వీసీ పోస్టులకు దరఖాస్తులపై సర్కారు దృష్టి
ఆరోపణలుంటే పరిశీలించొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు
వర్సిటీల్లో పరిస్థితులపై ప్రభుత్వం వద్ద నివేదికలు
నియామకాలకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైస్ చాన్స్‌లర్ల పోస్టుల కోసం వచ్చే దరఖాస్తుల పరిశీలనకు సెర్చ్ కమిటీలు రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో ప్రతి విశ్వ విద్యాలయంపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రభుత్వం అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. విశ్వవిద్యాలయాలు ఎందుకు వివాదాస్ప దమవుతున్నాయి? అక్కడున్న లోపాలు ఏంటి? అధ్యయనం చేయాలని సూచించింది. వీసీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారి వ్యక్తిగత వివరాలను కూడా లోతుగా పరిశీలించాలని స్పష్టం చేసినట్లు సమాచారం.
సర్వీస్‌లో ఏమాత్రం వివాదాస్పద రికార్డు ఉన్నా.. వారిని పక్కన బెట్టాలని ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే వీసీలుగా ఉన్న వారితో అంటకాగే వ్యక్తుల దరఖాస్తులను కూడా పక్కన పెట్టాలనే ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. వర్సిటీల వారీగా సెర్చ్ కమిటీలను ప్రభుత్వం ప్రకటించింది. సీఎస్ శాంతికుమారికి అన్ని కమిటీల్లో భాగస్వామ్యం కల్పించింది.
ప్రభుత్వం వద్ద సమగ్ర నివేదికలు
రాష్ట్రంలో పది విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించేందుకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా వర్సిటీల్లో ఇన్నేళ్లుగా చోటు చేసుకున్న వివాదాలపై ప్రభుత్వం గతంలోనే నివేదిక కోరింది. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే అన్ని వర్సిటీల్లోని వ్యవహారాలపై సమగ్ర నివేదికలు తెప్పించుకుంది.
ఉన్నత విద్యలో కీలక పదవులు నిర్వహించిన వారు, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని అధ్యాపక సంఘాలు వర్సిటీల్లో జరుగుతున్న వ్యవహారాలపై సీఎంకు నివేదికలు ఇచ్చారు. ఈ నివేదికలు పరిగణనలోకి తీసుకుని ప్రక్షాళన చేపట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సమాచారం.
రాజకీయ ప్రాధాన్యతతో దుష్ఫలితాలు
వైస్ చాన్స్‌లర్ల నియామకంలో రాజకీయ ప్రాధాన్యత అనేక దుష్ఫలితాలకు దారితీస్తోందని పలువురు ప్రొఫెసర్లు సీఎం దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని యూనివర్సిటీల్లో వీసీల ఇష్టారాజ్యం నడుస్తోందని ఓ ఆచార్యుడు పేర్కొన్నట్లు తెలిసింది. బాసర ట్రిపుల్ ఐటీపై అనేక ఆరోపణలున్నాయి. ఇప్పటికీ అక్కడ ఇన్‌చార్జి వీసీనే కొనసాగుతున్నారు. గత కొన్నేళ్లుగా వర్సిటీపై అనేక రకాల ఫిర్యాదులు వస్తున్నాయి. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పేరుకు సెర్చ్ కమిటీలు నియమిస్తున్నా వాటికి ఏమాత్రం ప్రాధాన్యత ఉండటం లేదని వారు వివరించినట్లు తెలుస్తోంది.
ఓ వర్సిటీ వీసీ నియామకాన్ని సెర్చ్ కమిటీ తీవ్రంగా తప్పుబట్టినా పెద్దగా పట్టించుకోలేదని గుర్తు చేస్తున్నారు. మరోవైపు గత కొంత కాలంగా విద్యాశాఖ కమిషనర్ల పాత్ర కూడా విశ్వవిద్యాలయాల్లో కొత్త సమస్యలకు దారి తీస్తోంది. గత ఏడాది ఓ ఐఏఎస్ అధికారి నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆయనకు నచ్చిన అంశాలపై వర్సిటీ పాలక మండలిలో ఆమోదం పొందేందుకు తీవ్ర ఒత్తిడి తెచ్చారనే విమర్శ లున్నాయి. ఈ క్రమంలో ఆయనకు, వీసీకి మధ్య జరిగిన ప్రచ్ఛన్న పోరు వర్సిటీ పరువు ప్రతిష్టలకు భంగం కల్గించిందని పలువురు సీఎం దృష్టికి తెచ్చారు.
మరో వర్సిటీలో రిటైర్ అయిన వ్యక్తిని రిజిస్ట్రార్‌గా కొనసాగించిన తీరు కూడా అనేక విమర్శలకు కారణమైంది. దీని వెనుక వీసీ ప్రమేయం కూడా ఉందని చెబుతున్నారు. ఇలాంటి పలు వివాదాలు, వీసీల అవినీతి, అక్రమ వ్యవహారాలపై ముఖ్యమంత్రికి నివేదికలు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వీసీల నియామకంపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గద ర్శకాలు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment