ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పదవి కోసం ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా తీవ్రమైన పోటీ నెలకొంది. ఏకంగా 240 మంది ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వర్సిటీకి చెందిన వారితో పాటు ఇతర వర్సిటీల అధ్యాపకులు, మాజీ వీసీలు, 100 మందికి పైగా రిటైర్డ్ అధ్యాపకులు, ప్రస్తుతం అధికార పదవుల్లో కొనసాగుతున్న రిజిస్ట్రార్ మొదలు ప్రిన్సిపల్స్, ఇతర అధికారులు, విభాగాల అధిపతులు రేసులో ఉండటం విశేషం. కాగా వీరి సుదీర్ఘ నిరీక్షణకు తెర వేస్తూ వీసీ ఎంపిక త్వరలో జరగవచ్చనే ప్రచారంతో పైరవీలు మరింత ఊపందుకున్నట్టు సమాచారం.
ముళ్ల కిరీటమే అయినా..
నిజాం స్థాపించిన ఈ వర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకొని 104వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఏడోదైన ఓయూ కోటి మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించింది. దీని ఘనకీర్తి ప్రపంచం నలుమూలలా విస్తరించింది. అలాంటి ఓయూ నేడు నిధులు, నియామకాలకు సంబంధించిన సమస్యలతో పాటు అనేక ఇతర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. నిత్యం ఏదో ఒక సమస్య, ఆందోళన కార్యక్రమాలతో సాగే ఓయూలో వీసీ పదవి ముళ్ల కిరీటమని తెలిసినా, మరోవైపు ప్రతిష్టాత్మక పదవి కావడంతో 240 మంది ప్రొఫెసర్లు దాని కోసం పోటీ పడుతున్నారు.
20 రోజుల్లో కొత్త ఉప కులపతి?
ప్రొఫెసర్ రామచంద్రం పదవీ విరమణతో సుమారు 18 నెలల కిందట ఈ పోస్టు ఖాళీ అయ్యింది. 2019 జూలైలో ఈ పదవికి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. గతేడాది సెర్చ్ కమిటీని నియమించినా ఇంతవరకు సమావేశం జరగలేదు. ఈ సమావేశం కోసం ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌ను నోడల్ అధికారిగా నియమించారు. అయితే వివిధ రకాల ఎన్నికల కారణంగా కోడ్ అమల్లో ఉండటం, కరోనా నేపథ్యంలో వీసీ నియామకంలో జాప్యం జరిగింది. అయితే ఇప్పటికే తీవ్ర జాప్యమవడం, కరోనా అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొంటుండడం, మార్చిలో మళ్లీ ఎన్నికలు (పట్టభద్రుల ఎమ్మెల్సీ) ఉన్న నేపథ్యంలో.. అంతకంటే ముందుగా 20 రోజుల్లోగానే ఓయూతో పాటు ఇతర వర్సిటీలకు వీసీలను నియమిస్తారని ఓయూ సీనియర్ అధ్యాపకులకు సమాచారం అందినట్టు తెలిసింది. సెర్చ్ కమిటీ సమావేశమై ముగ్గురి పేర్లు ఎంపిక చేస్తే, ముఖ్యమంత్రి అందులో ఒకరిని ఖరారు చేసి గవర్నర్‌కు పంపుతారు. ఆ తర్వాత వీసీ నియామకాన్ని గవర్నర్ ప్రకటిస్తారు.
పైరవీలు మరింత ముమ్మరం
వీసీ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న అధ్యాపకులు తొలినాళ్లలోనే జోరుగా పైరవీలు చేశారు. నియామకంలో జాప్యం తో కొంత సద్దుమణిగినా తాజా సమాచారం నేపథ్యంలో పైరవీలు మరింత ఊపందుకున్నట్లు తెలిసింది. లాక్‌డౌన్ అనంతరం వర్సిటీ అస్తవ్యస్తంగా మారిందని, కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా.. సమర్థులు, ఓయూకు పూర్వ వైభవం తెచ్చే ప్రొఫెసర్లను వీసీగా నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఒక పోస్టు 240 దరఖాస్తులు!
Published Thu, Jan 21 2021 8:11 AM | Last Updated on Thu, Jan 21 2021 8:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment