ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. చిత్రంలో కోదండరాం. హరగోపాల్, గీతారెడ్డి, దాసోజు శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో బాలిక గ్యాంగ్ రేప్ ఘటనతో తల్లిదండ్రులు పట్టపగలు కూడా ఆడపిల్లలను బయటకు పంపేందుకు భయపడుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ’బచావో హైదరాబాద్’ పేరుతో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రేవంత్‌రెడ్డితోపాటు ప్రొఫెసర్ హరగోపాల్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మల్లు రవితోపాటు సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, టీడీపీ, బీఎస్పీ, వైఎస్సార్టీపీ నేతలు హాజరయ్యారు.
ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్‌కు సంబంధించిన ఎడిటెడ్, లిమిటెడ్ వీడియోను ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగానే లీక్ చేశారని ఆరోపించారు.
గ్యాంగ్‌రేప్ ఎక్కడ జరిగిందో ఇప్పటికీ హైదరాబాద్ సీపీ చెప్పడం లేదని, దేవుని పేరును ఆలంబనగా చేసుకొని ఎదగాలని చూసే పార్టీ కూడా గ్యాంగ్‌రేప్ జరిగిన ప్రదేశం గురించి అడగడం లేదన్నారు. నిజాయితీగా పనిచేసే ఐపీఎస్ అధికారులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారని, రిటైర్డ్ అధికారులకు మళ్లీ పోస్టింగ్‌లు ఇచ్చి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు.
జూబ్లీహిల్స్ ఘటనలో 8 మంది నిందితులుగా ఉంటే ఆరుగురిపై కేసు పెట్టారని, మిగతా ఇద్దరు ఏమయ్యారని ప్రశ్నించారు. ఎయిర్ పోర్ట్‌లో కేసీఆర్ బంధువులు పబ్‌లు పెట్టి అడ్డగోలుగా నడుపుతున్నారని, ఎయిర్‌పోర్టు పార్కింగ్ వద్ద గల పబ్‌లో అరాచకం నడుస్తోందని, సర్కారును నడిపేవాళ్లే నేరగాళ్లుగా మారారని ధ్వజమెత్తారు.
మహిళా సమస్యలపై సమీక్షల్లేవు:కోదండరాం
మహిళల సమస్యలపై ఎనిమిదేళ్లుగా ఒక్క సమీక్ష కూడా జరగలేదని, చివరిసారిగా రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం.కోదండరాం అన్నారు. జూబ్లీహిల్స్ కేసుతోపాటు ప్రతి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.గీతారెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్, ఎంఐఎంకు చెందిన నేతల కొడుకులు, మనవళ్లు ఉన్న జూబ్లీహిల్స్ కేసులో న్యాయం జరిగేలా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ ఉన్నతమైన సమాజం వస్తుందని ఆశించామని, కానీ పరిస్థితి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా దాసోజు శ్రావణ్ తీర్మానాలు ప్రవేశపెట్టగా, సభ్యులు ఆమోదించారు. సమావేశంలో ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, మల్లు రవి (కాంగ్రెస్), బాలమల్లేష్ (సీపీఐ), జ్యోత్స్న (టీడీపీ), తూడి దేవేందర్ రెడ్డి (వైఎస్సార్‌టీపీ), మామిడాల జ్యోతి (బీఎస్‌పీ) తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment