చారిత్రక కట్టడాలకు పూర్వవైభవం
► పురావస్తు పాలసీ తేనున్న రాష్ట్ర ప్రభుత్వం
► దేశవిదేశీ నిపుణులతో శాస్త్రీయ అధ్యయనం
► పయోగాత్మకంగా గణపురం దేవాలయం ఎంపిక
► రంగంలోకి వరంగల్ ‘నిట్’ నిపుణులు
► త్వరలో విధాన రూపకల్పన
సాక్షి, హైదరాబాద్: కాకతీయుల కాలం నాటి నిర్మాణ కౌశలానికి నిదర్శనంగా నిలిచిన వరంగల్‌లోని వేయి స్తంభాల దేవాలయం మండపాన్ని పునరుద్ధరణ పేరుతో కొన్నేళ్ల క్రితం పురావస్తుశాఖ అధికారులు విప్పదీశారు. కానీ దాన్ని తిరిగి పాత పద్ధతిలో నిర్మించేందుకు నిపుణులకు చుక్కలు కనిపించాయి. ఏళ్లపాటు ఆ రాళ్లు మట్టికొట్టుకుపోయి మన పనితీరును ఎండగట్టాయి. ఇలాంటి దుస్థితి మళ్లీ రాకుండా ఉండాలంటే ‘చారిత్రక కట్టడాల విధానం’ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని తయారీకి రంగం సిద్ధం చేసింది. ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే స్థాయి చారిత్రక కట్టడాలు ఉండి కూడా ప్రపంచ పర్యాటక పటంలో తెలంగాణ గుర్తింపునకు నోచుకోని నేపథ్యంలో ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా చారిత్రక కట్టడాలకు ప్రాచుర్యం కల్పించనుంది. ముఖ్యంగా కాకతీయుల కళావైభవానికి, అలనాటి ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి నిదర్శనంగా నిలిచే కట్టడాలకు పూర్వవైభవం తేవాలని భావిస్తోంది.
ఏం చేస్తారు...
రాష్ట్రంలో ప్రస్తుతం పురాతన చారిత్రక కట్టడాలెన్నో శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని తాత్కాలిక మరమ్మతులతోనే సరిపుచ్చుతున్నారు. కానీ అవి బలహీనపడుతూ ఎప్పుడు కూలిపోతాయో తెలియని దుస్థితికి చేరుకుంటున్నాయి. వాటిని భవిష్యత్తు తరాలకు అందించాలంటే పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే... వాటిలోని ఒక్క రాయిని కదలించాలన్నా శాస్త్రీయ అధ్యయనం అవసరం. ఈ కట్టడాల పునరుద్ధరణకు అనుసరించాల్సిన పద్ధతులు, శాస్త్రీయ అధ్యయనం, నిధుల కేటాయింపు... లాంటి అంశాలతో ఓ విధానం రూపొందిస్తారు. ఇందుకోసం దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో నిపుణులను సలహాదారులుగా నియమిస్తారు. ఇప్పటికే అలాంటి కొందరు నిపుణులతో పురావస్తుశాఖ అధికారులు సంప్రదిస్తున్నారు.
ఆయా కట్టడాల పటుత్వం ఎంతో ముందుగా తేలుస్తారు. దాని పునరుద్ధరణ చేపట్టాలంటే అనుసరించాల్సిన అంశాలేమిటో శాస్త్రీయ అధ్యయనంతో తేలుస్తారు. దానికి వాడిన రాయి గుణం ఏమిటి, ఎలాంటి పద్ధతులతో అది పదిలంగా ఉంటుంది, అది ఏ రకమైన రాయి, ఇసుక, నేల స్వభావం ఏమిటి, అప్పట్లో ఏ ఇంజనీరింగ్ విధానాన్ని అనుసరించారు. రాళ్ల అనుసంధానానికి వాడిన పదార్థం ఏమిటి, డంగుసున్నం మిశ్రమంలో వాడిన పదార్థాలేమిటి... అన్ని విషయాలను తేల్చి, దాని పునరుద్ధరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. దాని ఆధారంగానే శాస్త్రీయ పద్ధతుల్లో పనులు చేపట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన.
గణపురం దేవాలయం ఎంపిక
వరంగల్ జిల్లాలోని గణపురం దేవాల యాన్ని ప్రయోగాత్మకంగా తొలి ప్రణాళికకు ఎంపిక చేశారు. దీనికి సంబంధించి 3 రోజుల క్రితం పురావస్తుశాఖ సంచాలకులు విశాలాక్షి వరంగల్‌లోని ‘నిట్’ నిపుణులతో కలసి ఆలయాన్ని సందర్శించారు. ఇప్పటికే తొలి దశ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ఆలయం పునాదుల్లోకి బోరు రంధ్రాల ద్వారా డంగు సు న్నం మిశ్రమాన్ని పంపించారు. అది నిర్ధారిత పద్ధతిలో గట్టిపడిందోలేదో నిపుణులు పరిశీలిం చాల్సి ఉంది. వారి పూర్తి అధ్యయనం తర్వాత ఓ ప్రణాళికను సిద్ధం చేస్తారు. దాని ఆధారంగా తదుపరి పనులు మొదలుపెడతారు.