న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని 14 ప్రతిపక్షాల నేతలు డిమాండ్ చేశారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు సాగిస్తున్న పోరాటానికి సంఘీభావంగా వారు శుక్రవారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కిసాన్ సంసద్‌లో (రైతుల పార్లమెంట్) పాల్గొన్నారు. అంతకముందు ప్రతిపక్ష నేతలంతా పార్లమెంట్ హౌస్ వద్ద కలుసుకొని, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకున్నారు. అనంతరం బస్సులో జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు. ‘నల్ల’ వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు అండగా నిలవాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
దేశంలోని రైతులందరికీ తమ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. నల్ల సాగు చట్టాలపై కేవలం చర్చలతో కాలయాపన చేస్తే సరిపోదని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెగసస్ నిఘా అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించడానికి ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించారు. దేశంలో ప్రజల ఫోన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిఘా పెట్టారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కిసాన్ సంసద్‌లో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, శివసేన పార్టీ నాయకుడు సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత మనోకుమార్ ఝా, సీపీఎం నుంచి ఎలమారమ్ కరీమ్, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం, ఐయూఎంఎల్ నేత మహమ్మద్ బషీర్, డీఎంకే నాయకుడు తిరుచ్చి శివ తదితరులు పాల్గొన్నారు. టీఎంసీ, ఆప్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
కిసాన్ సంసద్ వద్ద ప్రతిపక్ష నేతలతో కలిసి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
Comments
Please login to add a commentAdd a comment