అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్న ఉద్యోగులను అరెస్టు చేస్తున్న పోలీసులు
కవాడిగూడ: పీఆర్‌సీ హామీని అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి.. సమాన వేతనం వర్తింప చేయాలని, వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఆందోళనకారులు అసెంబ్లీ వద్దకు చేరు కోకుండా ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి ఆయా పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. అయితే కొందరు టీచర్లు పోలీసుల కళ్లుగప్పి ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్దకు చేరుకున్నారు.
వీరిని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. సుమారు రెండు వేల మంది ధర్నా చౌక్‌కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పలువురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి పలు పోలీస్‌స్టేషన్లకు తరించారు. సాయంత్రం 6 గంటలకు విడిచిపెట్టారు. గోషామహల్ స్టేషన్‌లో ఓయూ మాజీ పీడీఎస్‌యూ నాయకురాలు పూలన్ ధూంధాం నిర్వహించి ఆడిపాడారు. అరెస్టయిన వారిని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు కె.గోవర్ధన్ పరామర్శించారు. ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీపీటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment