
స్థానిక రిజర్వేషన్లపై సమగ్ర చర్చ జరగాలి
ఈ చర్చను జోనల్ అంశానికి పరిమితం చేయటం సరికాదు
►జోనల్ వ్యవస్థ రద్దుపై హడావుడిగా నిర్ణయం తీసుకోవద్దు
► దీని వల్ల తెలంగాణ సమాజానికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుంది
► తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్: స్థానిక రిజర్వేషన్లకు సంబంధించిన చర్చను జోనల్ అంశానికి పరిమితం చేయటం సరికాదని, అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలించి దీనిపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గురువారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యావంతుల వేదిక గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘జోనల్ వ్యవస్థ రద్దు’ అనే అంశంపై విద్యార్థి, ఉద్యోగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. జోనల్ వ్యవస్థ రద్దుపై హడావుడి నిర్ణయం తీసుకుంటే తెలంగాణ సమాజానికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుందన్నారు.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా గత అనుభవాలు, కోర్టు తీర్పులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. స్థానిక రిజర్వేషన్ల అంశాన్ని చారిత్రక దృష్టితో చూడాలని, దీనిపై అధ్యయనం చేసి చర్చించాలని చెప్పారు. ముందుగా పోస్టుల విషయంలో అవి ఏ స్థాయి పోస్టులో నిర్ణయించాలన్నారు. స్థానిక రిజర్వేషన్లపై అధ్యయనం చేసి.. ఆ రిపోర్టును ఢిల్లీకి పంపి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ స్థానిక రిజర్వేషన్లను అమలు చేయకపోవటం వల్లే తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ముఖ్యమైన రంగాల్లో స్థానికులకు అవకాశం ఇవ్వలేదని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే.. ముల్కి రూల్స్ ప్రకారం 12 ఏళ్లు నివసిస్తే స్థానికులుగా.. ఆర్టికల్ 371డీ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాలుగేళ్లు నివసిస్తే స్థానికులుగా నిర్ణయించారని, ఏది ఏమైనప్పటికీ స్థానిక రిజర్వేషన్లపై సమగ్రమైన చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఆర్‌ఎంపీ, పీఎంపీలను అరెస్టు చేయటం సరికాదని, వారికి ప్రభుత్వం శిక్షణ ఇవ్వటంతో పాటు సర్టిఫికెట్లను జారీ చేసి వైద్యం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు. గుర్తింపు కోసం వారు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. ప్రొఫెసర్ పురుషోత్తం మాట్లాడుతూ సమగ్రమైన అధ్యయనం చేయకుండా జోనల్ వ్యవస్థను రద్దు చేయాలనుకోవటం సరికాదన్నారు. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తటంతో పాటు వెనుకబడిన జిల్లాల్లోని విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక నగర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్, వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురిజాల రవీందర్‌రావు, ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదయ్య, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత మల్లిఖార్జున్, తెలంగాణ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.