వీసీల నియామకంలో జాప్యం!
వివిధ స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిళ్లు
అనుభవజ్ఞులు, పదవికి గౌరవం తెచ్చేవారికి ప్రాధాన్యం
ఉన్నత విద్యామండలిలోనూ మార్పులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏ యూనివర్సిటీకి ఎవరిని నియమించాలనే అంశంపై కసరత్తు దాదాపు పూర్తయినప్పటికీ, కూడికలు, తీసివేతలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
వీసీల కూర్పు నేపథ్యంలో పలు రకాల ఒత్తిళ్లు వస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి అక్టోబర్ 3, 4 తేదీల్లో ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీలు భేటీ కానున్నాయి. ఈ కమిటీలు వీసీల నియామకంపై ప్రభుత్వానికి అవసరమైన సిఫార్సులు చేస్తాయి. ఒక్కో వీసీ పోస్టుకు ముగ్గురిని సూచిస్తాయి.
వీటిల్లో ఒకరిని ప్రభుత్వం గుర్తించి, జాబితాను గవర్నర్‌కు పంపాల్సి ఉంటుంది. కాగా, సెర్చ్ కమిటీల భేటీ తర్వాత తుది నిర్ణయం తీసుకునేందుకు సమయం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. దసరా సెలవులు, ఆ తర్వాత కూడా కొన్ని సెలవులు ఉండటం వల్ల అనుకున్న వ్యవధిలో వీసీల నియామకం జరగకపోవచ్చని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రక్షాళన తప్పదా?
అనుభవజు్ఞలు, పదవికి గౌరవం తెచ్చే వారితోనే ఈసారి వీసీల నియామకం ఉంటుందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మీడియాకు తెలిపారు. ఈ దిశగా అనేక మంది పేర్లు పరిశీలించినట్టు చెప్పారు. అయితే, ఈ క్రమంలో ఉన్నత విద్యా మండలిలోనూ భారీ ప్రక్షాళన ఉండొచ్చని అధికార వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. మండలిలో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కొంతమందిని కొనసాగించే ప్రతిపాదన కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
ఒక్కసారిగా మండలిని కొత్తవారితో నింపడం సరికాదని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో కార్యకలాపాలన్నీ సాఫీగా, ఎలాంటి వివాదాలు లేకుండా సాగుతున్నాయన్నది అధికారుల అభిప్రాయం. ఈ కారణంగా లింబాద్రిని కొనసాగించడమా? లేదా అనేదానిపై స్పష్టత రాలేదు. ఒకవేళ లింబాద్రి స్థానంలో వేరే వ్యక్తిని నియమిస్తే, ఆయనను ఏదైనా యూనివర్సిటీకి వీసీగా నియమించే అవకాశముందని తెలుస్తోంది.
మండలిలో ఇద్దరు వైస్ చైర్మన్ల మార్పు తప్పదనే వాదన వినిపిస్తోంది. మండలి కార్యదర్శిగా ఉన్న శ్రీరాం వెంకటేశ్ కొన్ని నెలల క్రితమే ఆ పోస్టులోకి వచ్చారు. ఆయన అనుభవా న్ని దృష్టిలో ఉంచుకుని ఈ పోస్టులో కొనసాగించే వీలుంది. కాగా, కీలకమైన జేఎన్‌టీయూహెచ్‌కు పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. దీనికి ఎన్‌ఐటీలో ఉన్న ఓ ప్రొఫెసర్ పేరు బలంగా వినిపిస్తోంది. ఢిల్లీ స్థాయిలో వచ్చే సిఫార్సులను కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి వస్తోందని సమాచారం.
ఉస్మానియా వర్సిటీ వీసీ పోస్టుకు ఉన్నతాధికారులు పాత వీసీనే సిఫార్సు చేస్తున్నారు. మరో నలుగురు కూడా వివిధ మార్గాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ స్థానం ఎవరికి దక్కుతుందనేది కీలకంగా మారింది. మొత్తం మీద అన్ని వర్సిటీలకు కూడా పోటీ ఉందని, ఈ నేపథ్యంలో వీసీల కూర్పునకు కొంత సమయం తప్పదని అధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment