హైదరాబాద్: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టి.జేఏసీ) రాష్ట్రంలో వాచ్‌డాగ్ పాత్రను పోషిస్తుందని ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ తెలిపారు. ప్రజల ఆకాంక్ష సాధనకు ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం పునాదిగా ప్రజలే కేంద్రంగా ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ జేఏసీ ప్రధాన కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ సుదీర్ఘంగా సమావేశమైంది.
ఇటీవలి కాలంలో జేఏసీ నుంచి పలు ఉద్యోగ సంఘాలు బయటకు వెళ్లిన నేపథ్యంలో.. తాజాగా జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి దాదాపు ఇరవైకి పైగా ప్రజా సంఘాలు వివిధ జేఏసీ నాయకులు హాజరై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం చైర్మన్ ప్రొ.ఎం.కోదండరామ్ జేఏసీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇక నుంచి జేఏసీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలు తమపై నమ్మకముంచి అనేక పిలుపులకు స్పందించి మద్దతుగా నిలిచారు కాబట్టి వారికి అండగా నిలుస్తామన్నారు. రాష్ట్రంలో సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ లోటుపాట్లు ఎత్తిచూపాలని స్థూలంగా నిర్ణయించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో టీ-జేఏసీ నిర్మాణాన్ని విస్తృత పరచాలని, అందుకోసం నిర్మాణాత్మక కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. జేఏసీ నుంచి ఇటీవలి కాలంలో పలు ఉద్యోగ సంఘాలు వెళ్లిపోవడాన్ని తప్పు పట్టడంలేదని, ప్రతీ సంఘానికి స్వేచ్ఛ ఉంటుందని, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందన్నారు. అయితే వారు ఇన్నాళ్లు తమతో కలిసి నిర్వహించిన పాత్రను గుర్తు పెట్టుకుంటామన్నారు. అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏ ప్రయత్నాలోనైనా తమవంతు భాగస్వామ్యం నిర్వహిస్తామన్నారు. టీచర్ల నియామకాలు చేపట్టడంతోపాటు గ్రూప్ -2 పోస్టులు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లోని అన్ని పోస్టులకు వయోపరిమితి పెంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రొ.కోదండరాం విజ్ఞప్తి చేశారు.
రాజకీయపార్టీలను జేఏసీలోకి చేర్చుకోం..
తమ టీంను ఇక నుంచి టీ-జేఏసీగానే పిలవాలని కోదండరామ్ కోరారు. జేఏసీలోకి కలిసి వచ్చే ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకుంటామని, రాజకీయ పార్టీలను మాత్రం చేర్చుకోబోమన్నారు. అయితే అంశాల ఆధారంగా అవసరమైనప్పుడు రాజకీయపార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్న ఇరిగేషన్ పాలసీపై అధ్యయనం చేసిన తర్వాతనే తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. దీనిపై అనుభవజ్ఞులైన వారితో చర్చించి అభిప్రాయం వ్యక్తంచేస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై అసెంబ్లీలో సమగ్రమైన చర్చ జరగాలని, అలాగే తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఎమ్మెల్యేలకు అందజేస్తామన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో పశువులకు మేత విషయమై త్వరలో రెవెన్యూమంత్రితో సమావేశమవుతామన్నారు.
రాష్ట్ర పురోభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం : ప్రొ.కోదండరాం
Published Sun, Mar 27 2016 1:52 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement