
టర్కీ ఆర్థిక రాజధాని ఇస్తాంబుల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బెసిక్తాస్ డిస్ట్రిక్ట్‌లోని గైరెట్టెప్‌లోని 16 అంతస్తుల భవనంలో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పునర్నిర్మాణంలో ఉన్న మాస్వ్కెరేడ్ నైట్ క్లబ్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 29 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన ప్రదేశానికి చేరుకొని ఫైర్ ఇంజన్లతో మంటలను అర్పివేశారు.
బెసిక్తాస్ జిల్లాలోని గైరెట్టెప్‌లో అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 29కి చేరిందని నగర గవర్నర్ దావత్ గుల్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించింది. మంగళవారం మధ్యాహ్నం 12. 47 నిమిషాలకు భవనంలో మంటలు ప్రారంభించినట్లు పేర్కొంది. అయితే అగ్ని మాపక సిబ్బంది కొన్ని గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.
ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భవనంలోని అంతస్తుల కిటికీల నుంచి భారీగా మంటలు, దటమైన పొగ కమ్ముకున్నట్లు వీడియోల్లో కనిపిస్తుంది. అయితే భవనంలోని మొదటి, రెండో అంతస్తులలో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగినట్లు గవర్నర్ దావత్ గుల్ అన్నారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రి అలీ యోర్లికాయ తెలిపారు. క్లబ్ యజమానితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment