
26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియామకం
రాష్ట్రపతికి సిఫార్సు చేసిన సెలక్షన్ కమిటీ
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము
ఎన్నికల సంఘం కమిషనర్‌గా డాక్టర్ వివేక్ జోషి
సాక్షి, న్యూఢిల్లీ: నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్(61) పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఖరారు చేసింది. కమిటీ సోమవారం సాయంత్రం ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌లో సమావేశమైంది. మోదీతోపాటు కమిటీలో సభ్యులైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన ఐదుగురు అభ్యర్థుల జాబితా నుంచి జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎంపిక చేశారు.
కొత్త సీఈసీ పేరును సెలక్షన్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నూతన సీఈసీ నియామకంపై రాష్ట్రపతి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 26వ సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ ఎంపికైనట్లు కేంద్ర న్యాయ శాఖ ప్రకటించింది. ఆయన ఈ నెల 19న బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ పదవీ కాలం 2029 జనవరి 26 దాకా ఉంది. అలాగే ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ స్థానంలో హరియాణా కేడర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ వివేక్ జోషి నియమితులయ్యారు.
కొత్తం చట్టం కింద తొలి సీఈసీ
1988 బ్యాచ్ కేరళక్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేశ్ కుమార్ ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఐఐటీ–కాన్పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తిచేశారు. ఇక్ఫాయ్ యూనివర్సిటీలో బిజినెస్ ఫైనాన్స్ చదివారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఎన్విరాన్‌మెంటల్ ఎకనామిక్స్ అభ్యసించారు. కేరళలో ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో సేవలందించారు. కేంద్ర సరీ్వసుల్లో చేరి, రక్షణ శాఖలో జాయింట్ సెక్రెటరీగా సేవలందించారు. హోంశాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల నియామకంపై కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నియమితులైన తొలి సీఈసీ జ్ఞానేశ్ కుమార్. ఆయన ఆధ్వర్యంలోనే బిహార్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయన 2024 మార్చి 15న ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర హోంశాఖలో పని చేస్తున్నప్పుడు ఆరి్టకల్ 370 రద్దుకు సంబంధించిన బిల్లు రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. అయోధ్య రామమందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు కేసులో కేంద్రానికి సహకరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జ్ఞానేశ్ కుమార్ సన్నిహితుడిగా పేరుంది.
సమావేశం వాయిదా వేయాలన్న కాంగ్రెస్
సెలక్షన్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ తొలుత డిమాండ్ చేసింది. సెలక్షన్ కమిటీ ఏర్పాటుపై ఈ నెల 19వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉందని వెల్లడించింది. కోర్టులో విచారణ పూర్తయ్యేదాకా కమిటీ సమావేశం నిర్వహించవద్దని కోరింది. సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, కేంద్ర మంత్రిని నియమించడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత అభిõÙక్ మనూ సింఘ్వీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘాన్ని చెప్పుచేతల్లో ఉంచుకోవడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీయడం తగదని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment