్నాటి బ్రహ్మనాయుడు మాచర్లలో చెన్నకేశవస్వామి ఆలయంను నిర్మిస్తే నాగమ్మ గలగలపారే జీవనది నాగులేరు ఒడ్డున.. ప్రశాంతమైన వాతవారణంలో ఈ ఆలయాన్ని కట్టించింది. 12వ శ తాబ్దంలో పూర్వీకుల ప్రభువులైన కల్యాణ చక్రవర్తుల వాస్తు ప్రకారం నాగులేరును అనుకుని 32 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పుతో ఆలయ నిర్మాణం పూర్తిచేశారు. ఆకట్టుకునే నిర్మాణ శైలి.. దేవాలయానికి నాలుగువైపుల పార్వతి, భైరవుడు, గణపతి, దుర్గాదేవి ఆలయాలను కట్టించారు. ద్వారబంధాలపై దిండి మొండి విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఆలయ పై భాగంలో గజలక్ష్మీ విగ్రహాలను రాళ్లపై చెక్కించారు. గర్భగుడి ముందు భాగంలోచెన్నమల్లికార్జున స్వామి ఆలయంగా శిలాశాసనం చెక్కించారు. నైరుతి దిక్కున ఉమామహేశ్వరుల విగ్రహం, దక్షిణం, తూర్పు దిక్కులన ఆలయంలో ప్రవేశించేందుకు మెట్లమార్గం, ఈశాన్యం వైపున కోనేరు నిర్మించగా ఆగ్నేయం వైపు సప్తమాతల విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఆలయం చుట్టూ మూడు అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల ఎత్తులో నిర్మించిన కోటగోడను నిర్మించారు. చెన్నమల్లికార్జున స్వామి ఆలయం నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లపై క్షీరసాగర మధనం, గజలక్ష్మీలతో పాటు వివిధ రకాలు శిల్పాలను చెక్కారు. ఆనాడు ఈ దేవాలయం వద్దకు వచ్చిన నలగామరాజుకు నాయకురాలు నాగమ్మ విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేసిందని, ఆమె పనితీరుకు మెచ్చిన నలగామరాజు మంత్రి పదవి ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఆక్రమణ చెరలో ఆలయ భూములు.. చెన్నమల్లికార్జుని ఆలయానికి 22 ఎకరాల వ్యవసాయ భూమి దేవుడిమాన్యంగా ఉండగా ఇప్పుడు కేవలం 10.40 ఎకరాలు మాత్రమే ఉంది. మిగినదంతా ఆక్రమణకు గురైంది. స్థానిక ప్రజాప్రతినిధులైన మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి. కృష్ణారెడ్డిలు ఆలయ రక్షణ కోసం తమ వంతు ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వాలు వీటికి తగిన రక్షణ కల్పించకపోతే భావితరాలకు చరిత్ర అనవాళ్లు కూడా కన్పించకుండా పోయే ప్రమాదం ఉంది. ఆదరణ కోల్పోతున్న ఆలయం... నాయకురాలు నాగమ్మ నిర్మించిన ఈ దేవాలయం ఆదరణ కోల్పోయి శిథిలావస్థకు చేరింది. పురావస్తు శాఖ 2011లో దీనిని రక్షణ కట్టడంగా గుర్తించినప్పటికీ అభివృద్ధి కోసం నిధులను కేటాయించలేదు. ఎటువంటి రక్షణ లేకపోవటంతో దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఆలయం గోడల్లో గుప్తనిధులు ఉన్నాయనే అనుమానంతో గోడలను పేలుడు పదార్ధాలతో పేల్చివేశారు. గర్భగుడిలో కూడా తవ్వాలు జరిపిన ఆనవాళ్లున్నాయి. కోటగోడ కాలగర్భంలో కలిసిపోయింది. ఆలయ ప్రాంగణం పిచ్చిమొక్కలతో చిట్టడవిని తలపిస్తోంది. -
‘ఆతిథ్యం’లో వైవిధ్యం.. డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్
దేశంలో ప్రతి ఏటా సుస్థిరమైన అభివృద్ధి బాటలో పయనిస్తున్న రంగం.. టూరిజం అండ్ హాస్పిటాలిటీ. భారత్‌లోని అద్భుతమైన చారిత్రక కట్టడాలు, ఆహ్లాదకరమైన, సుందరమైన ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీంతో దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇదే సమయంలో కెరీర్ పరంగానూ యువతకు చక్కటి మార్గం చూపుతోంది. పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడానికి నిపుణుల అవసరం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో హాస్పిటాలిటీ రంగంలో నిష్ణాతులను తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటై నాణ్యమైన విద్యను అందించడంలో మంచి గుర్తింపు పొందుతున్న డాక్టర్ వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్పై ఇన్స్టిట్యూట్ వాచ్.. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రత్యేక చొరవతో 2004లో ప్రభుత్వ సంస్థగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఏర్పాటైంది. అనతి కాలంలోనే ఆతిథ్య రంగంలో నిపుణులను తీర్చిదిద్దడంలో దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్.. ఆతిథ్య రంగంలోని ఉత్తమ ఇన్స్టిట్యూట్లకు అందించే ‘ఉయ్ స్కూల్ ఇన్నోవేషన్ అవార్డ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ అవార్డులను కూడా సొంతం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఈ ఇన్స్టిట్యూట్.. డిప్లొమా నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు హాస్పిటాలిటీ, టూరిజం, అనుబంధ విభాగాల్లో పలు కోర్సులు అందిస్తూ అన్ని స్థాయిల విద్యార్థులకు కెరీర్ అవకాశాలు కల్పిస్తోంది. అంతేకాకుండా హోటల్ మేనేజ్మెంట్లో.. టూరిజం, హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్ మూడు విభాగాలను అనుసంధానం చేస్తూ కోర్సులను అందిస్తున్న సంస్థగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఫలితంగా ఒక కోర్సులో చేరిన విద్యార్థికి మొత్తం మూడు రంగాల అవసరాలపై శిక్షణ లభిస్తుంది. కోర్సులివే: ప్రస్తుతం డాక్టర్ వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఆరు నెలల వ్యవధి గల స్వల్ప కాలిక కోర్సుల నుంచి ఎంబీఏ వరకు పలు కోర్సులు అందిస్తోంది. అవి..- ఎంబీఏ(హాస్పిటాలిటీ); ఎంబీఏ(టూరిజం అండ్ హాస్పిటాలిటీ); పీజీడీఎం(టూరిజం); పీజీ డిప్లొమా ఇన్ హెరిటేజ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్; బీబీఏ(టూరిజం అండ్ హాస్పిటాలిటీ); బీఎస్సీ(హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్); వీటిలో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత అర్హత. ఎంబీఏ, ఇతర పీజీ కోర్సులకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత అర్హత. పీజీడీఎం(టూరిజం); ఎంబీఏ(టూరిజం అండ్ హాస్పిటాలిటీ) కోర్సులకు క్యాట్/ మ్యాట్/ సీమ్యాట్/ ఐసెట్ వంటి మేనేజ్మెంట్ ఎంట్రెన్స్ పరీక్షల్లోనూ ర్యాంకులు తప్పనిసరి. బీబీఏ, బీఎస్సీ కోర్సుల్లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈలో ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. స్వయం ఉపాధికి.. ఊతమిచ్చే షార్ట్‌టర్మ్ కోర్సులు: డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్ పూర్తి స్థాయి ప్రొఫెషనల్ కోర్సులతోపాటు హోటల్, హాస్పిటాలిటీ అనుబంధ విభాగాల్లో స్వయం ఉపాధికి ఊతమిచ్చేలా మూడు నెలలు, ఆరు నెలల వ్యవధిలో పలు షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తోంది. వీటిలో రూరల్ టూరిజం; ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అండ్ కన్సల్టెన్సీ, ఆర్ట్ అప్రిసియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఆయుర్వేద పంచకర్మ థెరపీ కోర్సులు ప్రధానమైనవి. ఇప్పటికే హోటల్స్, రెస్టారెంట్లలో పనిచేస్తున్న వారికి మరింత వృత్తి నైపుణ్యాలు అందించే విధంగా కుకింగ్ (ఎనిమిది వారాలు); రెస్టారెంట్ సర్వీసెస్ (ఆరు వారాలు)లో ఉచిత శిక్షణ కూడా అందిస్తోంది. వెబ్సైట్: www.nithm.ac.in లెర్న్ బై డూయింగ్ ‘ లేబొరేటరీ: హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలదే పెద్దపీట. అందుకే ఇన్స్టిట్యూట్లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యమిచ్చేలా కరిక్యులం రూపకల్పన జరిగింది. ముఖ్యంగా లెర్న్ బై డూయింగ్ విధానంతో ప్రతి విద్యార్థికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కలిగేలా చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలో ఆహార పదార్థాల తయారీలో ఎంతో ముఖ్యమైన ఎలక్ట్రిక్ ఒవెన్స్, మైక్రోవేవ్ ఒవెన్స్; ప్లానెటరీ కేక్ మిక్సర్స్; మల్టీ పర్పస్ గ్యాస్ కుకర్స్ తదితర అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు. వీటితోపాటు ఆరు వేల పుస్తకాలు; జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న దాదాపు వంద జర్నల్స్, మేగజైన్లతో కూడిన లైబ్రరీ సదుపాయం విద్యార్థులు ఈ రంగంలో థియరీ నాలెడ్జ్‌ను మరింత పెంచుకునేందుకు, తాజా పరిస్థితులపై అవగాహన పొందేందుకు దోహదం చేస్తోంది. ఇన్స్టిట్యూట్లోని డిజిటల్ లైబ్రరీ ద్వారా విద్యార్థులకు అపారమైన నైపుణ్యం సొంతమవుతోంది. వేల సంఖ్యలో ఈ-లెర్నింగ్ రిసోర్సెస్, వర్చువల్ క్లాస్ రూంల సదుపాయం అందుబాటులో ఉంది. క్షేత్ర నైపుణ్యాల దిశగా ఒప్పందాలు: విద్యార్థుల్లో క్షేత్ర స్థాయి నైపుణ్యాలు అందించే దిశగా ఇండియన్ అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్, యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్, జేఎన్టీయూ-హైదరాబాద్ వంటి సంస్థలతో డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్ ఒప్పందాలు చేసుకుంది. ప్లేస్మెంట్ ష్యూర్: లాంగ్ టర్మ, షార్ట్ టర్మ్.. ఏ కోర్సు ఉత్తీర్ణులకైనా ప్లేస్మెంట్ కల్పించే విధంగా ఈ రంగంలోని పలు సంస్థలతో ఇన్స్టిట్యూట్ ఒప్పందం చేసుకుంది. ప్రతి ఏటా బీబీఏ, ఎంబీఏలో మూడో సెమిస్టర్ పూర్తయిన వెంటనే క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఏర్పాట్లు జరుగుతాయి. నిథమ్ విద్యార్థులు ఏపీటీడీసీ, జీఎంఆర్, రాడిసన్, గ్రీన్‌పార్క్, థామస్‌కుక్, కాక్స్ అండ్ కింగ్స్, మేక్ మై ట్రిప్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు ప్రారంభంలో నెలకు రూ.25 వేలు, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులు రూ.30 వేల వేతనం పొందుతున్నారు. ‘‘డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్... కోర్సులు, శిక్షణ విషయంలో నిరంతరం నిత్య నూతనంగా వ్యవహరిస్తోంది. ఈ రంగంలోని తాజా అవసరాలకు అనుగుణంగా శిక్షణలో మార్పులూచేర్పులూ చేస్తూ విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పిస్తోంది. ఫలితంగా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దోహా ఎయిర్పోర్ట్, ఖతార్ ఎయిర్వేస్ తదితర సంస్థలు కూడా ఈ ఇన్స్టిట్యూట్ విద్యార్థులను రిక్రూట్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవలి కాలంలో విద్యార్థులకు కూడా హాస్పిటాలిటీ కోర్సుల పట్ల అవగాహన పెరిగింది. వారు డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్‌ను తమ తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారు’’ - ప్రొఫెసర్ ఎస్.సుధాకుమార్ ప్రిన్సిపాల్, స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ, డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్