రైతు సమస్యల పరిష్కారానికే ‘కిసాన్ సమ్మేళన్’: కోదండరామ్
హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించేందుకు ఏప్రిల్‌లో జరగనున్న ‘కిసాన్ సమ్మేళన్’ దోహదపడగలదని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మన రాష్ట్ర ఉత్పత్తిలో 13 శాతం మాత్రమే వ్యవసాయం ఆదాయం ఉందని, దానిపైనే 61 శాతం మంది ఆధారపడి బతుకు గడుపుతున్నారని వెల్లడించారు. గ్రామాల్లోకి వెళ్తే కరువు పరిస్థితుల తీవ్రత తెలుస్తోందన్నారు. నీరులేక, పెట్టుబడులు మునిగిపోయి, తినడానికి గింజలులేక రైతులు దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి సందర్భంలో కిసాన్ స్వరాజ్ సమ్మేళనం హైదరాబాద్‌లో నిర్వహించడం వల్ల రైతు సమస్యలకు పరిష్కారం చూపవచ్చునన్నారు. ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు ‘అలయెన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ ’(ఎఎస్‌హెచ్‌ఎ), రైతు స్వరాజ్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న 3వ అఖిల భారత ‘కిసాన్ స్వరాజ్ సమ్మేళనం’ వివరాలను మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంబంధిత సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమ రిసెప్షన్ కమిటీ సభ్యుడు కోదండరామ్ మాట్లాడారు. సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు కిరణ్ విస్సా, కన్నెగంటి రవి, మానవహక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. జీవన్ కుమార్, తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి ప్రసాదరావులు మాట్లాడారు.