సంతకాల సేకరణ నిర్వహిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు
నేరడిగొండ(బోథ): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బెజ్జంకి అనిల్‌కుమార్ ధ్వజమెత్తారు. పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం మంగళవారం మండలకేంద్రంలో నిర్వహించారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ నాయకులు ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
కాని అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారన్నారు. కాని ప్రభుత్వం వారికి మొండిచేయి చూపిస్తుందని ఆరోపించారు. నోటిఫికేషన్‌లతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిరుద్యోగుల పక్షాన వైఎస్‌ఆర్ సీపీ ఉద్యమిస్తుందన్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి గోవింద్‌నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో అధికారంలోకి వచ్చి నేడు హామీలను అమలుపర్చడంలో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయకుండా తాత్సారం చేస్తూ నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి గంగాధర్, షేక్ అస్లం, మండల అధ్యక్షుడు ఏలేటి రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment