టర్కీ నైట్ క్లబ్బులో దుండగుడి కాల్పులు
► 39 మంది మృతి.. 70 మందికి గాయాలు
► మృతుల్లో ఇద్దరు భారతీయులు
ఇస్తాంబుల్: ఉగ్ర దాడులతో అట్టుడుకుతున్న టర్కీలో కొత్త సంవత్సరం కూడా నరమేధంతోనే మొదలైంది. ఇస్తాంబుల్‌లో ఆదివారం న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలుతున్న ప్రముఖ నైట్ క్లబ్బులో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 39 మంది మృతిచెందగా, 70 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు సహా పలువురు విదేశీయులు, టర్కీ పౌరులు ఉన్నారు. అర్ధరాత్రి దాటాక 1.15 గంటలకు శాంటాక్లాజ్ దుస్తుల్లో వచ్చినట్లు భావిస్తున్న ముష్కరుడు బాస్ఫోరస్ నది ఒడ్డున ఉన్న రీనా క్లబ్బు ప్రవేశ మార్గం వద్ద తొలుత ఓ పోలీసును, ఓ పౌరుణ్ని కాల్చి చంపాడు. తర్వాత లోపలికెళ్లి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అతని కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు.
కాల్పుల సమయంలో క్లబ్బులో 700 మంది ఉన్నారు. ప్రాణభయంతో పలువురు నదిలోకి దూకారు. దాడికి ఏ సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. ఇంతవరకు గుర్తించిన 20 మృతదేహాలను బట్టి 15 మంది విదేశీయులు, ఐదుగురు టర్కీ వాసులు చనిపోయినట్లు తేలిందని, గాయపడ్డ వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని హోం మంత్రి సోయ్‌లూ చెప్పారు. క్షతగాత్రుల్లో పలువురు అరబ్బులు ఉన్నారని అధికారులు చెప్పారు. ఓవర్‌కోటులో తుపాకీ దాచుకుని వచ్చిన దుండగుడు దురాగతం తర్వాత వేరే దుస్తులు ధరించి పారిపోయాడన్నారు. నగరంలో న్యూ ఇయర్ సందర్భంగా శాంతి భద్రతల కోసం 17 వేల మంది పోలీసులను మోహరించగా, వారిలో కొందరు శాంటాక్లాజ్ దుస్తుల్లో ఉన్నట్లు మీడియా తెలిపింది. మృతుల్లో ఇద్దరు జోర్డాన్ వాసులు, ఇద్దరు టునీషియన్లు, ఒక ఇజ్రాయెలీ మహిళ, ఒక బెల్జియన్ పౌరుడు ఉన్నారు.
దాడి అమానవీయమని రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాలు గర్హించాయి. దాడి పాశవికమన్న భారత ప్రధాని మోదీ బాధితులకు సానుభూతి తెలిపారు. ఈ దారుణంతో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ నగరాల్లో నూతన సంవత్సర వేడుకలు భయాందోళనల నడుమ సాగాయి. గత ఏడాది డిసెంబర్ 10న ఇస్తాంబుల్‌లోనే జరిగిన రెండు బాంబు పేలుళ్లలో 44 మంది చనిపోయారు. తామే ఈ పేలుళ్లకు నిషిద్ధ పీకేకే (కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ) అనుబంధ సంస్థ కుర్దిస్తాన్ ఫ్రీడమ్ ఫాల్కన్స్ ప్రకటించుకుంది. జూన్ లోనూ నగరంలోని ఎయిర్‌పోర్టులో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 47 మంది బలయ్యారు. అల్లర్లు రెచ్చగొట్టడానికే తాజా దాడి చేశారని, ఇలాంటి వాటికి బెదరబోమని దేశాధ్యక్షుడు రెసెప్ తయిప్ ఎర్డోగాన్ అన్నారు. జూలై నాటి ఆర్మీ తిరుగుబాటు నుంచి ఇంకా కోలుకోని టర్కీ ఉగ్రదాడులతో మరింత సతమతమవుతోంది. తమ సరిహద్దులోని ఐసిస్, కుర్దూ మిలిటెంట్లను తరిమి కొట్టేందుకు టర్కీ ఆర్మీ సిరియాలో దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఆ దేశాన్ని లక్ష్యం చేసుకుంటున్నారు.
రాజ్యసభ మాజీ ఎంపీ కుమారుడు బలి
న్యూఢిల్లీ: ఈ దాడిలో ఇద్దరు భారతీయులు మృతిచెందారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఒకరిని రాజ్యసభ మాజీ ఎంపీ, బాడీ బిల్డర్ అక్తర్ హసన్ రిజ్వీ కుమారుడైన అబిస్ రిజ్వీగా, మరొకరిని గుజరాత్ మహిళ ఖుషీ షాగా గుర్తించామని, టర్కీలోని భారత రాయబారి ఇస్తాంబుల్ వెళ్తున్నారని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులు టర్కీ వెళ్లేందుకు వీసా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.