సార్ బాటలో పయనిద్దాం: కోదండరాం
హైదరాబాద్ : ప్రభుత్వం అంటే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని టి.జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం అభిప్రాయపడ్డారు. మంగళవారం హైదరాబాద్లోని టి.జేఏసీ కార్యాలయంలో ప్రొ. కె.జయశంకర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రొ.కె.జయశంకర్ చిత్రపటానికి ప్రొ.కోదండరాం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రొ. కోదండరాం మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధి కోసం మరింత సంఘటితంగా ప్రయత్నించాలని ప్రొ.జయశంకర్ సార్ చెప్పారని ఈ సందర్భంగా కోదండరాం గుర్తు చేశారు. ఆయన బాటలోనే పయనిద్దామని తెలంగాణ ప్రజలకు కోదండరాం పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడం ఓ ఎత్తు అయితే.... రాష్ట్రాభివృద్ధి సాధించడం మరో ఎత్తు అని తెలిపారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు లబ్ధి చేకూర్చే తెలంగాణ వద్దని ప్రభుత్వ నేతలకు సూచించారు. అలాగే ఏ అంశంపైన అయినా తాము తొందరపడి మాట్లాడమని... అధ్యయనం చేశాకే ఏ విషయంపైన అయినా స్పందిస్తామని చెప్పారు. మసుషులు ఎవరూ శాశ్వతం కాదని... వారి ఆలోచనలే ఎప్పటికీ నిలిచి ఉంటాయని కోదండరాం పేర్కొన్నారు.