మహానగరితో చారిత్రక బంధం అందాల ఇస్తాంబుల్..
సిటీబ్యూరో: చారిత్రక మహానగరం ఎన్నో అద్భుత కట్టడాలకు పెట్టింది పేరు. ఎంతో ఘన చరిత్ర, సంస్కృతి, వారసత్వం, ఇస్లామిక్ వాస్తురీతులు దీని సొంతం. సాఫ్ట్‌వేర్, వ్యాపార, వాణిజ్యానికి పుట్టినిల్లు. ఓపక్క తన వారసత్వాన్ని కాపాడుకుంటూనే విశ్వనగరి వైపు అడుగులు వేస్తోంది. బల్దియా ఎన్నికల వేళ.. అందరి దృష్టి చారిత్రక కట్టడాల పరిరక్షణ మీదకు మళ్లింది. సిటీలో వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తూనే.. విశ్వనగరం వైపు అడుగులేయాలని సిటీజన్లు కోరుతున్నారు. ఈ క్రమంలో చరిత్ర, కట్టడాలు, వారసత్వం అంశాల్లో మన గ్రేటర్‌కు టర్కీ దేశంలో ఇస్తాంబుల్ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ రెండు నగరాల చారిత్రక బంధంపై ప్రత్యేక కథనం.
చారిత్రక బంధం ఇదీ..
టర్కీలోని ఇస్తాంబుల్‌కు హైదరాబాద్‌కు మధ్య శతాబ్దాలుగా సాంస్కృతిక బంధాలు ఉండడం విశేషం. హైదరాబాద్ నగర నిర్మాతలు, గోల్కొండను ఏలిన కుతుబ్‌షాహీల పూర్వీకులు టర్కీకి చెందినవారే. నిజాం ప్రభువు మేనకోడళ్లు నీలోఫర్, దుర్రేషహర్‌లు కూడా టర్కీకి చెందినవారే. అంటే వందల ఏళ్లుగా ఇస్తాంబుల్‌కు, మన హైదరాబాద్‌తో వైవాహిక బంధాలు కూడా ఉన్నాయి.
ఇస్తాంబుల్ తరహా అభివృద్ధి అంటే...?
ఇస్తాంబుల్‌లో ప్రధానంగా రహదారుల విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టినపుడు అక్కడి చారిత్రక, వారసత్వ కట్టడాలకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇదే తరహాలో నగరంలో చేపడుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు, మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం సమయంలో చారిత్రక కట్టడాలను పరిరక్షించాలని సిటీజన్లు కోరుతున్నారు. ఇస్తాంబుల్‌లో అవలంబించిన విధానాలతో ఆయా చారిత్రక ప్రదేశాల సందర్శనకు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇక చారిత్రక మార్కెట్‌లలో ప్రత్యేకంగా లభించే దుస్తులు, ఆభరణాలను కొనుగోలు చేసే పర్యాటకుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. చారిత్రక కట్టడాలలో హోటళ్లు,రెస్టారెంట్లు ఏర్పాటుచేయడంతో వాణిజ్య కార్యకలాపాలు సైతం పెరిగాయి. అంటే ఓ నగరం కీర్తి విదేశీ పర్యాటకుల రాకతో విశ్వవ్యాప్తమవుతుండడంతో చారిత్రక ప్రాధాన్యత గల కట్టడాలను అక్కడి ప్రభుత్వం కాపాడుతోంది.
ఇక్కడి ప్రముఖ కట్టడాలివే..
హగియా సోఫియా మసీదు, బాసిలికా సిస్టర్న్ కళాత్మక కట్టడం, తోప్‌కాపీ ప్యాలెస్, బ్లూమాస్క్, ఇస్తాంబుల్ ఆర్కియాలజీ మ్యూజియం, టర్కిష్ అండ్ ఇస్లామిక్ ఆర్ట్స్ మ్యూజియం, సులేమానీ మాస్క్, కోరా చర్చ్, గలాటా టవర్ విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
ఇదీ మన హైదరాబాద్ షాన్..
ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి ఇస్తాంబుల్‌తో అచ్చు గుద్దినట్టు పోలికుండే నగరం హైదరాబాద్. మన గ్రేటర్ నగరం 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. జనాభా కోటికి చేరువవుతోంది. సమతుల వాతావరణంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. గోల్కొండ కోట, చార్మినార్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, మక్కామసీదు, కుతుబ్‌షాహీ సమాధులు, ఫలక్‌నుమా ప్యాలెస్, అసెంబ్లీ భవనం, మొజంజాహీ మార్కెట్, హుస్సేన్‌సాగర్ ఇలా 200కు పైగా చారిత్రక కట్టడాలకు మన నగరం నెలవు. అయితే ఇటీవల రహదారుల విస్తరణ,మెట్రో ప్రాజెక్టు,మాస్టర్‌ప్లాన్ పనుల కారణంగా పలు చారిత్రక కట్టడాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. పాతనగరంలో ఇప్పటికే ప్రతిపాదించిన మెట్రో అలైన్‌మెంట్ కారణంగా సుమారు 69 వరకు ఉన్న అషుర్‌ఖానాలు, మసీదులు, చిల్లాలకు నష్టం వాటిల్లుతుందన్న అనుమానాలున్నాయి.
ఇక డ్రైనేజి నెట్‌వర్క్ విస్తరణ, రహదారుల విస్తరణ జరిగిన ప్రతిసారీ చారిత్రక కట్టడాలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఈనేపథ్యంలో నగర మాస్టర్‌ప్లాన్‌లో పాత నగరంలోని చారిత్రక కట్టడాల మనుగడకు నష్టం వాటిల్లకుండా ప్రణాళికలు సిద్ధంచేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాగానికి దిశానిర్దేశం చేస్తోంది. మన నగరంలోనూ ఇస్తాంబుల్ తరహాలో మూసీకి ఆవల, ఈవల రెండు ప్రాంతాల్లోనూ భిన్నమైన సంస్కృతి ఉంది. ఇక హైటెక్‌సిటీ, శివార్ల విషయానికి వస్తే ఆకాశమే హద్దుగా సేవా, వ్యాపార, వాణిజ్య, రియల్టీ రంగాలు విస్తరిస్తున్నాయి.
చారిత్రక కట్టడాల నగరి..
ఇస్తాంబుల్ నగరంలో 17 రాజసౌధాలు, 64 మసీదులు, 49 చర్చిలను చారిత్రక వారసత్వ కట్టడాలుగా గుర్తించారు. వీటి పరిరక్షణకు మాస్టర్‌ప్లాన్‌లో అధిక ప్రాధాన్యమిచ్చారు. టర్కీలో అతిపురాతన చారిత్రక మ్యూజియం ఈ నగరంలోనే ఉంది. టర్కిష్, యురోపియన్, మధ్యప్రాచ్య వాస్తురీతులు ఇక్కడి కట్టడాలలో కనిస్తాయి. ఎన్నో అద్భుత కళాఖండాలకు ఈ నగరం ముఖ్య కేంద్రం. ఆర్ట్ మ్యూజియాలు, ఇస్తాంబుల్ మోడ్రన్, పేరా మ్యూజియం, సకిబ్ సబానిక్ మ్యూజియం, సంత్రాల్ స్టాంబుల్ కేంద్రాల్లో తీరైన శిల్ప సంపద కొలువుదీరింది. ఈ నగరం పాతకొత్తల సంగమంగా కనిపిస్తుంది. ఈ నగరం మధ్య నుంచి ప్రవహించే బోస్పరస్ నది ఒడ్డున రెండు భిన్న సంస్కృతులు అభివృద్ధి చెందాయి.