న్యూయార్క్: సియాటెల్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో విషాదం చోటు చేసుకుంది. మార్గమధ్యంలోనే పైలట్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. న్యూయార్క్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసేలోపే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 204 సియాటెల్‌లో మంగళవారం రాత్రి టేకాఫ్ అయ్యింది.
కెప్టెన్‌గా 59 ఏళ్ల ఇల్సిన్ పెహ్లివాన్ విధుల్లో ఉన్నారు. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కోపైలట్ విమానాన్ని తన అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్పటికే పెహ్లివాన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
పైలట్ మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ మేరకు టర్కిష్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి యాహ్యా ఉస్తున్ ఒక ప్రకటనలో వెల్లడించారు. తమ కెప్టెన్‌ను కోల్పోయినందుకు తీవ్రంగా చింతిస్తున్నామన్నారు. కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రయాణికులు న్యూయార్క్ నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
కాగా, పెహ్లివాన్ 2007 నుంచి టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నారు. సాధారణంగా పైలట్లు ప్రతి 12 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 40 ఏళ్లు పైబడిన వారు ప్రతి ఆరు నెలలకోసారి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. పెహ్లివాన్ మార్చి 8నే అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు.
Comments
Please login to add a commentAdd a comment