unemployes
-
ఇంటికో ఉద్యోగమేది?
నేరడిగొండ(బోథ): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బెజ్జంకి అనిల్‌కుమార్ ధ్వజమెత్తారు. పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం మంగళవారం మండలకేంద్రంలో నిర్వహించారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నాయకులు ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాని అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారన్నారు. కాని ప్రభుత్వం వారికి మొండిచేయి చూపిస్తుందని ఆరోపించారు. నోటిఫికేషన్లతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్ సీపీ ఉద్యమిస్తుందన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి గోవింద్‌నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో అధికారంలోకి వచ్చి నేడు హామీలను అమలుపర్చడంలో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయకుండా తాత్సారం చేస్తూ నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి గంగాధర్, షేక్ అస్లం, మండల అధ్యక్షుడు ఏలేటి రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ టోకరా!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 1999 గ్రూప్–2 పోస్టులకు సంబంధించి తాజాగా విడుదల చేసిన జాబితాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా జాబితాను రూపొందించడంతో తాము అవకాశాలు కోల్పోతున్నామని ఆ పరీక్షల్లో మెరిట్ సాధించి నిరుద్యోగులుగా ఉన్న అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. 78 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులతోపాటు మరో 70 ఎగ్జిక్యూటివ్ పోస్టులు మెరిట్ జాబితాల్లో ఉన్నవారికి దక్కకుండా పోతున్నాయని అంటున్ను. ఆదినుంచి వివాదాలమయమే.. 1999లో 104 ఎగ్జిక్యూటివ్, 141 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి 2000లో పరీక్ష నిర్వహించింది. అదే ఏడాది ఎగ్జిక్యూటివ్ పోస్టులను, 2002లో ఏఎస్ఓ పోస్టులను భర్తీ చేసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో 2004లో 973 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 199 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఇదే నోటిఫికేషన్‌కు జతచేసి మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చారు. అయితే మెరిట్లో తమకంటే తక్కువగా ఉన్నవారిని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపిక చేయడం వల్ల తాము నష్టపోయామని ఏఎస్‌ఓలుగా ఎంపికైనవారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈలోగా ఏపీపీఎస్సీ ఇదే నోటిఫికేషన్ కింద 2011లో మరో 111 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. 2015లో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు వాద, ప్రతివాదనల అనంతరం 2015, ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు మళ్లీ జాబితాలు రూపొందించి పోస్టులు కేటాయించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జాబితాలు రూపొందించినా పలు లోపాలతో వాటిపై మళ్లీ వివాదాలు ఏర్పడ్డాయి. ఫలితంగా విడుదల చేసిన జాబితాలను ఏపీపీఎస్సీ ఆరుసార్లు మార్పు చేసింది. చివరికి 2000లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు పొందిన వారిని, సుప్రీంకోర్టులో కేసు వేసి తమకు ఎగ్జిక్యూటివ్ పోస్టులు వద్దన్న ఏఎస్ఓలను మినహాయించి కొత్త జాబితా విడుదల చేసింది. మొత్తం 1424 పోస్టులను నోటిఫై చేసిన ఏపీపీఎస్సీ తాజా జాబితా నుంచి 487 పోస్టులను మినహాయించింది. క్యారీఫార్వర్డ్ అయ్యాయన్న కారణంతో వీటిని మినహాయించి 937 పోస్టులకు మాత్రమే జాబితా ఇచ్చింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా క్యారీఫార్వర్డ్ పోస్టులతో సహా మొత్తం అన్ని పోస్టులకూ కొత్తగా జాబితా రూపొందించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా గతంలో అన్యాయం జరిగిందన్న ఏఎస్‌ఓలతో మాట్లాడి ఎగ్జిక్యూటివ్ పోస్టులు కావాలో వద్దో ఆప్షన్ తీసుకొని ఆ మేరకు మార్పులు చేయాలని సూచించింది. అయితే ఏపీపీఎస్సీ 141 మంది ఏఎస్ఓల నుంచి ఆప్షన్ తీసుకోకుండానే వారిని ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో కలిపేసింది. అలాగే గతంలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో జాయిన్ కాని 78 మంది పేర్లనూ జాబితాలో చేర్చింది. ఫలితంగా రోస్టర్ పాయింట్లు మారిపోయాయి. 141 మంది ఏఎస్ఓ పోస్టుల్లో అప్పట్లో 137 మాత్రమే భర్తీ కాగా అందులో 87 మంది మాత్రమే జాయినయ్యారు. వారిలో కూడా 24 మంది రాజీనామా చేయగా ప్రస్తుతం 63 మంది మాత్రమే పనిచేస్తున్నారు. జాయిన్ కాని వారిని, రాజీనామా చేసిన వారిని కూడా కమిషన్ తాజా జాబితాల్లో చేర్చింది. అలాగే అప్పట్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికై జాయిన్ కాని వారిని కూడా కొత్త జాబితాల్లోకి చేర్చడంతో ఈ పోస్టులు దక్కాల్సిన మెరిట్ జాబితాల్లోని తదుపరి అభ్యర్థులకు నష్టం వాటిల్లుతోందని నిరుద్యోగులు వాపోతున్నారు. ఆ పోస్టుల్లో ఇప్పుడూ ఎవరూ జాయినయ్యే పరిస్థితి లేదని ఫలితంగా అవి మిగిలిపోయే అవకాశమే ఉంటుందని పేర్కొంటున్నారు. వాటిని తదుపరి నోటిఫికేషన్లలోకి మళ్లించేందుకే ఏపీపీఎస్సీ ఇలా చేస్తోందన్న అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. -
నిరుద్యోగం కాటేసింది..
‘అమ్మా నాన్నా.. అవ్వా.. తాతా.. నేను ఇలా చేయడం తప్పే.. అయితే నాకు వేరే దారి కన్పించలేదు.. జీవితం మీద విరక్తి వచ్చింది.. ఇలా మీకు తెలీకుండా వెళ్లిపోతున్నందుకు నన్ను క్షమించండి. నేను ఇలా వెళ్లిపోవడానికి కారణం నాకు జాబు రాకపోవడమే..’ – వడ్డె నవీన్ అనే నిరుద్యోగి సూసైడ్‌నోట్ ‘ఎమ్మెస్సీ బీఈడీ చేశాను.. మూడేళ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను.. కుటుంబం గడవడం కష్టమవుతోంది.. ఇంకా ఉద్యోగం రాలేదా.. అంటూ అందరూ అడుగుతున్నారు.. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు.. ఇక లాభం లేదు.. అందుకే చనిపోతున్నా..’ – గాంధీ అలియాస్ శ్రీను అనే నిరుద్యోగి సూసైడ్ నోట్ అనంతపురం/నక్కపల్లి/పాయకరావుపేట : ఉన్నత విద్య అభ్యసించి ఏళ్ల తరబడి ఎదురు చూసినా ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఇద్దరు నిరుద్యోగులు బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. బీటెక్ పూర్తి చేసిన అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన నవీన్ (23) ఉరి వేసుకుని, ఎమ్మెస్సీ, బీఈడీ చదివిన విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం మంగవరం గ్రామానికి చెందిన పాలిక గాంధీ అలియాస్ శ్రీను(28) పురుగు మందు తాగి తనువు చాలించారు. ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. మృతుల కుటుంబీకులు, పోలీసుల కథనం మేరకు.. నవీన్ తండ్రి ఆదినారాయణ పరిగి తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్. వీరిది పేద కుటుంబం. ఆయన సంతానంలో నవీన్ చివరి వాడు. హిందూపురంలోని బిట్స్‌లో బీటెక్ పూర్తి చేశాడు. బ్యాంకు ఉద్యోగం కోసం అనంతపురంలోని శ్రీధర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నాడు. కోచింగ్ కోసం బుధవారం ఉదయం అనంతపురం వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కుటుంబ సభ్యులతో మంగళవారం రాత్రి సంతోషంగా గడిపాడు. బుధవారం ఉదయం లేచి అందరితో మాట్లాడాడు. ఇంటిపైన ఉన్న చదువుకునే గదిలోకి వెళ్లాడు. రైలుకు సమయం అవుతున్నా రైలుకు సమయం అవుతోంది.. ఇంకా రాలేదేంటని తల్లి మిద్దె పైకి వెళ్లి చూస్తే.. గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కన్పించాడు. నవీన్ ఎక్కడ ఖాళీలు పడినా పరీక్షలు రాసేవాడని ఎంతగా కష్టపడినా ఉద్యోగం రాకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడక పోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు తెగించాడని కంట తడిపెట్టారు. ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్.. దళిత కుటుంబానికి చెందిన పాలిక గాంధీ అలియాస్ శ్రీను స్వగ్రామం మంగవరం.ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివాడు. గోల్డ్ మెడల్ సాధించాడు. బీఈడీ కూడా పూర్తి చేశాడు. విద్యాభ్యాసం పూరై్త మూడేళ్లు గడిచిపోతున్నా ఉద్యోగం దొరకలేదు. ఆరు నెలల క్రితం చోడవరానికి చెందిన రేవతి అనే యువతితో వివాహం అయింది. ఆమె కూడా పీజీ చదివింది. చోడవరంలోనే ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. గాంధీ.. ఖాళీగా ఉండలేక అచ్యుతాపురం వద్ద ఒక ప్రైవేటు కంపెనీలో రూ.5 వేల జీతానికి ఉద్యోగంలో చేరాడు. మరో వైపు పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నాడు. వస్తున్న జీతం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడంతో ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగం లేని జీవితంపై విరక్తి చెందాడు. బుధవారం యలమంచిలి వెళ్లి కూల్ డ్రింక్‌లో పురుగు మందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికో ఉద్యోగం ఎక్కడ? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఇంటికో ఉద్యోగం పక్కనపెడితే మూడేళ్లలో ఊరికో ఉద్యోగం కూడా ఇచ్చిన పరిస్థితి లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగం రాలేదని నవీన్ ఆత్మహత్య చేసుకున్న వార్త బుధవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయింది. గాంధీ ఆత్మహత్య గురించి కూడా టీవీ చానళ్లలో రావడంతో.. వీరిద్దరివీ ఆత్మహత్యలు కావని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని నెటిజన్లు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబే ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. -
మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన
– 29 కంపెనీల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు – 1500 మంది హాజరు.. 300 మందికి ఉద్యోగాలు – ఉద్యోగాలకు ఎంపికైన వారిని అభినందించిన చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి కల్లూరు : నగర శివారు దూపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. రాయలసీమ జిల్లాలతోపాటు తెలంగాణ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 1500 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మేళాలో 29 కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరిలో సుమారు 300 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జిల్లా చరిత్రలో మెగాజాబ్ మేళా నూతన అధ్యాయాన్ని సృష్టించిందన్నారు. సీమ నిరుద్యోగలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన వారు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆంప్లస్, ఇన్ఫోసిస్ గ్రూపు ఆఫ్ ఇంజనీర్స్ సర్వీస్, హెచ్‌ఐఈఈ, కాన్రాడ్ లైటింగ్ సొల్యూషన్స్, యాక్సిస్ బ్యాంకు, విప్రో, ద రైజ్ సొల్యూషన్స్, డాక్టర్ రెడ్డీస్, స్వాగతం రీసోర్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, జీమూంబా ప్రైవేట్ లిమిటెడ్, ధనుష్ ఇంజనీరింగ్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తదితర 29 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. నియామక ఉత్తర్వులు పొందిన వారు వెంటనే ఉద్యోగాల్లో చేరాలని, ఒక్కొక్కరికి కంపెనీని బట్టి సుమారు రూ.38 వేల వరకు నెలసరి వేతనం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్ తిమ్మయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ
కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ రంగాలో్ల ఉపాధి కల్పన పై ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు స్టీప్ కేరీర్ బిల్డర్స్ సంస్థ నిర్వాహకుడు కనకప్రసాద్ సోమవారం ప్రకటనలో తెలిపారు. దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్యయోజన పథకం కింద ఈ శిక్షణనిస్తున్నట్లు ఆయన తెలిపారు. రిటైల్ రంగంలో ట్రైనీ అసోసియేట్స్‌గా, టెలికాంరంగంలో కాల్‌సెంటర్ రిలేషన్ షిప్ కోర్సుల పై . మూడు నెలల పాటు శిక్షణ, ఉచిత భోజన వసతి కలిస్తామన్నారు. కోర్సుకు సంబంధించిన దుస్తులు, మెటీరియల్ కోర్సు ఉచితంగా అందజేస్తామని తెలియజేశారు. 18–30 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని నంద్యాల రోడ్డు సమీపంలో గురుశంకర్ కాంప్లెక్స్‌లో ఉన్న తమ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 9908974815 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. -
బాబు వచ్చినా జాబు లేదు
‘కేంద్రం ఏమి ఇస్తే అది తీసుకోవాలి.. లేకుంటే అదీ ఉండదు..’ అంటూ సీఎం చంద్రబాబు తెలుగుజాతి గౌరవాన్ని దిగజార్చారు. విభజన వేళ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చరంటూ పోరాడి సాధించుకోవాల్సిన చోట.. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు నోరు పెగలక ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేస్తున్నారు. రచ్చ గెలవడం చేతకాక.. ఇక్కడికొచ్చి ‘ప్రత్యేక హోదా వల్ల ఏం ఒరుగుతుంది’ అంటూ హోదా కోసం పోరాడుతున్నవారిపై చిందులు తొక్కుతున్నారు. మరీ ఏం ఒరుగుతుందని 10 ఏళ్లు హోదా కావాలని విభజన, ఎన్నికల సమయంలో గొంతెత్తారు. ఏం వెలగబెడదామని ‘బాబు రాగానే జాబు అన్నారు.. లేదా ‘నిరుద్యోగ భతి రూ. 2 వేలు’ అని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిధులు లేవని అప్పుడు తెలీదా..? ఇప్పటికైనా కళ్లు తెరిచి, తెలుగు వాడి ఆత్మగౌరవం కేంద్రానికి తెలిసొచ్చేలా.. ప్రత్యేక హోదా ఉద్యమానికి అందరితో కలిసి నడవాలి. తుపాకి గుళ్లకు ఎదురొడ్డి రొమ్ము చూపిన ఆంధ్రకేసరి పౌరుషాన్ని కేంద్రానికి రుచిచూపి మన హోదా మనం సాధించుకోవాలి. అని జిల్లాలోని నిరుద్యోగ యువత, విద్యార్థి లోకం సమరభేరి మోగిస్తోంది. –ఏలూరు సిటీ లెక్కల్లో ఇలా.. జిల్లా ఉపాధి కార్యాలయంలో తమకు ఏదైనా ఉపాధి కల్పించమంటూ 81,561 మంది నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. వీరిలో టెన్త్ అభ్యర్థులు 18,093 మంది, ఇంటర్ 19,226 మంది, డిగ్రీ 19,721, స్టెనో అర్హత కలిగిన వారు 273, టైపిస్ట్ అర్హత కలిగిన వారు 2,912, బీఎడ్ అభ్యర్థులు 2,906, సెకండరీ గ్రేడ్ టీచర్ ఎలిజుబులిటీ కలిగినవారు 1,302, ఇంజినీరింగ్ డిప్లొమా అభ్యర్థులు 1,322, ఐటీఐ 11,217 మంది, ఇతరులు 4,589 మంది ఉన్నారు. వీరితో పాటు బీటెక్ విద్యార్థులు 9 వేలమంది, ఎంబీఏ, ఎంసీఏ, ఎం ఫార్మసీ, ఎంటెక్, ఎంఎస్సీ ఇలా పీజీ అభ్యర్థులు 10 వేల మంది ఉన్నట్టు అంచనా. వీరు కాకుండా ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేయించుకోని నిరుద్యోగులు జిల్లాలో లక్షల్లో ఉన్నారు. డీఎస్సీ–14 నియామకాల్లో జిల్లాలో కేవలం 506 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. బీఎడ్ అభ్యర్థులు 25 వేల మంది ఉంటే ఈ డీఎస్సీలో వారిలో 223 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మశీ, పాలిటెక్నిక్ చేసిన నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. మాకు భవిష్యత్తు ఏదీ? వేలాది రూపాయలు ఖర్చుచేసి ఇంజినీరింగ్ పూర్తిచేసినా ఉద్యోగాలు లేవు. రాష్ట్రానికి ఒక్క కొత్త కంపెనీ కూడా రాలేదు. చదువు పూర్తి చేసిన తరువాత మా భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదు. –పి.వెంకట ఉత్తేజ్, ఇంజనీరింగ్ విద్యార్థి, ఏలూరు నిరుద్యోగ భృతి ఇస్తారా? నిరుద్యోగులకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లు గడిచినా ఒక్క మాట మాట్లాడడం లేదు. నిరుద్యోగ యువత అంతా నిరాశలో ఉన్నారు. ఇప్పటికైనా నిరుద్యోగభృతి ఇవ్వాలి. –అడపా సుదర్శనం, విద్యార్థి, ఏలూరు ప్రత్యేక హోదాతోనే.. ప్రత్యేకహోదా వస్తేనే రాష్ట్రానికి కంపెనీలు, సంస్థలు వస్తాయి. అప్పుడే నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.–కంతేటి మోహన్‌కుమార్, నిరుద్యోగి, ఏలూరు రాష్ట్రాన్ని ముంచేశారు రాష్ట్ర విభజన అనంతరం ఏపీ దీనస్థితిలోకి వెళ్లింది. కేవలం రాజధాని మాత్రమే నిర్మిస్తే సరిపోతుందా? మిగిలిన జిల్లాల్లోని విద్యార్థులు, నిరుద్యోగ యువత పరిస్థితి ఏమి కావాలి. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం దారుణం. జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అధికారులు చెప్పాలి. కేవలం మార్కెటింగ్‌లో పదిమందికి తాత్కాలిక ఉద్యోగాలు ఇస్తే సరిపోతుందా? ఇప్పటికైనా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ముంచేసే నిర్ణయాలు వదిలి మేలు చేసేందుకు కృషి చేయాలి.–బత్తుల సాగర్‌బాబు, విద్యార్థి, ఏలూరు -
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) వారి ద్వారా నిరుద్యోగ యువకులకు ల్యాండ్ సర్వే, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో మూడునెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఈడీ సర్వయ్య, న్యాక్ ఏడీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, ఐటీఐ(సివిల్/ఎలక్ట్రిషియన్) చదివిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణకు 18 నుంచి 35ఏళ్ల మధ్య వయస్కులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు డ్వామా ఆఫీసు క్యాంపస్‌లోని నాక్ కార్యాలయాన్ని సంప్రదించాలని, వివరాలకు 9440683583 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు..!
– విద్య, వైద్యారోగ్యశాఖల్లో భర్తీకాని పోస్టులు – నత్తనడకన ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకం – సగం స్టాఫ్ నర్సు పోస్టులనే భర్తీ చేసిన వైనం – విడుదల కాని వైద్య ఆరోగ్య మిత్రల ఇంటర్వ్యూ ఫలితాలు – కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఖాళీలపై ఆలసత్వం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది జిల్లాలోని పోస్టుల భర్తీ ప్రక్రియ. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీల్లో ఆయా పోస్టులను ఔట్సోర్సింగ్/కాంట్రాక్ట్/రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాల్సి ఉంది. ఇందు కోసం ఆయా శాఖల అధికారులు పలుమార్లు కలెక్టర్‌కు ఫైల్‌ను పంపినా పలు కారణాలతో తిరస్కరిస్తున్నారు. దీంతో జిల్లాలో సుమారు 250 పోస్టుల భర్తీకి ఆమోదం లభించడంలేదు. సా...గుతున్న ప్రక్రియ జిల్లాలోని 33 మోడల్ స్కూళ్లలో ఒక్కోదానికి ఒక్క కంప్యూటర్ టీచర్, ఒక్క జూనియర్ అసిస్టెంటు, ఒక్క అటెండర్, ఒక్క వాచ్‌మన్ మొత్తం 132 పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసుకోవడానికి 2015–16 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో జూనియర్ అసిస్టెంటు, అటెండర్, వాచ్‌మన్ పోస్టులకు గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో జూనియర్ అసిస్టెంటు, వాచ్‌మన్ పోస్టులకు నెల రోజుల క్రితం రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయినా ఇప్పటి వరకు ఫలితాలను ప్రకటించలేదు. ఇక అటెండర్ పోస్టుకు పరీక్షగాని, ఇంటర్వ్యూకాదని జరపలేదు. మరోవైపు కంప్యూటర్ టీచర్ పోస్టులకు ఇప్పటి వరకు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఫలితంగా మోడల్ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఏడాదిగా కంప్యూటర్ విద్యకు నోచుకోవడంలేదు. ఫలితాలు ఎప్పుడో? జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు 150 ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా పోస్టులకు ఇంటర్వ్యూలు కూడా జరిపారు. మూడు నెలలు గడిచిన ఫలితాలను ప్రకటించకపోవడంతో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖల అధికారులను ఫలితాలపై వాకబు చేస్తే కలెక్టర్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటున్నారు. తప్పని ఎదురుచూపు.. జిల్లావ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలు, జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ హాస్పిటల్లో పనిచేయడానికి 150 స్టాఫ్ నర్సు పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో కలెక్టర్ అనుమతి మేరకు వైద్యారోగ్యశాఖాధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా మెరిట్ ప్రతిపాదికన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. మొత్తం పోస్టుల్లో 98 పోస్టులను మూడు నెలల క్రితం భర్తీ చేశారు. అందులో మరో ఏడు పోస్టులకు నియామకాలు జరిగాయి. అయితే మిగిలిన 45 పోస్టుల భర్తీ విషయంలో కలెక్టర్ నోరు మెదపడం లేదు. ఈ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కాగా, పెద్దాసుపత్రిలో 29 ప్యారామెడికల్ సిబ్బంది పోస్టులకు భర్తీ చేసుకోవాల్సి ఉండగా అందులో 22మంది తీసుకున్నారు. మిగిలిన ఏడు పోస్టులను భర్తీ చేయలేదు. వీటి భర్తీ కోసం మెరిట్లో ఉన్న అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం.. జిల్లాలో దాదాపుగా ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇందులో పదో తరగతి మొదలు కొని పీహెచ్డీ చేసిన వారి వరకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అత్రుతతో ఎదురు చూస్తున్నారు. అయితే రెగ్యులర్/ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసుకోవాలని పలు పోస్టులకు రాష్ట్రం ప్రభుత్వం అనుమతిఇచ్చినా ఏళ్లకు ఏళ్లు నియమించకపోవడంపై నిరుద్యోగులు ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం: లెనిన్‌బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పోస్టులను భర్తీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. మోడల్ స్కూళ్లలో ఏడాది నుంచి పోస్టులను భర్తీ చేయకపోవడం దారుణం. జిల్లా కలెక్టర్ తీరు బాధాకరం. వైద్య ఆరోగ్యశాఖల భర్తీకి చర్యలు తీసుకోవాలి. లేదంటే నిరుద్యోగులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం.