Turkish Airlines flight
-
Turkish Airlines: విమానం నడుపుతూ పైలట్ మృతి
న్యూయార్క్: సియాటెల్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో విషాదం చోటు చేసుకుంది. మార్గమధ్యంలోనే పైలట్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. న్యూయార్క్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసేలోపే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 204 సియాటెల్‌లో మంగళవారం రాత్రి టేకాఫ్ అయ్యింది. కెప్టెన్‌గా 59 ఏళ్ల ఇల్సిన్ పెహ్లివాన్ విధుల్లో ఉన్నారు. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కోపైలట్ విమానాన్ని తన అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్పటికే పెహ్లివాన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పైలట్ మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ మేరకు టర్కిష్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి యాహ్యా ఉస్తున్ ఒక ప్రకటనలో వెల్లడించారు. తమ కెప్టెన్‌ను కోల్పోయినందుకు తీవ్రంగా చింతిస్తున్నామన్నారు. కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రయాణికులు న్యూయార్క్ నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, పెహ్లివాన్ 2007 నుంచి టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నారు. సాధారణంగా పైలట్లు ప్రతి 12 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 40 ఏళ్లు పైబడిన వారు ప్రతి ఆరు నెలలకోసారి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. పెహ్లివాన్ మార్చి 8నే అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. -
బోయింగ్ 777కు బాంబు బెదిరింపు
టర్కీ: టర్కీకి చెందిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని ముందుగా నిర్ణయించిన ప్రాంతానికి కాకుండా మరో చోటకు తరలించి దించివేశారు. టర్కీకి చెందిన టర్కీష్ ఎయిర్ లైన్స్ విమానం బోయింగ్ 777 హ్యూస్టన్ నుంచి ఇస్తాంబుల్‌కు బయలు దేరింది. మధ్యలో ఉండగా బాంబు బెదిరింపు రావడంతో ఐర్లాండ్ వైమానిక సంస్థ అధికారుల అనుమతి తీసుకుని ఇస్తాంబుల్ వైపు వెళ్లకుండా ఐర్లాండ్ లో పైలెట్ సురక్షితంగా దించి వేశాడు. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారు. విమానం దించినవెంటనే వారందరినీ షానాన్ ఎయిర్ పోర్ట్ లోని సురక్షిత స్థావరానికి తరలించి విమాన తనిఖీ ప్రారంభించారు. -
విమానంలో మొబైల్ ఫోన్ కలకలం
ముంబై: వారం వ్యవధిలోనే ముంబై నుంచి బయల్దేరిన మరో విమానం మార్గమధ్యంలో వెనుదిరిగి వచ్చింది. సోమవారం ముంబై నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కీ ఎయిర్‌లైన్స్ విమానాన్ని మధ్యలో వెనక్కుమళ్లించారు. విమానంలో ఓ మొబైల్ ఫోన్ తెగ మోగుతున్నా.. ఎవరూ దాన్ని ఆన్సర్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. సెల్ఫోన్లను కూడా బాంబులకు ట్రిగ్గర్లుగా వాడే అవకాశం ఉండటంతో.. విమానంలో ఎక్కడైనా బాంబు పెట్టారేమోనన్న భయంతో దాన్ని మళ్లీ ముంబై మళ్లించారు. ముంబైలో విమానాన్ని ల్యాండ్ చేసి క్షుణ్నంగా తనిఖీ చేశారు. విమానంలో ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత టర్కీ విమానం బయల్దేరేందుకు అధికారులు అనుమతిచ్చారు. గతవారం ముంబై-లండన్ విమానంలో ఎలుక కనిపించడంతో వెనుదిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. -
బాంబు బెదిరింపుతో విమానం దారి మళ్లింపు
-
బాంబు బెదిరింపుతో విమానం దారి మళ్లింపు
ఇస్తాంబుల్: ఉగ్రవాద చర్యలు ప్రపంచానికి సవాల్‌గా మారగా, బాంబు బెదిరింపులతో విమానయాన సంస్థలు కలవరపడుతున్నాయి. బాంబు బెదిరింపు రావడంతో టర్కీ ఎయిర్‌లైన్స్ విమానాన్ని మార్గమధ్యంలో దారిమళ్లించారు. నూయార్క్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న విమానాన్ని కెనడాలోని హాలిఫాక్స్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. కెనడా అత్యవసర సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తయ్యారు. విమానంలోని ప్రయాణికులందరినీ దించివేసి, క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఎలాంటి పేలుడు పదార్థం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా నుంచి ప్రాన్స్‌కు వెళ్తున్న రెండు విమానాలకు ఇటీవల బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని వెంటనే దారి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. తనిఖీల అనంతరం ఫ్రాన్స్‌కు చేరుకున్నాయి. -
లిప్‌స్టిక్‌తో బెదిరించారు!
''ఈ విమానం కార్గో విభాగంలో బాంబు ఉంది జాగ్రత్త''.. అని టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానానికి బెదిరింపు వచ్చింది. అయితే, ఈ బెదిరింపు ఎలా వచ్చిందో తెలుసా.. విమానంలో ఉన్న బాత్రూం అద్దం మీద ఒక లిప్‌స్టిక్‌తో ఈ మాట రాశారు. టికె-65 విమానం మొత్తం 148 మంది ప్రయాణికులతో బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తుండగా మధ్యలో ఎవరో ఈ బెదిరింపును చూసి.. పైలట్‌కు విషయం చెప్పారు. దాంతో వెంటనే విమానం పైలట్ నాగ్‌పూర్ ఏటీసీని సంప్రదించాడు. అయితే విమానాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ ఏటీసీని సంప్రదించి దించాలని వాళ్లు సూచించారు. (తొలి కథనం.. విమానం కేబిన్ లో బాంబు) దాంతో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని అత్యవసరంగా దించారు. మొత్తం ప్రయాణికులను, సిబ్బందిని కూడా భద్రతా సంస్థల అధికారులు విచారించారు. అందరి సామాన్లు, ముఖ్యంగా హ్యాండ్‌బ్యాగులను తనిఖీ చేశారు. ఆ లిప్‌స్టిక్ ఎవరి బ్యాగ్లోనైనా ఉందేమోనని చూశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా బృందాలు ఈ విచారణను కొనసాగిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం శాఖ కార్యదర్శి ఎన్సీ గోయల్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. హైజాక్ చేసే ప్రయత్నమా? విమానాన్ని హైజాక్ చేయాలన్న ఉద్దేశంతోనే బాంబు ఉందని బెదిరించినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముందుగా విమానంలో గందరగోళం సృష్టించి, ఆ తర్వాత దీన్ని హైజాక్ చేయాలన్నది వాళ్ల ఉద్దేశమని భావిస్తున్నారు. విమానాన్ని ఐసోలేటెడ్ బే ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ దాన్ని తనిఖీ చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు వద్ద నేషనల్ సెక్యూరిటీ గార్డులతో సహా అన్ని నిఘా సంస్థల అధికారులు మోహరించారు. -
విమానం కేబిన్‌లో బాంబు
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ కు సుమారు 148 మంది ప్రయాణికులతో బయలుదేరిన టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానంలో ఉన్నట్టుండి బాంబు కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. క్యాబిన్లో బాంబును కనుగొన్న పైలట్.. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. ఆ సమయానికి దగ్గరలో ఉన్న న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అనుమతి తీసుకుని అత్యవసరంగా విమానాన్ని కిందకు దించారు. దీంతో న్యూఢిల్లీ విమానాశ్రయంలో అత్యవర పరిస్థితిని ప్రకటించారు. అన్ని భద్రతా దళాలతో పాటు నేషనల్ సెక్యూరిటీ దళాలను అప్రమత్తం చేసి హై ఎలర్ట్ ప్రకటించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ , అగ్నిమాపక దళాలు హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకున్నాయి. విమానం లోపల, రన్ వే తదితర ఏరియాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. దీనిపై ఎన్ఎస్జీ అధికారులు, ఇతర సీనియర్ అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారని సమాచారం.