ట్యాంక్‌బండ్‌ అష్ట దిగ్బంధం | Police who did not allow the Million march | Sakshi
Sakshi News home page

ట్యాంక్‌బండ్‌ అష్ట దిగ్బంధం

Published Sat, Mar 10 2018 1:38 AM | Last Updated on Tue, Aug 28 2018 5:36 PM

Police who did not allow the Million march - Sakshi

గోశాల వద్ద ట్యాంక్‌బండ్‌కు వెళ్లకుండా కంచె వేస్తున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి సభ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. శనివారం తెలంగాణ జేఏసీ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఈ సభకు పోలీసులు ఇప్పటికే అనుమతి నిరాకరించారు. అయినా నిర్వహించి తీరతా మని ఆయా పార్టీల నేతలు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌కు దారితీసే మార్గాలన్నింటినీ ముళ్లకంచెలతో మూసివేశారు. ఇందిరాపార్కు సమీపంలోని కట్ట మైసమ్మ టెంపుల్‌ వద్ద నుంచి మెట్ల ద్వారా పైకి వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. గోశాల వద్ద కూడా ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఘాట్‌ వద్ద రోడ్డు మూసివేసి లోయర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా రాకపోకలను నియంత్రించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను పూర్తిగా నియంత్రించనున్నట్లు పోలీసులు తెలిపారు. అటు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నాయకుల నివాసాల వద్ద నిఘా 
హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం, విద్యానగర్‌లోని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యాలయాల వద్ద పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టారు. తెలంగాణ ప్రజాఫ్రంట్‌ నాయకులు నలమాస కృష్ణ, రవిచంద్రలను నారాయణగూడలో వారి నివాసాల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తార్నాకలో ప్రొఫెసర్‌ కోదండరాం ఇంటి చుట్టూ మఫ్టీ పోలీసులు మోహరించారు. అర్ధరాత్రి తర్వాత ఏ సమయంలోనైనా ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలోని న్యూడెమోక్రసీ నాయకులు రాంచంద్రయ్య, లింగ్యాలతోపాటు మరో 150 మందిని అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా పీడీఎస్‌యూ నాయకులు సురేశ్‌ను కాకతీయ వర్సిటీలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఖమ్మం, భువనగిరి,కొత్తగూడెం తదితర జిల్లాల సీపీఐ కార్యదర్శులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. విద్యానగర్‌లోని మార్క్స్‌ భవన్‌ వద్ద పీవోఎల్‌ రాష్ట్ర అధ్యక్షుడు హన్మేష్‌ను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. చాలామంది నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

అడుగడుగునా బలగాలు 
నగర పోలీసులు, రాష్ట్ర, కేంద్ర బలగాలతో కలిపి మొత్తం 12 వేలకు పైగా సిబ్బందితో రాజధాని నగరాన్ని దాదాపు అష్టదిగ్బంధనం చేశారు. ఓయూతోపాటు కొన్ని సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అ«ధికారులు వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 3 వేల మందిని నియమిస్తున్నారు. ర్యాలీలు జరుగుతాయని భావిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో చోటుచేసుకున్న ఉదంతాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూఫ్‌ టాప్‌ వాచ్, ఎక్కడికక్కడ కార్డన్‌ ఏరియాలను ఏర్పాటు చేశారు. నగరంలోని కీలక ప్రాంతాల్లోని ఎత్తైన భవనాలపై బైనాక్యులర్లతో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. సమాచార మార్పిడి కోసం వీరికి సెల్‌ఫోన్లు, మాన్‌ప్యాక్‌(వైర్‌లెస్‌ సెట్స్‌) అందించారు. మూడు కమిషనరేట్లలో ఉన్న సిబ్బందికి ‘స్టాండ్‌ టు’ప్రకటించి కచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. అశ్వక దళాలు, టియర్‌ గ్యాస్‌ స్క్వాడ్స్, వాటర్‌ క్యానన్స్, వజ్ర వాహనాలను అందుబాటులో ఉంచుతున్నారు. మిలియన్‌ మార్చ్‌లో పాల్గొనేందుకు వచ్చే వారిని అడ్డుకునేందుకు శివారు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. నగరంతోపాటు శివార్లలో మొత్తం 350 పోలీసు చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. 

నిర్వహించి తీరుతాం
టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం 
ప్రభుత్వం మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి యాత్రకు అనుమతి నిరాకరించినా నిర్వహించి తీరుతామని టీజేఏసీ చైర్మన్‌ ఎం.కోదండరాం స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి ఆయన తార్నాకలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్‌ మార్చ్‌ను గుర్తు చేసుకునేందుకు స్ఫూర్తి యాత్ర నిర్వహించేందుకు అనుమతి కోరామన్నారు. ప్రభుత్వం దాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. సీఎం ఆందోళనలకు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద అనుమతులు కావాలి కానీ చరిత్రను గుర్తుచేసుకునే ఈ సభకు అనుమతి నిరాకరించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు 
మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి సభకు అనుమతి లేదు. ట్యాంక్‌బండ్‌పై ఎవరైనా సభ లు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే అరెస్టు చేస్తాం. మధ్య మండలంలోని కీలక ప్రాంతాలకొచ్చే వాహనాలను తనిఖీలు చేస్తాం. ట్యాంక్‌ బండ్‌పై రాకపోకలపై శనివారం ఉదయం నిర్ణయం తీసుకుంటాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 
– జోయల్‌ డెవిస్, మధ్య మండల డీసీపీ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement