చరిత్ర సమాధి
ఆనవాళ్లు కోల్పోయిన నాటి అపూర్వ ఆలయం
శిథిలస్థితిలో చెన్నమల్లికార్జున దేవస్థానం
కాలగర్భంలో కలిసిపోయిన కోటగోడ
చారిత్రక కట్టడాల రక్షణకు చర్యలు శూన్యం
దాచేపల్లి : జీవనది నాగులేటి ఒడ్డున 12వ శతాబ్దంలో నిర్మితమైన చెన్నమల్లికార్జుని ఆలయం ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లింది. సువిశాలమైన కోట గోడ .. ఆలయ గోడలపై సుందరంగా చెక్కిన దేవతా విగ్రహాలు.. నాటి శిల్ప చాతుర్యానికి సాక్షీభూతంగా నిలిచాయి. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిరాదరణతో చారిత్రక కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి.
పల్నాటి తొలి మహిళా మంత్రి నాయకురాలు నాగమ్మ ఆధ్యాత్మికతను దశదిశల వ్యాపింప చేసేందుకు దాచేపల్లి మండలం జిట్ట గామాలపాడులో చెన్నమల్లికార్జున స్వామి ఆలయాన్ని అపూర్వంగా నిర్మించినట్లు పల్నాటి చరిత్ర చెబుతోంది. పల్నాటి బ్రహ్మనాయుడు మాచర్లలో చెన్నకేశవస్వామి ఆలయంను నిర్మిస్తే నాగమ్మ గలగలపారే జీవనది నాగులేరు ఒడ్డున.. ప్రశాంతమైన వాతవారణంలో ఈ ఆలయాన్ని కట్టించింది. 12వ శ తాబ్దంలో పూర్వీకుల ప్రభువులైన కల్యాణ చక్రవర్తుల వాస్తు ప్రకారం నాగులేరును అనుకుని 32 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పుతో ఆలయ నిర్మాణం పూర్తిచేశారు.
ఆకట్టుకునే నిర్మాణ శైలి..
దేవాలయానికి నాలుగువైపుల పార్వతి, భైరవుడు, గణపతి, దుర్గాదేవి ఆలయాలను కట్టించారు. ద్వారబంధాలపై దిండి మొండి విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఆలయ పై భాగంలో గజలక్ష్మీ విగ్రహాలను రాళ్లపై చెక్కించారు. గర్భగుడి ముందు భాగంలోచెన్నమల్లికార్జున స్వామి ఆలయంగా శిలాశాసనం చెక్కించారు. నైరుతి దిక్కున ఉమామహేశ్వరుల విగ్రహం, దక్షిణం, తూర్పు దిక్కులన ఆలయంలో ప్రవేశించేందుకు మెట్లమార్గం, ఈశాన్యం వైపున కోనేరు నిర్మించగా ఆగ్నేయం వైపు సప్తమాతల విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఆలయం చుట్టూ మూడు అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల ఎత్తులో నిర్మించిన కోటగోడను నిర్మించారు. చెన్నమల్లికార్జున స్వామి ఆలయం నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లపై క్షీరసాగర మధనం, గజలక్ష్మీలతో పాటు వివిధ రకాలు శిల్పాలను చెక్కారు. ఆనాడు ఈ దేవాలయం వద్దకు వచ్చిన నలగామరాజుకు నాయకురాలు నాగమ్మ విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేసిందని, ఆమె పనితీరుకు మెచ్చిన నలగామరాజు మంత్రి పదవి ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది.
ఆక్రమణ చెరలో ఆలయ భూములు..
చెన్నమల్లికార్జుని ఆలయానికి 22 ఎకరాల వ్యవసాయ భూమి దేవుడిమాన్యంగా ఉండగా ఇప్పుడు కేవలం 10.40 ఎకరాలు మాత్రమే ఉంది. మిగినదంతా ఆక్రమణకు గురైంది. స్థానిక ప్రజాప్రతినిధులైన మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి. కృష్ణారెడ్డిలు ఆలయ రక్షణ కోసం తమ వంతు ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వాలు వీటికి తగిన రక్షణ కల్పించకపోతే భావితరాలకు చరిత్ర అనవాళ్లు కూడా కన్పించకుండా పోయే ప్రమాదం ఉంది.
ఆదరణ కోల్పోతున్న ఆలయం...
నాయకురాలు నాగమ్మ నిర్మించిన ఈ దేవాలయం ఆదరణ కోల్పోయి శిథిలావస్థకు చేరింది. పురావస్తు శాఖ 2011లో దీనిని రక్షణ కట్టడంగా గుర్తించినప్పటికీ అభివృద్ధి కోసం నిధులను కేటాయించలేదు. ఎటువంటి రక్షణ లేకపోవటంతో దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఆలయం గోడల్లో గుప్తనిధులు ఉన్నాయనే అనుమానంతో గోడలను పేలుడు పదార్ధాలతో పేల్చివేశారు. గర్భగుడిలో కూడా తవ్వాలు జరిపిన ఆనవాళ్లున్నాయి. కోటగోడ కాలగర్భంలో కలిసిపోయింది. ఆలయ ప్రాంగణం పిచ్చిమొక్కలతో చిట్టడవిని తలపిస్తోంది.