new Election Commissioner
-
నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్(61) పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఖరారు చేసింది. కమిటీ సోమవారం సాయంత్రం ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌లో సమావేశమైంది. మోదీతోపాటు కమిటీలో సభ్యులైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన ఐదుగురు అభ్యర్థుల జాబితా నుంచి జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎంపిక చేశారు. కొత్త సీఈసీ పేరును సెలక్షన్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నూతన సీఈసీ నియామకంపై రాష్ట్రపతి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 26వ సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ ఎంపికైనట్లు కేంద్ర న్యాయ శాఖ ప్రకటించింది. ఆయన ఈ నెల 19న బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ పదవీ కాలం 2029 జనవరి 26 దాకా ఉంది. అలాగే ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ స్థానంలో హరియాణా కేడర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ వివేక్ జోషి నియమితులయ్యారు. కొత్తం చట్టం కింద తొలి సీఈసీ 1988 బ్యాచ్ కేరళక్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేశ్ కుమార్ ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఐఐటీ–కాన్పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తిచేశారు. ఇక్ఫాయ్ యూనివర్సిటీలో బిజినెస్ ఫైనాన్స్ చదివారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ అభ్యసించారు. కేరళలో ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో సేవలందించారు. కేంద్ర సరీ్వసుల్లో చేరి, రక్షణ శాఖలో జాయింట్ సెక్రెటరీగా సేవలందించారు. హోంశాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల నియామకంపై కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నియమితులైన తొలి సీఈసీ జ్ఞానేశ్ కుమార్. ఆయన ఆధ్వర్యంలోనే బిహార్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయన 2024 మార్చి 15న ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర హోంశాఖలో పని చేస్తున్నప్పుడు ఆరి్టకల్ 370 రద్దుకు సంబంధించిన బిల్లు రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. అయోధ్య రామమందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు కేసులో కేంద్రానికి సహకరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జ్ఞానేశ్ కుమార్ సన్నిహితుడిగా పేరుంది. సమావేశం వాయిదా వేయాలన్న కాంగ్రెస్ సెలక్షన్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ తొలుత డిమాండ్ చేసింది. సెలక్షన్ కమిటీ ఏర్పాటుపై ఈ నెల 19వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉందని వెల్లడించింది. కోర్టులో విచారణ పూర్తయ్యేదాకా కమిటీ సమావేశం నిర్వహించవద్దని కోరింది. సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, కేంద్ర మంత్రిని నియమించడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత అభిõÙక్ మనూ సింఘ్వీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘాన్ని చెప్పుచేతల్లో ఉంచుకోవడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీయడం తగదని సూచించారు. -
సీఈసీ, ఈసీల నియామక చట్టంపై స్టే ఇవ్వలేం: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (అపాయింట్మెంట్, కండీషన్స్ ఆఫ్ సరీ్వస్, టర్మ్స్ ఆఫ్ ఆఫీస్) చట్టం–2023’పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఈసీ, ఈసీల నియామకానికి సంబంధించిన సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, ఇటీవల ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఇతర పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్లలో ఒకరి తరఫున సీనియర్ లాయర్ వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన కమిటీ సిఫార్సుల మేరకు సీఈసీ, ఇతర కమిషనర్ల నియామకాలు చేపట్టాలని అనూప్ బరన్వాల్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచి్చందని గుర్తుచేశారు. కొత్త చట్టంపై స్టే విధించాల్సిందేనని అసోసియేషన్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ప్రభుత్వ పాలనాయంత్రాంగం కింద పని చేస్తోందని ఆరోపించారు. అయితే, ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అని, పాలనాయంత్రాంగం కింద పనిచేస్తోందని అనడం సరికాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యా నించారు. ‘‘ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే నియమితులయ్యారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. నియమితులైన ఇద్దరు కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టంపై మధ్యంతర ఉత్తర్వు ద్వారా స్టే విధించడం గందరగోళానికి దారి తీస్తుంది. అలాగే వారి నియామకాన్ని నిలిపివేయలేం’’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా తేల్చిచెప్పారు. నూతన చట్టం ప్రకారం ఎంపికైన ఇద్దరు కమిషనర్ల నియామకంపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరింది. అయితే, ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్లను పరిశీలిస్తామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 5 తేదీకి వాయిదా వేసింది. -
ఎన్నికల కమిషనర్ గా ఓపీ రావత్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్ గా మధ్యప్రదేశ్ మాజీ ఐఏఎస్ అధికారి ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఆయనను కమిషనర్ గా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పదవీ కాలం అమల్లోకి వస్తుందని కేంద్ర న్యాయశాఖ గురువారం ప్రకటించింది. 2018 చివరివరకు పదవిలో కొనసాగే అవకాశముంది. 1977 బ్యాచ్ కు చెందిన రావల్ గతేడాది డిసెంబర్ లో ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు. ఎన్నికల కమిషనర్ పదవి రాజ్యాంగబద్దమైనదని, నిష్పక్షపాతంగా పనిచేస్తానని రావత్ చెప్పారు.