పాడి రైతులకు 60 కోట్లు ఇవ్వలేరా?
♦ తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రొఫెసర్ కోదండరాం
♦ పాల ప్రోత్సాహకానికి సీలింగ్ పెట్టడం సరికాదని వ్యాఖ్య
♦ ‘విజయ’కు పాలు పోసే రైతులందరికీ ప్రోత్సాహకం ఇవ్వాలని డిమాండ్
♦ కర్ణాటక మాదిరిగా రాష్ట్రంలోనూ మధ్యాహ్న భోజనంలో పాలు ఇవ్వాలని వినతి
సాక్షి, హైదరాబాద్: బడా పారిశ్రామికవేత్తలకు రూ. వేల కోట్లు ఇస్తున్న ప్రభుత్వం.. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు రూ. 60 కోట్లు ఇవ్వడానికి ఎందుకు జంకుతోందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నిలదీశారు. పాల ప్రోత్సాహకానికి 25 లీటర్ల సీలింగ్ పెట్టడం సమంజసం కాదన్నారు. విజయ డెయిరీకి అనుబంధంగా ఉండే సహకార, ప్రైవేటు డెయిరీలకే పాల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని.. కరీంనగర్, మదర్ డెయిరీలకు ప్రోత్సాహకం ఇవ్వకుండా ఇతరత్రా ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. పాల ప్రోత్సాహకపు సొమ్మును రైతు బ్యాంకు ఖాతాలో నేరుగా వేయాలని కోరారు.
తెలంగాణ ఆదర్శ పాడి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కందాల బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో కోదండరాం మాట్లాడారు. రైతు ఆత్మహత్యలు ఆగాలంటే వ్యవసాయంతోపాటు పాడి, కోళ్ల రంగాలను అభివృద్ధి చేయాలని, కోళ్ల పరిశ్రమలో చిన్న రైతులకు ఏవిధంగా లబ్ధి చేకూర్చాలన్న దానిపై సర్కారు ఆలోచన చేయాలన్నారు. 85 శాతం సన్నచిన్నకారు రైతులు 66 శాతం పాలు పోస్తున్నార ని చెప్పారు. ప్రైవేటు సంస్థలు ముందుకు రావడంతో రాష్ట్రంలో విజయ డెయిరీ పాల సేకరణ చితికిపోయిందన్నారు.
ఈ పరిస్థితుల్లో విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహకం ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు ఈ చొరవను ప్రభుత్వం కొనసాగించాలన్నారు. ఇతర రాష్ట్రాల పోటీ నుంచి విజయ డెయిరీని కాపాడుకోవాలని కోరారు. ప్రపంచంలో పాల పొడి విక్రయంలో సంక్షోభం ఏర్పడిందనీ.. దీంతో అమూల్, నందిని వంటి ఇతర రాష్ట్రాల డెయిరీలు మన రాష్ట్రంలోకి పాలను డంప్ చేస్తున్నాయని అన్నారు. దీనివల్ల విజయ డెయిరీ సహా ఇతర సహకార పాల ఉత్పత్తిదారులు నష్టపోతున్నారన్నారు. అందువల్ల బయటి రాష్ట్రాల డెయిరీలకు షరతులు విధించాలని, మన రాష్ట్రంలోని రైతుల నుంచే పాలను సేకరించాలని ఆదేశించాలన్నారు. లేకుంటే ప్రత్యేక పన్ను వేసి అడ్డుకోవాలన్నారు.
అలాగే విజయ డెయిరీ పాల ఏజెంట్ల కమీషన్ పెంచాలన్నారు. కర్ణాటకలో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పాలు సరఫరా చేస్తున్నారని.. దీనివల్ల అక్కడ రోజుకు 10 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతున్నాయన్నారు. తెలంగాణలోనూ ఇలాగే చేస్తే విజయ డెయిరీ పాల సేకరణ పెరుగుతుందన్నారు. విద్యార్థులకూ ఆరోగ్యం పెరుగుతుందన్నారు. కందాల బాల్‌రెడ్డి మాట్లాడుతూ పాల ప్రోత్సాహకాన్ని ప్రైవేటు డెయిరీలకు ఇవ్వాలా? వద్దా? అని నిర్ధారించేందుకు ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని రెండు మూడు రోజుల్లో కలసి నివేదిక ఇస్తామన్నారు. ప్రభుత్వం పాల ప్రోత్సాహకంపై మార్పులు చేర్పులు చేసే వరకు ఇప్పటివరకు ఉన్న జీవోనే అమలు చేయాలని కోరారు.