Posts Empty
-
9.79 లక్షల ఖాళీలు: కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1వ తేదీ నాటికి 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల సంఖ్య 40.35 లక్షలు అని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1 నాటికి 30,55,876 మంది ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ బాధ్యత సంబంధిత శాఖ, డిపార్టుమెంట్దేనని తేల్చిచెప్పారు. ఖాళీ పోస్టుల భర్తీ అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. -
8.72 లక్షల కేంద్ర ప్రభుత్వ పోస్టులు ఖాళీ
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సుమారు 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది శాఖ మంత్రి జితేంద్రసింగ్ గురువారం రాజ్యసభకు తెలిపారు. మొత్తం 40,04,941 పోస్టులకు గాను 2020 మార్చి ఒకటో తేదీనాటికి 31,32,698 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయని లిఖిత పూర్వకంగా వెల్లడించారు. 2016–17 నుంచి 2020–21 వరకు ప్రధాన రిక్రూట్మెంట్ విభాగాలైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 25,267 మందిని, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) 2,14,601, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు(ఆర్ఆర్బీలు) 2,04,945 మందిని ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. విదేశాలకు 6.4 కోట్ల టీకా డోసులు ఈ ఏడాది జనవరి 12 నుంచి జూలై 22వ తేదీ వరకు సుమారు 6.4 కోట్ల డోసుల కోవిడ్ టీకాలను విదేశాలకు పంపినట్లు లోక్‌సభలో పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ప్రకటించారు. మరో 35.8 కోట్ల డోసులను దేశీయంగా పంపిణీ చేశామన్నారు. -
ఒక పోస్టు 240 దరఖాస్తులు!
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పదవి కోసం ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా తీవ్రమైన పోటీ నెలకొంది. ఏకంగా 240 మంది ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వర్సిటీకి చెందిన వారితో పాటు ఇతర వర్సిటీల అధ్యాపకులు, మాజీ వీసీలు, 100 మందికి పైగా రిటైర్డ్ అధ్యాపకులు, ప్రస్తుతం అధికార పదవుల్లో కొనసాగుతున్న రిజిస్ట్రార్ మొదలు ప్రిన్సిపల్స్, ఇతర అధికారులు, విభాగాల అధిపతులు రేసులో ఉండటం విశేషం. కాగా వీరి సుదీర్ఘ నిరీక్షణకు తెర వేస్తూ వీసీ ఎంపిక త్వరలో జరగవచ్చనే ప్రచారంతో పైరవీలు మరింత ఊపందుకున్నట్టు సమాచారం. ముళ్ల కిరీటమే అయినా.. నిజాం స్థాపించిన ఈ వర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకొని 104వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఏడోదైన ఓయూ కోటి మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించింది. దీని ఘనకీర్తి ప్రపంచం నలుమూలలా విస్తరించింది. అలాంటి ఓయూ నేడు నిధులు, నియామకాలకు సంబంధించిన సమస్యలతో పాటు అనేక ఇతర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. నిత్యం ఏదో ఒక సమస్య, ఆందోళన కార్యక్రమాలతో సాగే ఓయూలో వీసీ పదవి ముళ్ల కిరీటమని తెలిసినా, మరోవైపు ప్రతిష్టాత్మక పదవి కావడంతో 240 మంది ప్రొఫెసర్లు దాని కోసం పోటీ పడుతున్నారు. 20 రోజుల్లో కొత్త ఉప కులపతి? ప్రొఫెసర్ రామచంద్రం పదవీ విరమణతో సుమారు 18 నెలల కిందట ఈ పోస్టు ఖాళీ అయ్యింది. 2019 జూలైలో ఈ పదవికి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. గతేడాది సెర్చ్ కమిటీని నియమించినా ఇంతవరకు సమావేశం జరగలేదు. ఈ సమావేశం కోసం ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌ను నోడల్ అధికారిగా నియమించారు. అయితే వివిధ రకాల ఎన్నికల కారణంగా కోడ్ అమల్లో ఉండటం, కరోనా నేపథ్యంలో వీసీ నియామకంలో జాప్యం జరిగింది. అయితే ఇప్పటికే తీవ్ర జాప్యమవడం, కరోనా అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొంటుండడం, మార్చిలో మళ్లీ ఎన్నికలు (పట్టభద్రుల ఎమ్మెల్సీ) ఉన్న నేపథ్యంలో.. అంతకంటే ముందుగా 20 రోజుల్లోగానే ఓయూతో పాటు ఇతర వర్సిటీలకు వీసీలను నియమిస్తారని ఓయూ సీనియర్ అధ్యాపకులకు సమాచారం అందినట్టు తెలిసింది. సెర్చ్ కమిటీ సమావేశమై ముగ్గురి పేర్లు ఎంపిక చేస్తే, ముఖ్యమంత్రి అందులో ఒకరిని ఖరారు చేసి గవర్నర్‌కు పంపుతారు. ఆ తర్వాత వీసీ నియామకాన్ని గవర్నర్ ప్రకటిస్తారు. పైరవీలు మరింత ముమ్మరం వీసీ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న అధ్యాపకులు తొలినాళ్లలోనే జోరుగా పైరవీలు చేశారు. నియామకంలో జాప్యం తో కొంత సద్దుమణిగినా తాజా సమాచారం నేపథ్యంలో పైరవీలు మరింత ఊపందుకున్నట్లు తెలిసింది. లాక్డౌన్ అనంతరం వర్సిటీ అస్తవ్యస్తంగా మారిందని, కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా.. సమర్థులు, ఓయూకు పూర్వ వైభవం తెచ్చే ప్రొఫెసర్లను వీసీగా నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
ఆ ప్లీడర్లు మాకొద్దు!
సాక్షి, హైదరాబాద్: అతనొక చెట్టుకింద ప్లీడరు.. ఎలాగైనా టెన్యూర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (టీపీపీ) అవ్వాలనుకున్నాడు. తెలిసిన నేతను పట్టుకుని ఏకంగా డిస్ట్రిక్ సెషన్స్ కోర్టులో టీపీపీగా పాగా వేశాడు. న్యాయశాస్త్రంపై పెద్దగా పట్టులేకపోవడం, అనుభవం అంతంత మాత్రంగానే ఉండటంతో వచ్చిన కేసుల్లో చాలావరకు ఓడిపోతున్నాడు. కోర్టులో చేతులెత్తేస్తున్న ఇలాంటి టీపీపీల వల్ల పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ‘దిశ’లాంటి సంచలన కేసులు నమోదైతే.. అక్కడున్న టెన్యూర్ ప్లీడర్లు తమకొద్దని ఉన్నతాధికారులకు దర్యాప్తు అధికారులు స్పష్టం చేస్తుండటంతో వేరే ప్రాంతం నుంచి సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పిలిపించాల్సి వస్తోంది. ఎలా వస్తున్నారు..? రాష్ట్రంలో ఉన్న 500లకుపైగా వివిధ రకాల కోర్టుల్లో200కిపైగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేసులు వాదించేందుకు వీలుగా తాత్కాలికంగా ఈ పోస్టులను టెన్యూర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆయా కోర్టులు భర్తీ చేసుకుంటున్నాయి. ఇందుకోసం స్థానిక కోర్టు న్యాయమూర్తి తన కోర్టులో పనిచేస్తున్న ప్రైవేటు లాయర్లలో నలుగురైదుగురి పేర్లను కలెక్టరుకు సిఫారసు చేస్తారు. వీరిలో ఒకరిని కలెక్టర్ ఎంపిక చేసి, ప్రభుత్వానికి పంపుతారు. ప్రభుత్వం ఆమోదించగానే.. సదరు వ్యక్తి టీపీపీగా ప్రాక్టీసు చేయొచ్చు. అయితే, రాజకీయ నేతల జోక్యంతో కొందరు ప్లీడర్లు నేరుగా టీపీపీలుగా నియామక పత్రాలు తెచ్చుకుని నేరుగా జిల్లా కోర్టుల్లో పాగా వేస్తున్నారు. కీలకమైన కేసుల్లో నిందితులు సుప్రీం, హైకోర్టులో వాదించే సీనియర్ లాయర్లను తెచ్చుకున్నప్పు డు వారిని ఎదుర్కోలేకపోతున్నారు. ఆంగ్ల పరిజ్ఞానం, అనుభవం అంతంత మాత్రంగానే ఉండటంతో వారి ముందు నిలబడలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఏర్పాటు చేసిన 9 పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లోనూ లాయర్ల కొరత ఉండటంతో ఖాళీగా ఉన్న పీపీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు. -
అటవీ ‘ఖాళీ’
ఆదిలాబాద్‌రూరల్: జంగిల్ బచావో..జంగిల్ బడావోలో భాగంగా చేపట్టిన బదిలీలతో ఉమ్మడి జిల్లాలో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బందికి ఆదేశాలు ఇచ్చే వారు లేక అటవీ సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అటవీశాఖ భారీగా బదిలీలు చేపట్టింది. అడవులు అధికంగా ఉండే ప్రాంతాల్లో కఠినంగా వ్యవహరించే నిబద్ధత, అంకిత భావం కలిగిన అధికారులను నియమించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అంటేనే ఆడువులు గుర్తుకు వస్తాయి. అత్యధికంగా ఆడవులు విస్తరించి ఉన్న ఆదిలాబాద్‌లో అటవీశాఖలో కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్చార్జీ అధికారులు కొనసాగుతున్నారు. ఇటీవల ప్రభుత్వం బదిలీలు చేసినప్పటికీ ఖాళీగా ఉన్న కీలకపోస్టులను మాత్రం భర్తీ చేయలేకపోయింది. ఉమ్మడి జిల్లాలో కొనసాగే కలప రవాణా ఈ ప్రాంతాల నుంచే.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఉట్నూర్, దిమ్మదుర్తి మామడ, కాగజ్‌నగర్, తదితర రేంజ్ పరిధిలోని అడవుల నుంచి వందలాది లారీల్లో కలప అక్రమ రవాణా కొనసాగుతుంది. అధికారులకు పట్టుబడితే ఈ ప్రాంతాల నుంచి వచ్చిన కలపగా ఆటవీశాఖ అధికారులు గుర్తిస్తున్నారు. ఈ రేంజ్లో అతి కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడంతో కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో అటవీశాఖ అధికారులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. కీలక పోస్టులు ఖాళీ.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఆయా రేంజ్ పరిధిలో కీలక బాధ్యతలు నిర్వర్తించే రేంజ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ కాలేదు. దీంతో సిబ్బందిపై భారం పడుతోంది. ఇటీవల బదిలీల్లో భాగంగాను భర్తీ చేయలేదు. ఇదిలా ఉంటే అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఉట్నూర్, తదితర ఎఫ్ఆర్వో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఇన్చార్జీ అధికారులే కొనసాగుతున్నారు. ప్రభుత్వం అటవీశాఖలో చేపట్టిన ప్రక్షాళన మాత్రం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అంతగా ప్రభావం కనిపించడం లేదని ఆ శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. కీలకమైన పోస్టులు లేకపోవడంతో అక్రమ కలప రవాణాకు అడ్డుకట్టవేసేందుకు ఇబ్బందులు తప్పడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టాస్క్‌ఫోర్స్ పోస్టులు ఖాళీ.. కలప అక్రమ రవాణా ఆరికట్టడంలో టాస్క్‌పోర్సు అధికారులు కీలకం. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం, మంచిర్యాల జిల్లాలకు ఒక్కో టాస్క్‌ఫోర్స్ టీం ఉండాలి. ఇందులో ఒక టాస్క్‌ఫోర్స్ అటవీ క్షేత్రస్థాయి అధికారితోపాటు ఒకరు సెక్షన్ ఆఫీసర్ మరో ఇద్దరు బీట్ ఆఫీసర్లు ఉంటారు. కానీ కేవలం నిర్మల్ జిల్లాకు మాత్రమే టాస్క్‌ఫోర్స్ టీం ఉంది. మిగతా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ఈ టాస్క్‌పోర్సు అటవీ క్షేత్రస్థాయి అధికారి కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరిని నియమిస్తే కొంత కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అవకాశాలు ఉన్నాయని పలువురు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.. జిల్లాలో ఆయా చోట్ల రేంజ్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారులకు ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించాం. పోస్టులు ఖాళీగా ఉండడంతో ఉన్న అధికారులతో కొనసాగిస్తున్నాం. జిల్లాలోని పోస్టుల ఖాళీల వివరాలను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలో భర్తీ కానున్నాయి. – ప్రభాకర్, డీఎఫ్‌వో, ఆదిలాబాద్ -
రైల్వేలో రెండు లక్షల పోస్టులు ఖాళీ
సామర్లకోట: సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో రెండు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో లక్ష పోస్టులు సేఫ్టీ డిపార్టుమెంటుకు చెందినవే ఉన్నాయని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కోశాధికారి సీపీఎస్ శర్మ తెలిపారు. సామర్లకోట, కాకినాడల బ్రాంచిల సర్వసభ్య సమావేశం సందర్భంగా బ్రాంచి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోస్టుల భర్తీకి తమ సంఘం డిమాండ్ చేస్తూ అనేక ఆందోళనలు చేస్తున్నామన్నారు. పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల ఉన్న ఉద్యోగులపై పని భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికులను తమ సంఘంలో సభ్యులుగా చేర్చుకుంటున్నామన్నారు. రైల్వేలోనూ అనేక యూనియన్లు వస్తున్నాయని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 30 శాతం ఓటింగ్ ఉన్న వారికి మాత్రమే అర్హత ఉంటుందన్నారు. ఈ మేరకు రెండు యూనియన్లు గుర్తింపు పొందాయని తెలిపారు. బీజెపీ ప్రభుత్వం యూనియన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. బుల్లెట్ ప్రూప్ రైళ్లు ఎవరి కోసం? బుల్లెట్ ప్రూప్ రైళ్ల వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందో అర్థం కావడం లేదన్నారు. జపాన్ సాయంలో రూ.2,500 కోట్లతో ఈ రైళ్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, సామాన్య ప్రజలకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలనలో దేశం ప్రమాద స్థితికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో డివిజనల్ అధ్యక్షుడు ఆకుల రాఘవేంద్రరావు, కార్యదర్శి ఆమంచి వెంకటేశ్వరరావు, డివిజనల్ మాజీ సహాయ కార్యదర్శి కేవీవీ రావు, బ్రాంచి అధ్యక్షుడు ఎం.సాయిబాబు, కార్యదర్శి ఎం.రమేష్ పాల్గొన్నారు. కాకినాడ బ్రాంచి అధ్యక్షుడిగా శ్రీనివాసరావు ఎస్సీఆర్ ఎంప్లాయీస్ సంఘ్ కాకినాడ బ్రాంచి అధ్యక్షుడిగా సీహెచ్ శ్రీనివాసరావు, వర్కింగ్ చైర్మన్‌గా జీవీ శివానంద్, ఉపాధ్యక్షులుగా ఎస్.ప్రసన్నకుమార్, ఎస్వీఆర్ నాయుడు, జీవీవీ సత్యనారాయణమూర్తి, కార్యదర్శిగా ఎం.శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులుగా ఎస్వీ కిరణ్‌కుమార్, ఇ అప్పలనాయుడు, డీవీవీ సత్యనారాయణ, కోశాధికారిగా టి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. సామర్లకోట బ్రాంచి అధ్యక్షుడిగా ఈశ్వరరావు సామర్లకోట బ్రాంచి అధ్యక్షుడిగా పి.ఈశ్వరరావు, వర్కింగ్ చైర్మన్‌గా బి.రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా సీహెచ్ చిరంజీవి, కేవీకే గోపాల్‌రెడ్డి, ఎన్.నారాయణరావు, కార్యదర్శిగా ఎం.రమేష్, సహాయ కార్యదర్శులుగా బీవీ రమణ, కేవీ ప్రసాద్, ఎన్.సత్యనారాయణ, కోశాధికారి కె.రాధాకృష్ణ ఎన్నికయ్యారు. -
పోచారం.. చూడండీ మా గాచారం!
⇒ వ్యవసాయశాఖ.. సమస్యల తడాఖా! ⇒ అద్దె ఇంటిలోనే జేడీఏ కార్యాలయం ⇒ పోస్టులు ఖాళీ.. ఇన్‌చార్జీలే దిక్కు.. ⇒ రైతులకు సేవలందించలేని దుస్థితి ⇒ కొత్త సర్కారుపైనే గంపెడాశలు ⇒ నేడు మంత్రి పోచారం రాక వరంగల్ : జిల్లా వ్యవసాయ శాఖ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. అద్దె భవనాలే వ్యవసాయ కార్యాలయాలకు దిక్కుగా మారాయి. ప్రధానమైన వ్యవసాయ సంయుక్త సంచాలకుల(జేడీఏ) కార్యాలయం ఇరుకుగా ఉన్న అద్దె ఇంటిలో కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా ఏడీఏ, ఏఓలకూడా సరైన కార్యాలయాలు లేవు. కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో పాలన అస్తవ్యస్తంగా తయూరైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని రైతాంగం గంపెడాశలు పెట్టుకుంది. మురుగుతున్న రూ.45 లక్షలు హన్మకొండలోని అదాలత్ వెనుక జేడీఏ కార్యాలయం ఉంది. సర్క్యూట్ గెస్ట్‌హౌస్ సమీపంలో ఏడీఏ కార్యాలయం కొనసాగుతోంది. కీలక కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దకాలంగా పెండింగ్‌లోనే ఉంది. 2005లో జేడీఏ కార్యాలయ నిర్మాణం కోసం రూ.45 లక్షలు విడుదలయ్యూయి. అవి అతీగతి లేకుండా అక్కడే మురిగిపోతున్నాయి. బంధం చెరువు సమీపంలో జేడీఏ కార్యాలయానికి స్థలం కేటాయించినా.. కోర్టు కేసుల కారణంగా ముందుకు సాగడం లేదు. నూతన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ కార్యాలయాల నిర్మాణానికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్చార్జలతోనే కాలం వెళ్లదీత జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయ శాఖలో అధికారుల కొరత పీడిస్తోంది. ఖాళీ పోస్టుల్లో తాత్కాలికంగా ఇతర అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించి కాలం వెళ్లదీస్తున్నారు. కొంతకాలంగా జిల్లాలో 10 స్థానాల్లో అధికారులు లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఫలితంగా ఉన్న అధికారులపై పని ఒత్తిడి పెరిగింది. జిల్లా వ్యవసాయ శాఖలో అత్యంత ప్రధానమైన జాయింట్ డెరైక్టర్ ఆఫ్ అగ్రికల్చర్(జేడీఏ) స్థానంలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో డీడీఏగా జి.రామారావు విధులు నిర్వర్తిస్తున్నారు. నూతన రాష్ట్రంలో చేర్పులు, మార్పులు జరిగితే కొత్త జేడీఏను నియమించే అవకాశం ఉంది. అదేవిధంగా.. ప్లాంట్ ప్రొడక్షన్, రైతు శిక్షణ కేంద్రం, భూసార కేంద్రం, జేడీఏ కార్యాలయంలో నాలుగు డిప్యూటీ డెరైక్టర్ అఫ్ అగ్రికల్చర్(డీడీఏ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండల స్థాయిలో రైతులతో ప్రత్యక్ష సంబంధాలుండే ఆరు వ్యవసాయ అధికారుల (ఏఓ) స్థానాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తాడ్వాయి, వరంగల్ ఏడీఏ కార్యాలయం, రైతు శిక్షణ కేంద్రం, కేసముద్రం, ఏటూరునాగారంలోని భూసార పరీక్ష కేంద్రం, పాలంపేటలోని విత్తన ఫామ్‌లలో ఒక్కో ఏఓ పోస్టు ఖాళీగా ఉంది. వీటితోపాటు ఏఈఓ స్థానా లు పలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖకు నివేదించారు. ఈ దఫా భర్తీ చేస్తారనే.. ఈ ఖాళీల వల్ల సంబంధిత విభాగాలు, మండలాల్లో రైతులకు వ్యవసాయ అధికారులు, సిబ్బంది సరైన సమయంలో సూచనలు అందించలేకపోతున్నారు. కార్యాలయాల్లో ఏఓల కొరత వల్ల పనులు సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. నూతన ప్రభుత్వం వ్యవసాయ శాఖకు అత్యంత ప్రాధాన్యమినిస్తున్నట్లు ప్రకటిస్తున్నందున ఈ దఫా ఈ ఖాళీలు భర్తీ చేస్తారనే ఆశాభావంతో జిల్లా రైతులు ఉన్నారు. ఈ దిశగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సత్వర చర్యలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు.