తాజ్ అందం చూడాలంటే వెయ్యి కొట్టాల్సిందే
ఆగ్రా: భారత దేశంలోని ప్రముఖ పర్యటన ప్రాంతం ఆగ్రా మరింత కాస్ట్లీ పర్యాటక కేంద్రంగా మారనుంది. అక్కడి ప్రాంతాలను సందర్శించాలనుకునేవారు ఇక మరింత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ రుసుములు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు తాజ్ మహల్ చూడాలనుకునేవారు విదేశీయులైతే రూ.750 చెల్లిస్తుండగా ముందు రోజుల్లో రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. దేశీయులు అయితే, రూ.40 చెల్లించాలి.
అంతకుముందు ఇది రూ.20 ఉండేది. గురువారం కొత్తగా పెంచిన పర్యాటక ధరలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ప్రకటించింది. దీంతోపాటు సికంద్రా, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ వంటి ప్రాంతాలను చూడాలనుకునే వారు కూడా గతంలో చెల్లించినవాటికంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.