Kisan Sammelan
-
రైతు వ్యతిరేక చట్టాలు వద్దేవద్దు
న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని 14 ప్రతిపక్షాల నేతలు డిమాండ్ చేశారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు సాగిస్తున్న పోరాటానికి సంఘీభావంగా వారు శుక్రవారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కిసాన్ సంసద్‌లో (రైతుల పార్లమెంట్) పాల్గొన్నారు. అంతకముందు ప్రతిపక్ష నేతలంతా పార్లమెంట్ హౌస్ వద్ద కలుసుకొని, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకున్నారు. అనంతరం బస్సులో జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు. ‘నల్ల’ వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు అండగా నిలవాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దేశంలోని రైతులందరికీ తమ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. నల్ల సాగు చట్టాలపై కేవలం చర్చలతో కాలయాపన చేస్తే సరిపోదని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెగసస్ నిఘా అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడానికి ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించారు. దేశంలో ప్రజల ఫోన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిఘా పెట్టారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కిసాన్ సంసద్‌లో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, శివసేన పార్టీ నాయకుడు సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత మనోకుమార్ ఝా, సీపీఎం నుంచి ఎలమారమ్ కరీమ్, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం, ఐయూఎంఎల్ నేత మహమ్మద్ బషీర్, డీఎంకే నాయకుడు తిరుచ్చి శివ తదితరులు పాల్గొన్నారు. టీఎంసీ, ఆప్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కిసాన్ సంసద్ వద్ద ప్రతిపక్ష నేతలతో కలిసి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ -
రైతు సమస్యల పరిష్కారానికే ‘కిసాన్ సమ్మేళన్’: కోదండరామ్
హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించేందుకు ఏప్రిల్‌లో జరగనున్న ‘కిసాన్ సమ్మేళన్’ దోహదపడగలదని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మన రాష్ట్ర ఉత్పత్తిలో 13 శాతం మాత్రమే వ్యవసాయం ఆదాయం ఉందని, దానిపైనే 61 శాతం మంది ఆధారపడి బతుకు గడుపుతున్నారని వెల్లడించారు. గ్రామాల్లోకి వెళ్తే కరువు పరిస్థితుల తీవ్రత తెలుస్తోందన్నారు. నీరులేక, పెట్టుబడులు మునిగిపోయి, తినడానికి గింజలులేక రైతులు దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో కిసాన్ స్వరాజ్ సమ్మేళనం హైదరాబాద్‌లో నిర్వహించడం వల్ల రైతు సమస్యలకు పరిష్కారం చూపవచ్చునన్నారు. ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు ‘అలయెన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ ’(ఎఎస్హెచ్ఎ), రైతు స్వరాజ్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న 3వ అఖిల భారత ‘కిసాన్ స్వరాజ్ సమ్మేళనం’ వివరాలను మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంబంధిత సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమ రిసెప్షన్ కమిటీ సభ్యుడు కోదండరామ్ మాట్లాడారు. సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు కిరణ్ విస్సా, కన్నెగంటి రవి, మానవహక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. జీవన్ కుమార్, తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి ప్రసాదరావులు మాట్లాడారు.