నిరుద్యోగం కాటేసింది.. | Two unemployed suicides | Sakshi
Sakshi News home page

నిరుద్యోగం కాటేసింది..

Published Thu, Oct 12 2017 2:05 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Two unemployed suicides - Sakshi

‘అమ్మా నాన్నా.. అవ్వా.. తాతా.. నేను ఇలా చేయడం తప్పే.. అయితే నాకు వేరే దారి కన్పించలేదు.. జీవితం మీద విరక్తి వచ్చింది.. ఇలా మీకు తెలీకుండా వెళ్లిపోతున్నందుకు నన్ను క్షమించండి. నేను ఇలా వెళ్లిపోవడానికి కారణం నాకు జాబు రాకపోవడమే..’ 
– వడ్డె నవీన్‌ అనే నిరుద్యోగి సూసైడ్‌నోట్‌ 
 
‘ఎమ్మెస్సీ బీఈడీ చేశాను.. మూడేళ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను.. కుటుంబం గడవడం కష్టమవుతోంది.. ఇంకా ఉద్యోగం రాలేదా.. అంటూ అందరూ అడుగుతున్నారు.. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు.. ఇక లాభం లేదు.. అందుకే చనిపోతున్నా..’ 
– గాంధీ అలియాస్‌ శ్రీను అనే నిరుద్యోగి సూసైడ్‌ నోట్‌ 

అనంతపురం/నక్కపల్లి/పాయకరావుపేట : ఉన్నత విద్య అభ్యసించి ఏళ్ల తరబడి ఎదురు చూసినా ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఇద్దరు నిరుద్యోగులు బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. బీటెక్‌ పూర్తి చేసిన అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన నవీన్‌ (23) ఉరి వేసుకుని, ఎమ్మెస్సీ, బీఈడీ చదివిన విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం మంగవరం గ్రామానికి చెందిన పాలిక గాంధీ అలియాస్‌ శ్రీను(28) పురుగు మందు తాగి తనువు చాలించారు. ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. మృతుల కుటుంబీకులు, పోలీసుల కథనం మేరకు.. నవీన్‌ తండ్రి ఆదినారాయణ పరిగి తహసీల్దార్‌ కార్యాలయంలో అటెండర్‌. వీరిది పేద కుటుంబం. ఆయన సంతానంలో నవీన్‌ చివరి వాడు. హిందూపురంలోని బిట్స్‌లో బీటెక్‌ పూర్తి చేశాడు. బ్యాంకు ఉద్యోగం కోసం అనంతపురంలోని శ్రీధర్‌ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నాడు. కోచింగ్‌ కోసం బుధవారం ఉదయం అనంతపురం వెళ్లేందుకు  సిద్ధమయ్యాడు. కుటుంబ సభ్యులతో మంగళవారం రాత్రి సంతోషంగా గడిపాడు. బుధవారం ఉదయం లేచి అందరితో మాట్లాడాడు. ఇంటిపైన ఉన్న చదువుకునే గదిలోకి వెళ్లాడు. 

రైలుకు సమయం అవుతున్నా
రైలుకు సమయం అవుతోంది.. ఇంకా రాలేదేంటని తల్లి  మిద్దె పైకి వెళ్లి చూస్తే.. గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కన్పించాడు. నవీన్‌ ఎక్కడ ఖాళీలు పడినా పరీక్షలు రాసేవాడని ఎంతగా కష్టపడినా ఉద్యోగం రాకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడక పోవడంతో  మనస్తాపానికి గురై ఆత్మహత్యకు తెగించాడని కంట తడిపెట్టారు.

ఎమ్మెస్సీ గోల్డ్‌ మెడలిస్ట్‌.. 
దళిత కుటుంబానికి చెందిన పాలిక గాంధీ అలియాస్‌ శ్రీను స్వగ్రామం మంగవరం.ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివాడు. గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. బీఈడీ కూడా పూర్తి చేశాడు. విద్యాభ్యాసం పూరై్త మూడేళ్లు గడిచిపోతున్నా ఉద్యోగం దొరకలేదు. ఆరు నెలల క్రితం చోడవరానికి చెందిన రేవతి అనే యువతితో వివాహం అయింది. ఆమె కూడా పీజీ చదివింది. చోడవరంలోనే ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. గాంధీ.. ఖాళీగా ఉండలేక అచ్యుతాపురం వద్ద ఒక ప్రైవేటు కంపెనీలో రూ.5 వేల జీతానికి ఉద్యోగంలో చేరాడు. మరో వైపు పోటీ పరీక్షలకు కోచింగ్‌ తీసుకుంటున్నాడు. వస్తున్న జీతం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడంతో ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగం లేని జీవితంపై విరక్తి చెందాడు. బుధవారం యలమంచిలి వెళ్లి కూల్‌ డ్రింక్‌లో పురుగు మందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఇంటికో ఉద్యోగం ఎక్కడ?
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఇంటికో ఉద్యోగం పక్కనపెడితే మూడేళ్లలో ఊరికో ఉద్యోగం కూడా ఇచ్చిన పరిస్థితి లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగం రాలేదని నవీన్‌ ఆత్మహత్య చేసుకున్న వార్త బుధవారం ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.  గాంధీ ఆత్మహత్య గురించి కూడా టీవీ చానళ్లలో రావడంతో.. వీరిద్దరివీ ఆత్మహత్యలు కావని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని నెటిజన్లు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబే ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement