ఓయూ లా కాలేజీలో పరీక్షల విభాగం బాగోతం | Osmania University examinations section playing with students future | Sakshi
Sakshi News home page

ఇలాగైతే ఎ‘లా’?

Published Mon, Dec 11 2017 3:39 AM | Last Updated on Mon, Dec 11 2017 9:18 AM

Osmania University examinations section playing with students future - Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ (ఫైల్‌ ఫొటో)

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కాలేజీలో ఓ విద్యార్థి ఎల్‌ఎల్‌ఎం రెండో సెమిస్టర్‌ పరీక్షలు రాశాడు. గతంలో ఫెయిలైన నాలుగో పేపర్‌ ఈసారి బాగా రాశాడు. కానీ ఫెయిలయ్యాడు. అనుమానం వచ్చి తన జవాబు పత్రాల ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కాపీ వచ్చాక చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే అసలు ఆ జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేయనేలేదు. ఫలితాల్లో మాత్రం 23 మార్కులు వచ్చి, ఫెయిలైనట్లు చూపారు.

ఎల్‌ఎల్‌ఎం మూడో సెమిస్టర్‌ పూర్తిచేసిన మరో విద్యార్థి ఐదో పేపర్‌లో ఫెయిలయ్యాడు. సందేహంతో జవాబు పత్రం ఫొటోకాపీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తాను రాసింది ఎల్‌ఎల్‌ఎం కోర్సు మూడో సెమిస్టర్‌ పరీక్షలుకాగా.. అధికారులు పంపింది ఎల్‌ఎల్‌బీ కోర్సు మూడో సెమిస్టర్‌ పరీక్షలు రాసిన మరో విద్యార్థి జవాబు పత్రం. ఏకంగా కోర్సు, జవాబుపత్రం
మారినా.. ఆ మార్కులు చూపించి ఫెయిల్‌ చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో న్యాయ విద్య పరీక్షల మూల్యాంకనంలో తప్పిదాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. ఈ రెండు ఉదాహరణలే కాదు.. అధికారుల తప్పిదాల కారణంగా చాలా మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎల్‌ఎల్‌బీ ఐదో సంవత్సరం ఫలితాల్లో తాను ఫెయిలైనట్లు చూపడంతో.. మరో విద్యార్థి రీ వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో 15 మార్కులు తక్కువగా వేసినట్లు బయటపడింది. ఆ విద్యార్థికి తొలుత వేసింది 37 మార్కులేకాగా.. రీ వ్యాల్యుయేషన్‌లో లెక్కతేలిన మార్కులు 52 కావడం గమనార్హం.

నిర్లక్ష్యానికి పరాకాష్టగా..
ఉస్మానియా వర్సిటీ పరీక్షల విభాగం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా తయారైందని విమర్శలు వస్తున్నాయి. అధికారులు, ప్రొఫెస ర్ల తప్పిదాలతో అనేక మంది విద్యార్థులు నష్టపోతున్నారు. పరీక్షలు బాగా రాసినా జవాబు పత్రాలను సరిగా మూల్యాంకనం చేయక.. కొ న్నిసార్లయితే మూల్యాంకనమే చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన చోట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాదే కాదు.. చాలా సంవత్సరాలుగా ఇదే తరహా పరిస్థితి ఉంటోందని విద్యార్థులు వాపోతున్నారు.

తప్పుల మీద తప్పులు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కాలేజీల్లో మే నెలలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు జరిగాయి. వీటికి దాదాపు 7 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు ఆగస్టులో విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల్లో కొందరు జవాబు పత్రాల ఫొటో కాపీల కోసం దరఖాస్తు చేయడంతో అధికారులు, ప్రొఫెసర్ల బాగోతం బయటపడింది. మే 22న ఎల్‌ఎల్‌ఎం రెండో సెమిస్టర్‌ నాలుగో పేపర్‌ పరీక్షకు సంబంధించి ఓ విద్యార్థి జవాబు పత్రాన్ని మూల్యాంకనమే చేయలేదు. మార్కుల షీట్‌లో మార్కులు కూడా వేయలేదు. కానీ ఫలితాల్లో మాత్రం ఆ సబ్జెక్టులో కొన్ని మార్కులను చూపించి ఫెయిల్‌ చేశారు. మే 19వ తేదీన జరిగిన ఎల్‌ఎల్‌ఎం మూడో సెమిస్టర్‌ ఐదో పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి జవాబు పత్రం గల్లంతైంది. అదే తేదీన జరిగిన ఎల్‌ఎల్‌బీ మూడో సెమిస్టర్‌ పరీక్షలకు హాజరైన వేరే విద్యార్థి మార్కుల షీట్‌లో పేర్కొన్న మార్కులను ఎల్‌ఎల్‌ఎం విద్యార్థికి వేసి ఫెయిల్‌ చేశారు. అంతేకాదు జవాబు పత్రం ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ ఎల్‌ఎల్‌ఎం విద్యార్థికి ఇచ్చింది కూడా ఎల్‌ఎల్‌బీ మూడో సెమిస్టర్‌ పరీక్ష రాసిన వేరే విద్యార్థి జవాబు పత్రం. మరో విచిత్రం ఏమిటంటే.. కనీసం ఈ మారిన జవాబు పత్రాన్ని కూడా మూల్యాంకనం చేయలేదు. కనీసం మార్కుల షీట్‌లో మార్కులు వేయలేదు, ఎగ్జామినర్, స్క్రూటినైజర్‌ సంతకాలు కూడా లేవు. కానీ ఇష్టం వచ్చినట్లుగా ఏవో మార్కులు వేసి ఫెయిల్‌ చేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకునేదెవరు?
తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొనేందుకు వెళ్లిన విద్యార్థులకు సమాధానమిచ్చే వారే లేకుండా పోయారు. పరీక్షల విభాగంలో అడిగితే అధికారులెవరూ పెద్దగా స్పందించడం లేదు. దాంతో విద్యార్థులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. అసలు ఎల్‌ఎల్‌బీ పరీక్షల్లో రీవెరిఫికేషన్‌కు అవకాశమిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు... ఎల్‌ఎల్‌ఎంలో రీ వెరిఫికేషన్‌కు అవకాశమివ్వడం లేదు. రీ వెరిఫికేషన్‌కు అవకాశముంటే... మార్కులు నష్టపోయిన విద్యార్థుల జవాబు పత్రాలను మరోసారి పరిశీలించేవారు. దాంతో ముందుగా మూల్యాంకనం చేయకపోతే.. రీవెరిఫికేషన్‌లో మూల్యాంకనం చేసి మార్కులు ఇచ్చే అవకాశం ఉండేది. కానీ ఎల్‌ఎల్‌ఎంలో ఆ అవకాశం లేకపోవడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement