2011 గ్రూప్1 ముగిశాకే కొత్త నోటిఫికేషన్
• ముందుగా గ్రూప్ 3, 2 పోస్టులకు పరీక్షలు
• గత నోటిఫికేషన్లలో మిగిలిపోయిన పోస్టుల సంఖ్యపై
• ఏపీపీఎస్సీ దృష్టి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ 3, గ్రూప్ 2 పోస్టులకు ముందుగా నోటిఫికేషన్లు జారీచేయాలని, ఆ తర్వాత గ్రూప్ 1 పోస్టులను భర్తీచేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) భావిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2011 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సి ఉన్నందున ఆ ప్రక్రియ ముగిసిన పిదపే కొత్తగా గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయాలని కమిషన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అనుమతిచ్చిన 4,009 పోస్టుల్లో గ్రూప్ 1 పోస్టులు 94 మాత్రమే ఉన్నాయి.
తక్కిన పోస్టులన్నీ గ్రూప్ 2, 3 కేటగిరీలోనివే. 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్లో పోస్టులు 312 కాగా అందులో ఏపీ కోటా కిందకు 173 వచ్చాయి. గ్రూప్ 1 పోస్టులపై కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం కన్నా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పాత నోటిఫికేషన్లలో మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేస్తారు. అందులో ఏవైనా మిగిలిన వాటిని కలుపుకొని కొత్త నోటిఫికేషన్ జారీచేయనున్నారు. ఇదే విధంగా ఏపీపీఎస్సీ ద్వారా 4,009 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. వీటితో పా టు గత నోటిఫికేషన్లలో భర్తీకాకుండా మిగిలి పోయిన పోస్టులను కూడా ప్రస్తుత నోటిఫికేషన్లలో చేర్చాలని కమిషన్ భావిస్తోంది.