group 2 posts
-
గ్రూప్ పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
-
గ్రూప్ 2 ఉద్యోగాలు: భారీ మోసం
సాక్షి, సిటీబ్యూరో: టీఎస్పీఎస్సీ గ్రూప్–2 నోటిఫికేషన్లో భాగంగా ఎమ్మార్వో కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన ప్రకాష్ వర్మ అనే వ్యక్తిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతను నకిలీ గుర్తింపుకార్డు తయారు చేసుకోవడంతో పాటు అనేక మందికి బోగస్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినట్లు డీసీపీ రాధాకిషన్‌రావు మంగళవారం వెల్లడించారు. మెదక్ జిల్లాకు చెందిన ప్రకాష్ వర్మ తండ్రి ప్రేమ్ శ్యామ్ కుమార్ ఆర్టీసీ ఉద్యోగిగా పని చేసి రిటైర్ అయ్యారు. అతడి తల్లి ఆరోగ్య శాఖలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పని చేసే వారు. ఆమె బదిలీ నేపథ్యంలో 15 ఏళ్ల క్రితం సిటీకి వలసవచ్చి సుచిత్ర వద్ద స్థిరపడింది. 2013లో తల్లి చనిపోవడంతో ఆ ఉద్యోగం కోసం ప్రయత్నించిన ప్రకాష్ ఉద్యోగం రాకపోవడంతో ప్రభుత్వ కార్యకలాపాలు, అధికారులతో వ్యవహరించాల్సిన తీరు తెన్నులు తెలుసుకున్నాడు. ఈ ‘అనుభవంతో’ అమాయకులను మోసం చేయడానికి రంగంలోకి దిగాడు. తాను కోఠి ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నట్లు గుర్తింపుకార్డు తయారు చేసుకున్నాడు. దీనిని నిరుద్యోగులకు చూపించి తానో ప్రభుత్వోద్యోగినని, అధికారులతో సంబంధాలు ఉన్నాయని నమ్మించాడు. 2016 గ్రూప్–2 నోటిఫికేషన్ ఆధారంగా దొడ్డిదారిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎర వేశాడు. దాదాపు ఎనిమిది మంది నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేసి వారిని ఖైరతాబాద్ ఎమ్మార్వో ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్స్‌గా నియమిస్తున్నట్లు బోగస్ నియామక పత్రాలు అందజేశాడు. వీటితో అక్కడికి వెళ్లిన బా«ధితులు మోసపోయినట్లు గుర్తించారు. వీరి ఫిర్యాదుతో పంజగుట్ట, పేట్ బషీరాబాద్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ప్రకాష్ కదలికలపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు ఎల్.భాస్కర్‌రెడ్డి, ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్, వి.కిషోర్ వలపన్ని పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.3.5 లక్షల నగదు, నకిలీ గుర్తింపుకార్డు, నియామక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. -
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ టోకరా!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 1999 గ్రూప్–2 పోస్టులకు సంబంధించి తాజాగా విడుదల చేసిన జాబితాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా జాబితాను రూపొందించడంతో తాము అవకాశాలు కోల్పోతున్నామని ఆ పరీక్షల్లో మెరిట్ సాధించి నిరుద్యోగులుగా ఉన్న అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. 78 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులతోపాటు మరో 70 ఎగ్జిక్యూటివ్ పోస్టులు మెరిట్ జాబితాల్లో ఉన్నవారికి దక్కకుండా పోతున్నాయని అంటున్ను. ఆదినుంచి వివాదాలమయమే.. 1999లో 104 ఎగ్జిక్యూటివ్, 141 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి 2000లో పరీక్ష నిర్వహించింది. అదే ఏడాది ఎగ్జిక్యూటివ్ పోస్టులను, 2002లో ఏఎస్ఓ పోస్టులను భర్తీ చేసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో 2004లో 973 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 199 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఇదే నోటిఫికేషన్‌కు జతచేసి మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చారు. అయితే మెరిట్లో తమకంటే తక్కువగా ఉన్నవారిని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపిక చేయడం వల్ల తాము నష్టపోయామని ఏఎస్‌ఓలుగా ఎంపికైనవారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈలోగా ఏపీపీఎస్సీ ఇదే నోటిఫికేషన్ కింద 2011లో మరో 111 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. 2015లో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు వాద, ప్రతివాదనల అనంతరం 2015, ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు మళ్లీ జాబితాలు రూపొందించి పోస్టులు కేటాయించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జాబితాలు రూపొందించినా పలు లోపాలతో వాటిపై మళ్లీ వివాదాలు ఏర్పడ్డాయి. ఫలితంగా విడుదల చేసిన జాబితాలను ఏపీపీఎస్సీ ఆరుసార్లు మార్పు చేసింది. చివరికి 2000లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు పొందిన వారిని, సుప్రీంకోర్టులో కేసు వేసి తమకు ఎగ్జిక్యూటివ్ పోస్టులు వద్దన్న ఏఎస్ఓలను మినహాయించి కొత్త జాబితా విడుదల చేసింది. మొత్తం 1424 పోస్టులను నోటిఫై చేసిన ఏపీపీఎస్సీ తాజా జాబితా నుంచి 487 పోస్టులను మినహాయించింది. క్యారీఫార్వర్డ్ అయ్యాయన్న కారణంతో వీటిని మినహాయించి 937 పోస్టులకు మాత్రమే జాబితా ఇచ్చింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా క్యారీఫార్వర్డ్ పోస్టులతో సహా మొత్తం అన్ని పోస్టులకూ కొత్తగా జాబితా రూపొందించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా గతంలో అన్యాయం జరిగిందన్న ఏఎస్‌ఓలతో మాట్లాడి ఎగ్జిక్యూటివ్ పోస్టులు కావాలో వద్దో ఆప్షన్ తీసుకొని ఆ మేరకు మార్పులు చేయాలని సూచించింది. అయితే ఏపీపీఎస్సీ 141 మంది ఏఎస్ఓల నుంచి ఆప్షన్ తీసుకోకుండానే వారిని ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో కలిపేసింది. అలాగే గతంలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో జాయిన్ కాని 78 మంది పేర్లనూ జాబితాలో చేర్చింది. ఫలితంగా రోస్టర్ పాయింట్లు మారిపోయాయి. 141 మంది ఏఎస్ఓ పోస్టుల్లో అప్పట్లో 137 మాత్రమే భర్తీ కాగా అందులో 87 మంది మాత్రమే జాయినయ్యారు. వారిలో కూడా 24 మంది రాజీనామా చేయగా ప్రస్తుతం 63 మంది మాత్రమే పనిచేస్తున్నారు. జాయిన్ కాని వారిని, రాజీనామా చేసిన వారిని కూడా కమిషన్ తాజా జాబితాల్లో చేర్చింది. అలాగే అప్పట్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికై జాయిన్ కాని వారిని కూడా కొత్త జాబితాల్లోకి చేర్చడంతో ఈ పోస్టులు దక్కాల్సిన మెరిట్ జాబితాల్లోని తదుపరి అభ్యర్థులకు నష్టం వాటిల్లుతోందని నిరుద్యోగులు వాపోతున్నారు. ఆ పోస్టుల్లో ఇప్పుడూ ఎవరూ జాయినయ్యే పరిస్థితి లేదని ఫలితంగా అవి మిగిలిపోయే అవకాశమే ఉంటుందని పేర్కొంటున్నారు. వాటిని తదుపరి నోటిఫికేషన్లలోకి మళ్లించేందుకే ఏపీపీఎస్సీ ఇలా చేస్తోందన్న అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. -
2011 గ్రూప్1 ముగిశాకే కొత్త నోటిఫికేషన్
• ముందుగా గ్రూప్ 3, 2 పోస్టులకు పరీక్షలు • గత నోటిఫికేషన్లలో మిగిలిపోయిన పోస్టుల సంఖ్యపై • ఏపీపీఎస్సీ దృష్టి సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ 3, గ్రూప్ 2 పోస్టులకు ముందుగా నోటిఫికేషన్లు జారీచేయాలని, ఆ తర్వాత గ్రూప్ 1 పోస్టులను భర్తీచేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) భావిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2011 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సి ఉన్నందున ఆ ప్రక్రియ ముగిసిన పిదపే కొత్తగా గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయాలని కమిషన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అనుమతిచ్చిన 4,009 పోస్టుల్లో గ్రూప్ 1 పోస్టులు 94 మాత్రమే ఉన్నాయి. తక్కిన పోస్టులన్నీ గ్రూప్ 2, 3 కేటగిరీలోనివే. 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్లో పోస్టులు 312 కాగా అందులో ఏపీ కోటా కిందకు 173 వచ్చాయి. గ్రూప్ 1 పోస్టులపై కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం కన్నా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పాత నోటిఫికేషన్లలో మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేస్తారు. అందులో ఏవైనా మిగిలిన వాటిని కలుపుకొని కొత్త నోటిఫికేషన్ జారీచేయనున్నారు. ఇదే విధంగా ఏపీపీఎస్సీ ద్వారా 4,009 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. వీటితో పా టు గత నోటిఫికేషన్లలో భర్తీకాకుండా మిగిలి పోయిన పోస్టులను కూడా ప్రస్తుత నోటిఫికేషన్లలో చేర్చాలని కమిషన్ భావిస్తోంది. -
రాష్ట్ర పురోభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం : ప్రొ.కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టి.జేఏసీ) రాష్ట్రంలో వాచ్డాగ్ పాత్రను పోషిస్తుందని ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ తెలిపారు. ప్రజల ఆకాంక్ష సాధనకు ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం పునాదిగా ప్రజలే కేంద్రంగా ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ జేఏసీ ప్రధాన కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ సుదీర్ఘంగా సమావేశమైంది. ఇటీవలి కాలంలో జేఏసీ నుంచి పలు ఉద్యోగ సంఘాలు బయటకు వెళ్లిన నేపథ్యంలో.. తాజాగా జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి దాదాపు ఇరవైకి పైగా ప్రజా సంఘాలు వివిధ జేఏసీ నాయకులు హాజరై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం చైర్మన్ ప్రొ.ఎం.కోదండరామ్ జేఏసీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇక నుంచి జేఏసీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలు తమపై నమ్మకముంచి అనేక పిలుపులకు స్పందించి మద్దతుగా నిలిచారు కాబట్టి వారికి అండగా నిలుస్తామన్నారు. రాష్ట్రంలో సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ లోటుపాట్లు ఎత్తిచూపాలని స్థూలంగా నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో టీ-జేఏసీ నిర్మాణాన్ని విస్తృత పరచాలని, అందుకోసం నిర్మాణాత్మక కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. జేఏసీ నుంచి ఇటీవలి కాలంలో పలు ఉద్యోగ సంఘాలు వెళ్లిపోవడాన్ని తప్పు పట్టడంలేదని, ప్రతీ సంఘానికి స్వేచ్ఛ ఉంటుందని, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందన్నారు. అయితే వారు ఇన్నాళ్లు తమతో కలిసి నిర్వహించిన పాత్రను గుర్తు పెట్టుకుంటామన్నారు. అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏ ప్రయత్నాలోనైనా తమవంతు భాగస్వామ్యం నిర్వహిస్తామన్నారు. టీచర్ల నియామకాలు చేపట్టడంతోపాటు గ్రూప్ -2 పోస్టులు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లోని అన్ని పోస్టులకు వయోపరిమితి పెంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రొ.కోదండరాం విజ్ఞప్తి చేశారు. రాజకీయపార్టీలను జేఏసీలోకి చేర్చుకోం.. తమ టీంను ఇక నుంచి టీ-జేఏసీగానే పిలవాలని కోదండరామ్ కోరారు. జేఏసీలోకి కలిసి వచ్చే ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకుంటామని, రాజకీయ పార్టీలను మాత్రం చేర్చుకోబోమన్నారు. అయితే అంశాల ఆధారంగా అవసరమైనప్పుడు రాజకీయపార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్న ఇరిగేషన్ పాలసీపై అధ్యయనం చేసిన తర్వాతనే తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. దీనిపై అనుభవజ్ఞులైన వారితో చర్చించి అభిప్రాయం వ్యక్తంచేస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై అసెంబ్లీలో సమగ్రమైన చర్చ జరగాలని, అలాగే తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఎమ్మెల్యేలకు అందజేస్తామన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో పశువులకు మేత విషయమై త్వరలో రెవెన్యూమంత్రితో సమావేశమవుతామన్నారు.