సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 1999 గ్రూప్–2 పోస్టులకు సంబంధించి తాజాగా విడుదల చేసిన జాబితాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా జాబితాను రూపొందించడంతో తాము అవకాశాలు కోల్పోతున్నామని ఆ పరీక్షల్లో మెరిట్ సాధించి నిరుద్యోగులుగా ఉన్న అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. 78 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులతోపాటు మరో 70 ఎగ్జిక్యూటివ్ పోస్టులు మెరిట్ జాబితాల్లో ఉన్నవారికి దక్కకుండా పోతున్నాయని అంటున్ను.
ఆదినుంచి వివాదాలమయమే..
1999లో 104 ఎగ్జిక్యూటివ్, 141 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌ఓ) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి 2000లో పరీక్ష నిర్వహించింది. అదే ఏడాది ఎగ్జిక్యూటివ్ పోస్టులను, 2002లో ఏఎస్‌ఓ పోస్టులను భర్తీ చేసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో 2004లో 973 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 199 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఇదే నోటిఫికేషన్‌కు జతచేసి మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చారు. అయితే మెరిట్‌లో తమకంటే తక్కువగా ఉన్నవారిని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపిక చేయడం వల్ల తాము నష్టపోయామని ఏఎస్‌ఓలుగా ఎంపికైనవారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈలోగా ఏపీపీఎస్సీ ఇదే నోటిఫికేషన్ కింద 2011లో మరో 111 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది.
2015లో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు
వాద, ప్రతివాదనల అనంతరం 2015, ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు మళ్లీ జాబితాలు రూపొందించి పోస్టులు కేటాయించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జాబితాలు రూపొందించినా పలు లోపాలతో వాటిపై మళ్లీ వివాదాలు ఏర్పడ్డాయి. ఫలితంగా విడుదల చేసిన జాబితాలను ఏపీపీఎస్సీ ఆరుసార్లు మార్పు చేసింది. చివరికి 2000లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు పొందిన వారిని, సుప్రీంకోర్టులో కేసు వేసి తమకు ఎగ్జిక్యూటివ్ పోస్టులు వద్దన్న ఏఎస్‌ఓలను మినహాయించి కొత్త జాబితా విడుదల చేసింది.
మొత్తం 1424 పోస్టులను నోటిఫై చేసిన ఏపీపీఎస్సీ తాజా జాబితా నుంచి 487 పోస్టులను మినహాయించింది. క్యారీఫార్వర్డ్ అయ్యాయన్న కారణంతో వీటిని మినహాయించి 937 పోస్టులకు మాత్రమే జాబితా ఇచ్చింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా క్యారీఫార్వర్డ్ పోస్టులతో సహా మొత్తం అన్ని పోస్టులకూ కొత్తగా జాబితా రూపొందించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా గతంలో అన్యాయం జరిగిందన్న ఏఎస్‌ఓలతో మాట్లాడి ఎగ్జిక్యూటివ్ పోస్టులు కావాలో వద్దో ఆప్షన్ తీసుకొని ఆ మేరకు మార్పులు చేయాలని సూచించింది. అయితే ఏపీపీఎస్సీ 141 మంది ఏఎస్‌ఓల నుంచి ఆప్షన్ తీసుకోకుండానే వారిని ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో కలిపేసింది. అలాగే గతంలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో జాయిన్ కాని 78 మంది పేర్లనూ జాబితాలో చేర్చింది. ఫలితంగా రోస్టర్ పాయింట్లు మారిపోయాయి. 141 మంది ఏఎస్‌ఓ పోస్టుల్లో అప్పట్లో 137 మాత్రమే భర్తీ కాగా అందులో 87 మంది మాత్రమే జాయినయ్యారు. వారిలో కూడా 24 మంది రాజీనామా చేయగా ప్రస్తుతం 63 మంది మాత్రమే పనిచేస్తున్నారు.
జాయిన్ కాని వారిని, రాజీనామా చేసిన వారిని కూడా కమిషన్ తాజా జాబితాల్లో చేర్చింది. అలాగే అప్పట్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికై జాయిన్ కాని వారిని కూడా కొత్త జాబితాల్లోకి చేర్చడంతో ఈ పోస్టులు దక్కాల్సిన మెరిట్ జాబితాల్లోని తదుపరి అభ్యర్థులకు నష్టం వాటిల్లుతోందని నిరుద్యోగులు వాపోతున్నారు. ఆ పోస్టుల్లో ఇప్పుడూ ఎవరూ జాయినయ్యే పరిస్థితి లేదని ఫలితంగా అవి మిగిలిపోయే అవకాశమే ఉంటుందని పేర్కొంటున్నారు. వాటిని తదుపరి నోటిఫికేషన్లలోకి మళ్లించేందుకే ఏపీపీఎస్సీ ఇలా చేస్తోందన్న అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment