ఆదిలాబాద్‌రూరల్: జంగిల్ బచావో..జంగిల్ బడావోలో భాగంగా చేపట్టిన బదిలీలతో ఉమ్మడి జిల్లాలో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బందికి ఆదేశాలు ఇచ్చే వారు లేక అటవీ సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అటవీశాఖ భారీగా బదిలీలు చేపట్టింది. అడవులు అధికంగా ఉండే ప్రాంతాల్లో కఠినంగా వ్యవహరించే నిబద్ధత, అంకిత భావం కలిగిన అధికారులను నియమించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అంటేనే ఆడువులు గుర్తుకు వస్తాయి. అత్యధికంగా ఆడవులు విస్తరించి ఉన్న ఆదిలాబాద్‌లో అటవీశాఖలో కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జీ అధికారులు కొనసాగుతున్నారు. ఇటీవల ప్రభుత్వం బదిలీలు చేసినప్పటికీ ఖాళీగా ఉన్న కీలకపోస్టులను మాత్రం భర్తీ చేయలేకపోయింది.
ఉమ్మడి జిల్లాలో కొనసాగే కలప రవాణా ఈ ప్రాంతాల నుంచే..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఉట్నూర్, దిమ్మదుర్తి మామడ, కాగజ్‌నగర్, తదితర రేంజ్ పరిధిలోని అడవుల నుంచి వందలాది లారీల్లో కలప అక్రమ రవాణా కొనసాగుతుంది. అధికారులకు పట్టుబడితే ఈ ప్రాంతాల నుంచి వచ్చిన కలపగా ఆటవీశాఖ అధికారులు గుర్తిస్తున్నారు. ఈ రేంజ్‌లో అతి కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడంతో కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో అటవీశాఖ అధికారులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
కీలక పోస్టులు ఖాళీ..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఆయా రేంజ్ పరిధిలో కీలక బాధ్యతలు నిర్వర్తించే రేంజ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ కాలేదు. దీంతో సిబ్బందిపై భారం పడుతోంది. ఇటీవల బదిలీల్లో భాగంగాను భర్తీ చేయలేదు. ఇదిలా ఉంటే అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఉట్నూర్, తదితర ఎఫ్‌ఆర్వో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఇన్‌చార్జీ అధికారులే కొనసాగుతున్నారు. ప్రభుత్వం అటవీశాఖలో చేపట్టిన ప్రక్షాళన మాత్రం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అంతగా ప్రభావం కనిపించడం లేదని ఆ శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. కీలకమైన పోస్టులు లేకపోవడంతో అక్రమ కలప రవాణాకు అడ్డుకట్టవేసేందుకు ఇబ్బందులు తప్పడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
టాస్క్‌ఫోర్స్ పోస్టులు ఖాళీ..
కలప అక్రమ రవాణా ఆరికట్టడంలో టాస్క్‌పోర్సు అధికారులు కీలకం. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం, మంచిర్యాల జిల్లాలకు ఒక్కో టాస్క్‌ఫోర్స్ టీం ఉండాలి. ఇందులో ఒక టాస్క్‌ఫోర్స్ అటవీ క్షేత్రస్థాయి అధికారితోపాటు ఒకరు సెక్షన్ ఆఫీసర్ మరో ఇద్దరు బీట్ ఆఫీసర్లు ఉంటారు. కానీ కేవలం నిర్మల్ జిల్లాకు మాత్రమే టాస్క్‌ఫోర్స్ టీం ఉంది. మిగతా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ఈ టాస్క్‌పోర్సు అటవీ క్షేత్రస్థాయి అధికారి కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరిని నియమిస్తే కొంత కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అవకాశాలు ఉన్నాయని పలువురు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం..
జిల్లాలో ఆయా చోట్ల రేంజ్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారులకు ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగించాం. పోస్టులు ఖాళీగా ఉండడంతో ఉన్న అధికారులతో కొనసాగిస్తున్నాం. జిల్లాలోని పోస్టుల ఖాళీల వివరాలను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలో భర్తీ కానున్నాయి.
– ప్రభాకర్, డీఎఫ్‌వో, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment