నిరుద్యోగుల ఆశలపై నీళ్లు..!
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు..!
Published Tue, Jul 26 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
– విద్య, వైద్యారోగ్యశాఖల్లో భర్తీకాని పోస్టులు
– నత్తనడకన ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకం
– సగం స్టాఫ్ నర్సు పోస్టులనే భర్తీ చేసిన వైనం
– విడుదల కాని వైద్య ఆరోగ్య మిత్రల ఇంటర్వ్యూ ఫలితాలు
– కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఖాళీలపై ఆలసత్వం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది జిల్లాలోని పోస్టుల భర్తీ ప్రక్రియ. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీల్లో ఆయా పోస్టులను ఔట్‌సోర్సింగ్/కాంట్రాక్ట్/రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాల్సి ఉంది. ఇందు కోసం ఆయా శాఖల అధికారులు పలుమార్లు కలెక్టర్‌కు ఫైల్‌ను పంపినా పలు కారణాలతో తిరస్కరిస్తున్నారు. దీంతో జిల్లాలో సుమారు 250 పోస్టుల భర్తీకి ఆమోదం లభించడంలేదు.
సా...గుతున్న ప్రక్రియ
జిల్లాలోని 33 మోడల్ స్కూళ్లలో ఒక్కోదానికి ఒక్క కంప్యూటర్ టీచర్, ఒక్క జూనియర్ అసిస్టెంటు, ఒక్క అటెండర్, ఒక్క వాచ్‌మన్ మొత్తం 132 పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసుకోవడానికి 2015–16 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో జూనియర్ అసిస్టెంటు, అటెండర్, వాచ్‌మన్ పోస్టులకు గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో జూనియర్ అసిస్టెంటు, వాచ్‌మన్ పోస్టులకు నెల రోజుల క్రితం రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయినా ఇప్పటి వరకు ఫలితాలను ప్రకటించలేదు. ఇక అటెండర్ పోస్టుకు పరీక్షగాని, ఇంటర్వ్యూకాదని జరపలేదు. మరోవైపు కంప్యూటర్ టీచర్ పోస్టులకు ఇప్పటి వరకు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఫలితంగా మోడల్ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఏడాదిగా కంప్యూటర్ విద్యకు నోచుకోవడంలేదు.
ఫలితాలు ఎప్పుడో?
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు 150 ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా పోస్టులకు ఇంటర్వ్యూలు కూడా జరిపారు. మూడు నెలలు గడిచిన ఫలితాలను ప్రకటించకపోవడంతో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖల అధికారులను ఫలితాలపై వాకబు చేస్తే కలెక్టర్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటున్నారు.
తప్పని ఎదురుచూపు..
జిల్లావ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలు, జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ హాస్పిటల్‌లో పనిచేయడానికి 150 స్టాఫ్ నర్సు పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో కలెక్టర్ అనుమతి మేరకు వైద్యారోగ్యశాఖాధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా మెరిట్ ప్రతిపాదికన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. మొత్తం పోస్టుల్లో 98 పోస్టులను మూడు నెలల క్రితం భర్తీ చేశారు. అందులో మరో ఏడు పోస్టులకు నియామకాలు జరిగాయి. అయితే మిగిలిన 45 పోస్టుల భర్తీ విషయంలో కలెక్టర్ నోరు మెదపడం లేదు. ఈ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కాగా, పెద్దాసుపత్రిలో 29 ప్యారామెడికల్ సిబ్బంది పోస్టులకు భర్తీ చేసుకోవాల్సి ఉండగా అందులో 22మంది తీసుకున్నారు. మిగిలిన ఏడు పోస్టులను భర్తీ చేయలేదు. వీటి భర్తీ కోసం మెరిట్‌లో ఉన్న అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.
అధికారుల తీరుపై ఆగ్రహం..
జిల్లాలో దాదాపుగా ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇందులో పదో తరగతి మొదలు కొని పీహెచ్‌డీ చేసిన వారి వరకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అత్రుతతో ఎదురు చూస్తున్నారు. అయితే రెగ్యులర్/ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసుకోవాలని పలు పోస్టులకు రాష్ట్రం ప్రభుత్వం అనుమతిఇచ్చినా ఏళ్లకు ఏళ్లు నియమించకపోవడంపై నిరుద్యోగులు ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం: లెనిన్‌బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పోస్టులను భర్తీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. మోడల్ స్కూళ్లలో ఏడాది నుంచి పోస్టులను భర్తీ చేయకపోవడం దారుణం. జిల్లా కలెక్టర్ తీరు బాధాకరం. వైద్య ఆరోగ్యశాఖల భర్తీకి చర్యలు తీసుకోవాలి. లేదంటే నిరుద్యోగులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం.
Advertisement
Advertisement